NIA Raids: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ, ఈడీ సోదాలు - ఆ పార్టీ ఆఫీసులే లక్ష్యంగా! ఏపీ, తెలంగాణలోనూ
NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. టెర్రర్ ఫండింగ్ పై ఎస్డీపీఐ, పీఎఫ్ఐ కార్యకలాపాలపై ఈరోజు వేకువ జాము నుంచే సోదాలు జరుగుతున్నాయి.
NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. కర్నూలులో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్డీపీఐ నేత అబ్దుల్ వారిజ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల నుండి తనిఖీలు కొనసాగుతున్నాయి. అబ్దుల్ వారిజ్ ఇంట్లో కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్డీపీఐ నేత ఇంటికి వచ్చిన ఎన్ఐఏ అధికారులను ఎస్డిపీఐ నాయకులు అడ్డుకున్నారు. తమ నాయకుడి ఇంట్లో ఏం స్వాధీనం చేసుకున్నారంటూ అధికారులను నిలదీశారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్ఐఏ దాడులు..
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్ఐఏ దాడులు ఆపాలని నిరసనలు చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో తమ ఇళ్లపై దాడులు చేసిన ఎస్డీపీఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) నాయకులను, కార్యకర్తలను అరెస్టులు చేయడంపై మండిపడ్డారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా తమ కార్యకర్తలపై దాడులు చేయిస్తోందని ఆరోపిస్తున్నారు. ఎన్ఐఏ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినదించారు. గుంటూరులోని ఆటోనగర్ లోనూ ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా PFI కార్యాలయాలు లక్ష్యంగా ఎన్ఐఏ సోదాలు..
తెలంగాణలోనూ ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. టెర్రర్ ఫండింగ్ వ్యవహారంలో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాలే కాక, దేశ వ్యాప్తంగా ఉన్న పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ అధికారులు దాడులు చేస్తున్నారు. యూపీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పీఎఫ్ఐ కార్యకలాపాలపై సోదాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పీఎఫ్ఐకి చెందిన సుమారు 100 మంది ప్రముఖులను ఎన్ఐఏ అరెస్టు చేసింది.
తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు ఏపీలోని కర్నూలు, గుంటూరులో తనిఖీలు చేస్తోంది. పీఎఫ్ఐ కార్యకలాపాలపై ఎన్ఐఏ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. పీఎఫ్ఐకి చెందిన కీలక వ్యక్తుల నివాసాలపైనా దాడులు చేస్తున్నారు అధికారులు. రెండు రోజుల క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పీఎఫ్ఐ కార్యకలాపాలపై ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తూ వస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పలువురిని అదుపులోకి తీసుకుని వారిని హైదరాబాద్ కు తీసుకువచ్చి ఇక్కడ వారిని ప్రశ్నిస్తున్నారు.
నేటి ఉదయం నుంచే ఆపరేషన్..
ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తెల్లవారుజామున నుండి జరుగుతున్న ఆపరేషన్ లో ఎన్ఐఏతో పాటు ఈడీ, స్థానిక పోలీసులు కూడా ఉన్నారు. ఉగ్రవాదానికి ఫండింగ్ సమకూర్చడం, శిక్షణ నిర్వహించం, ఉగ్రవాద సంస్థల్లో చేరేందుకు ప్రోత్సహించడం, వారిని మానసికంగా అటు వైపు మళ్లించడం వంటి అనేక కార్యకలాపాలపై ఎన్ఐఏ దేశవ్యాప్తంగా సోదాలు చేస్తోంది. పీఎఫ్ఐ దాని విద్యార్థి విభాగానికి నిధులు సమకూర్చిన వ్యవహారంపై ఈడీ శోధన చేపట్టింది. ఎన్ఐఏ, ఈడీ సంయుక్తంగా చేస్తున్న ఈ ఆపరేషన్ ను.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఉగ్రవాద మూలాలు, శిక్షణ వంటి వ్యవహారాలు పెద్ద ఎత్తున దేశంలో బయట పడటంతో హోం శాఖ దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. బీహార్, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దిల్లీ, యూపీ, రాజస్థాన్, కర్ణాటకలో జాయింట్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సమాచారం.
గత ఆదివారం ఉదయం తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, భైంసాతో పాటు ఏపీలోని నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెంలో సోదాలు జరుగుతున్నాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలపై ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. నిజామాబాద్ లో మొత్తం 20 చోట్ల ఎన్ఐఏ బృందాలు ఏకకాలం సోదాలు జరిగాయి.