Hyderabad Vijayawada Road: హైదరాబాద్ - విజయవాడ రహదారి విస్తరణ వివాదం, ఆ తీర్పు వచ్చాకే 6 వరుసలపై నిర్ణయం
Hyderabad Vijayawada Road: హైదరాబాద్ - విజయవాడ రహదారి విస్తరణ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఆర్బిట్రేషన్ తీర్పు వచ్చాకే ఆరు వరుసలపై నిర్ణయం తీసుకుంటామని
Hyderabad Vijayawada Road: హైదరాబాద్- విజయవాడ రహదారి (ఎన్‌హెచ్ 65)పై 181 కిలోమీటర్ల మార్గాన్ని ఆరు వరుసలుగా విస్తరించాల్సిన అవసరం లేదని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ వెల్లడించింది. 40వ కిలో మీటరు నుంచి 221 కిలో మీటరు వరకు మొత్తం 181 కిలోమీటర్ల మార్గాన్ని 6 వరుసలుగా విస్తరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జీఎంఆర్ హెచ్వీపీఎల్ (జీఎంఆర్ హైదరాబాద్ - విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్) ఆర్బిట్రేషన్ వెళ్లిందని, దానిపై తుది నిర్ణయం వెలువడిన తర్వాతే తదుపరి కార్యాచరణ ఉంటుందని ఎన్‌హెచ్‌ఏఐ స్పష్టం చేసింది. విభజన చట్టం కింద పదేళ్లలోపు ఏపీ - తెలంగాణల మధ్య రోడ్లను మెరుగు పరిచేందుకు ఏమేం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ దాఖలైన ఆర్టీఐ పై ఈ మేరకు సమాధానం ఇచ్చింది.
40 నుంచి 221 కిలో మీటర్ల వరకు ఆరు వరసల నిర్మాణం
ఈ ఆర్టీఐ ని సమాచార హక్కు కార్యకర్త ఇనగంటి రవి కుమార్ దాఖలు చేశారు. జాతీయ రహదారి - 65 (హైదరాబాద్ - విజయవాడ) దారిలోని 40 నుంచి 221 కిలో మీటరు వరకు 6 వరుసల నిర్మాణం చేపట్టాలని కన్సెషన్ అగ్రిమెంట్ లో ఉంది. ఒప్పందం ప్రకారం 2022 ఏప్రిల్ లో పనులు మొదలు పెట్టి 2024 ఏప్రిల్ నాటికల్లా పనులు పూర్తి చేయాలి. అయితే ఒప్పందం ప్రాకరం 4 వరుసల రహదారి అయితే రోజుకు 60 వేల ప్యాసింజర్ కార్ యూనిట్లు, 6 వరుసలు అయితే 90 వేల ప్యాసింజర్ కార్ యూనిట్లు రాకపోకలు సాగించేలా రహదారిని అభివృద్ధి చేయాలని ఉంది.
ఆరు వరుసలుగా విస్తరించాల్సిన అవసరం లేదు
అయితే ఈ దారిలో ప్రస్తుతం అంత ట్రాఫిక్ లేదని, 2029 నాటికి మొత్తం మార్గంలో ట్రాఫిక్ 60 వేల ప్యాసింజర్ కార్ యూనిట్లకు చేరుతుందని కే అండ్ కే ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నివేదిక ఇచ్చింది. అందువల్ల ఈ మార్గంలో ప్రస్తుతం 6 వరుసల రహదారి అవసరం లేదని జాతీయ రహదారుల సంస్థ భావిస్తే ఒప్పంద సమయాన్ని మార్చవచ్చనచి ఒప్పందంలో ఉంది. ఈ కన్సెషన్ అగ్రిమెంట్ ప్రకారం.. ప్రస్తుతం ఈ మార్గాన్ని 6 వరుసలుగా విస్తరించాల్సిన అవసరం లేదని ఎన్‌హెచ్‌ఏఐ చెప్పుకొచ్చింది. అయితే దీనికి వ్యతిరేకంగా ఒప్పంద సంస్థ జీఎంఆర్ హైదరాబాద్ - విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ఆర్బిట్రేషన్ కు వెళ్లింది. ప్రస్తుతం ఈ 6 వరుసల విస్తరణ అంశంపై నిర్ణయం రావాల్సి ఉందని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ తెలిపింది. ఈ అంశంపై ఆర్బిట్రేషన్ వెలువరించే తీర్పును బట్టి దీనిపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఎన్‌హెచ్-65 లో మొదటి 14 కిలో మీటర్ల వరకు 6/8 వరుసల రహదారి ఇప్పటికే ఉంది. 14 నుంచి 40వ కిలోమీటరు వరకు రూ. 543 కోట్లతో 6 వరుసల నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు 2024 అక్టోబర్ నాటికి పూర్తి అవుతాయని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది.
మూడేళ్లలోనే 46 బ్లాక్ స్పాట్లు గుర్తింపు
ఎన్‌హెచ్-65లో 2015-18 మధ్యకాలంలో 46 బ్లాక్ స్పాట్లు గుర్తించారు అధికారులు. స్వల్ప కాల చర్యల కింద వీటి వద్ద కాలిబాట మార్కింగ్, సంకేత బోర్డులు, సోలార్ బ్లింకర్లు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసినట్లు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ పేర్కొంది.