Nellore News: గంజాయి మత్తులో యువకుడిపై దాడి-నెల్లూరులో వైరల్ అవుతున్న వీడియో
మతి స్థిమితం లేని ఓ యువకుడిని మరో నలుగురు తీవ్రంగా హింసిస్తున్న వీడియో అది. గంజాయి మత్తులో అతడిపై దాడి చేశారని చెబుతున్నారు. నలుగురు యువకులు తాము కొడుతున్న దృశ్యాలను వీడియో తీయడంతో ఇది బయటపడింది.
నలుగురు యువకులు మరో యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేసిన దృశ్యాలు నెల్లూరు జిల్లాలో వైరల్ గా మారాయి. చేతితో కొట్టారు, కసి తీరక కర్రలతో చితగ్గొట్టారు, చివరకు అతడిని వదిలేసి వెళ్లిపోయారు. వాళ్లు ఎంత శాడిస్ట్ గా మారారంటే, కొడుతున్న దృశ్యాలను సెల్ ఫోన్ లో వారే రికార్డ్ చేసుకున్నారు. చివరకు అవి బయటపడటంతో వారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లాలో గంజాయి మత్తు ఏ స్థాయికి చేరుకుందో అనే విషయం బయటపడింది.
అసలేం జరిగింది..?
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో గంజాయి అమ్మకాలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయని సమాచారం. ఆమధ్య పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టిపెట్టినా పెద్దగా ఫలితం లేదు. ఏఎస్ పేట నుంచి గంజాయి ఆత్మకూరుకి వస్తుందని అంటున్నారు. గంజాయి అమ్మకాలు, వినియోగానికి ఇప్పుడు ఆత్మకూరు జిల్లాలో ముఖ్యప్రాంతంగా మారిందని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ఎవరినీ పట్టుకోలేకపోతున్నారు. పక్కా ఆధారాలు సాధించలేకపోతున్నారు. ఈ క్రమంలో ఓ వీడియో తాజాగా వైరల్ అయింది.
ఆ వీడియోలో ఏముంది..?
మతి స్థిమితం లేని ఓ యువకుడిని మరో నలుగురు యువకులు తీవ్రంగా హింసిస్తున్న వీడియో అది. ఆత్మకూరు పట్టణంలోని వందూరుగుంటకు చెందిన బాధిత యువకుడిని నలుగురు తీవ్రంగా కొట్టారు. గంజాయికి బానిసైన ఆ యువకుడికి మతిస్థిమితం లేదని, మరో నలుగురు యువకులు కూడా గంజాయి మత్తులో అతడిపై దాడి చేశారని చెబుతున్నారు. ఈ వీడియో బయటకు రావడంతో నెల్లూరు జిల్లాలో ఇది సంచలనంగా మారింది. నలుగురు యువకులు తాము కొడుతున్న దృశ్యాలను వీడియో తీయడంతో ఇది బయటపడింది.
పోలీస్ పహారా ఏమైంది..?
ఆత్మకూరు పట్టణంలో తిప్పపై ఆర్డీఓ ఆఫీస్, ఎంపీడీవో కార్యాలయం, ఎంఈఓ, వెలుగు, ఇరిగేషన్, సచివాలయం అన్నీ ఒకేచోట ఉంటాయి. వాటి సమీపంలోనే ఓ స్కూల్ ఉంటుంది. సాయంత్రం అయితే ఇక్కడ పోకిరీలు చేరుతుంటారు. క్రికెట్ ఆడే నెపంతో అక్కడే తిష్టవేస్తారు. ఈ విషయం అక్కడి కార్యాలయాల్లో పనిచేసే అధికారులందరికీ తెలుసు. కానీ ఎవరికీ ఏమీ పట్టదు. ఇక పట్టణంలో పాడుబడిన రైస్ మిల్లుల వద్ద కూడా గంజాయి దొరుకుతుందనే ప్రచారం ఉంది. ఇంత జరుగుతున్న పోలీసులు వీటిపై దృష్టిపెట్టడంలేదనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు వీడియో బయటకు రావడంతో పోలీసులు హడావిడిపడుతున్నారు. గంజాయి వినియోగంతో యువత మతిస్థిమితం కోల్పోతున్నారని, కుటుంబ సభ్యులపైనే దాడులకు తెగబడుతున్నారనే ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల ఇలాంటి ఉదాహరణలున్నా ఎవరూ బయటకు చెప్పుకోవడంలేదు. ఇంట్లో గంజాయి వినియోగిస్తున్నవారు ఉన్నా కూడా కుటుంబ సభ్యులు పరువుపోతుందనే బాధతో బయటపెట్టడంలేదని తెలుస్తోంది.
పోలీసుల వివరణ..
ఈ వీడియో బయటకు రావడంతో పోలీసులు దీనిపై దృష్టిసారించారు. యువకుడిపై దాడి చేసిన నిందితులను విచారిస్తున్నామని తెలిపారు. గంజాయి సరఫరా, అమ్మకాల వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు నెల్లూరు జిల్లా మీదుగా గంజాయి ఇతర ప్రాంతాలకు రవాణా అవుతున్న సందర్భాల్లోనే పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలో గంజాయి వినియోగం పెద్దగా లేదని అంటారు. కానీ చాపకింద నీరులా ఇప్పుడు జిల్లాలో గంజాయి విక్రయం, వినియోగం పెరిగిపోతోంది. ఇలాంటి వీడియోలో దీనికి సాక్ష్యాలు.