Atmakur Assembly Constituency By Polls: ఆత్మకూరు బరిలో గౌతమ్ రెడ్డి భార్య..? అధికారిక ప్రకటన ఎప్పుడంటే..?
మేకపాటి వారసులు చాలామందే ఉన్నారు, ఇక్కడ జగన్ కి ఛాయిస్ ఎక్కువ. ఎవరికి టికెట్ ఇచ్చినా కుటుంబమంతా వారి వెంటే నిలబడి గెలిపించుకుంటుంది. కానీ ఆత్మకూరు బరిలో దిగేది ఎవరనేదే ప్రశ్నార్థకంగా మారింది.
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నికలు రావాల్సి ఉంది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి వల్ల ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టికెట్ ఎవరికి దక్కుతుంది, జగన్ అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నిలబెడతారు అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుపతి లోక్ సభ స్థానానికి, బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. రెండు నియోజకవర్గాలు అప్పటికే అప్పటికే అధికార పార్టీ చేతిలో ఉన్నాయి, ఉప ఎన్నికల తర్వాత కూడా వైసీపీయే అక్కడ విజయం సాధించింది. అయితే తిరుపతిలో మాత్రం జగన్ సంప్రదాయానికి భిన్నంగా దివంగత నేత బల్లి దుర్గా ప్రసాదరావు కుటుంబ సభ్యులకు కాకుండా.. అసలు రాజకీయాలకు సంబంధం లేని డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థిగా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ఇక బద్వేల్ ఉప ఎన్నిక విషయానికొస్తే దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య స్థానంలో ఆమె భార్య సుధకు అవకాశమిచ్చారు. ఎమ్మెల్యే స్థానంలో ఆయన భార్యకు అవకాశం ఇవ్వడంతో టీడీపీ పోటీనుంచి తప్పుకుంది, జనసేన ఎన్నికలకు దూరంగా ఉంది. ఇక బీజేపీ మాత్రం పట్టుబడ్డి అక్కడ పోటీ చేసి ఓడిపోయింది. ఇప్పుడిక ఆత్మకూరు విషయానికొస్తే ఇక్కడ దివంగత నేత గౌతమ్ రెడ్డి కుటుంబానికే టికెట్ ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఆ అభ్యర్థి ఎవరు. గతంలో ఎంపీగా పనిచేసిన సీనియర్ నేత, గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా, గౌతమ్ భార్య శ్రీ కీర్తికి అవకాశమిస్తారా, లేక గౌతమ్ తనయుడిని బరిలో దింపుతారా.. వీరెవరూ కాకుండా గౌతమ్ సోదరుల్లో ఒకరిని ఎంపిక చేసుకుంటారా..? అనేప్రశ్నలు వచ్చాయి.
మేకపాటి వారసులు చాలామందే ఉన్నారు, ఇక్కడ జగన్ కి ఛాయిస్ ఎక్కువ. ఎవరికి టికెట్ ఇచ్చినా కుటుంబమంతా వారి వెంటే నిలబడి గెలిపించుకుంటుంది. కానీ ఆత్మకూరు బరిలో దిగే ఆ వారసుడు ఎవరు అనేదే ప్రశ్నార్థకంగా మారింది. మేకపాటి రాజమోహన్ రెడ్డికి వయోభారం రీత్యా టికెట్ ఇవ్వబోరనే ప్రచారం నడుస్తోంది. ఇక గౌతమ్ రెడ్డి సోదరులిద్దరున్నా.. వారిద్దరిలో ఎవరికైనా టికెట్ ఇచ్చేట్టు సిగ్నల్స్ వచ్చి ఉంటే, ఈ పాటికే వారు జనాల్లోకి వచ్చి ఉండేవారు. కనీసం గౌతమ్ రెడ్డి సంతాప సభలో అయినా సీఎం పక్కన ఉండేవారు. కానీ అదీ జరగలేదు. గౌతమ్ సోదరులిద్దరూ వ్యాపార రంగానికే పరిమితం అయ్యేట్టున్నారు.
చివరిగా గౌతమ్ రెడ్డి భార్య శ్రీకీర్తికే ఆత్మకూరు బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల సీఎం జగన్ నెల్లూరులో సంతాప సభకు హాజరైనప్పుడు శ్రీకీర్తి తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. సభా వేదికపై గౌతమ్ రెడ్డి తల్లిదండ్రులతోపాటు ఆమె కూడా ఉన్నారు. అనంతరం ఆత్మకూరు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు, జిల్లా వైసీపీ నేతలు, కార్యకర్తలంతా శ్రీకీర్తిని పరామర్శించారు. వారందరితో గౌతమ్ రెడ్డి భార్య ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకూ నెల్లూరు జిల్లాలో మహిళలకు ఎమ్మెల్యేగా అవకాశం రాలేదు. ఇప్పుడు తొలిసారిగా శ్రీకీర్తిని నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో దింపుతారనే నమ్మకం అందరిలో.. ముఖ్యంగా స్థానిక నేతలు, కార్యకర్తల్లో ఏర్పడింది. శ్రీకీర్తి పేరు అధికారికంగా ప్రకటించకపోయినా, ఆమే తదుపరి అభ్యర్థి అని స్థానిక నేతలు భావిస్తున్నారు.
మే-15న మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజీ ప్రారంభోత్సవానికి నెల్లూరు జిల్లాకు రాబోతున్నారు సీఎం జగన్. అక్కడ వైెస్ఆర్, గౌతమ్ రెడ్డి విగ్రహాల ఆవిష్కరణ కూడా ఉంటుంది. ఆ సందర్భంలో సీఎం జగన్ అభ్యర్థి పేరు అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు స్థానిక నేతలు.