Nellore Political News: ఉదయగిరి తమ కుటుంబానికే కావాలంటున్న మేకపాటి - ఇంచార్జ్ నియామకంపై తేల్చని సీఎం జగన్ !
చంద్రశేఖర్ రెడ్డిని బయటకు పంపిస్తే లెక్క తేడా వచ్చేసింది. ఉదయగిరి నియోజకవర్గాన్ని వేరెవరికి కేటాయించినా మేకపాటి హవా తగ్గిపోతుంది. అందుకే ఉదయగిరి సీటు కూడా ఆ కుటుంబానికే ఉండాలనే వ్యూహ 'రచన' మొదలైంది.
Nellore Political News: ఏపీలో నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేసింది. ఆ నాలుగు చోట్ల మూడింటిలో నియోజకవర్గ ఇన్ చార్జ్ లు ఉన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గానికి మాత్రం ఇన్ చార్జ్ ని ప్రకటించే విషయంలో ఎందుకో వైసీపీ అధిష్టానం వెనకాడుతోంది. ఉండవల్లి శ్రీదేవి విషయంలో చాన్నాళ్ల ముందే అక్కడ డొక్కా మాణిక్య వరప్రసాద్ ని ఇన్ చార్జ్ గా పెట్టారు. తర్వాత మరో ఇంచార్జిని కూడా నియమించారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే అక్కడ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేసిన రెండోరోజే ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇన్ చార్జ్ గా పెట్టారు. మరి ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో జగన్ ఎందుకు ఆలోచిస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి రోజులు గడస్తున్నా అక్కడ ఇన్ చార్జ్ ను ఇంకా నియమించలేదు.
ఉదయగిరి ఇంచార్జ్ పదవి కోసం వైసీపీలో పోటీ
మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి సహా.. ఉదయగిరి నియోజకవర్గానికి ఇన్ చార్జ్ లు గా చాలామంది పేర్లు పరిశీలించింది వైసీపీ అధిష్టానం. వారిలో వంటేరు పేరు దాదాపుగా ఫైనల్ అయినట్టే అనుకున్నారు. రేపో మాపో ప్రకటన ఉంటుంది అనుకుంటున్న సమయంలో బ్రేక్ పడింది. అసలు ఉదయగిరి విషయంలో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సైలెంట్ గా ఉంది. ఇప్పటికే చాలామంది ఆశావహులు తాడేపల్లి వెళ్లి తమ పేర్లు పరిశీలించాలని కోరుతున్నారు. చంద్రశేఖర్ రెడ్డిని ఢీకొంటామని, టీడీపీని చిత్తు చిత్తు చేస్తామని అంటున్నారు. కానీ కుదరడంలేదు, ఉదయగిరి ఇన్ చార్జ్ విషయంలో వైసీపీ వేచి చూసే ధోరణిలోనే ఉంది.
తమ కుటుంబానికే ఇవ్వాలంటున్న మేకపాటి !
ఇంచార్జ్ నియామకం అసలు కారణం మేకపాటి కుటుంబం. నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబానికి రెండు సీట్లు ఆనవాయితీగా వస్తున్నాయి. 2014లో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీగా ఉండగా, ఆయన తనయుడు మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా తిరిగి గెలిచారు, ఉదయగిరి ఎమ్మెల్యేగా మేకపాటి రాజమోహన్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గెలిచారు. సో.. మళ్లీ ఆ కుటుంబానికి రెండు సీట్లు వచ్చాయి. గౌతమ్ రెడ్డి అకాల మరణం తర్వాత ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ కుటుంబానికి రెండు సీట్లు కంటిన్యూ అయ్యాయి. ఇప్పుడు సడన్ గా ఉదయగిరి నుంచి చంద్రశేఖర్ రెడ్డిని బయటకు పంపిస్తే లెక్క తేడా వచ్చేసింది. ఉదయగిరి నియోజకవర్గాన్ని వేరెవరికి కేటాయించినా మేకపాటి హవా తగ్గిపోతుంది. అందుకే ఉదయగిరి సీటు కూడా ఆ కుటుంబానికే ఉండాలనే వ్యూహ రచన మొదలైంది.
తెరపైకి రచనా రెడ్డి పేరు !
ఇటీవల మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ప్రెస్ మీట్ పెట్టి చంద్రశేఖర్ రెడ్డిని చెడామడా తిట్టేశారు. అదే రోజు ఆయన చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె రచనా రెడ్డి పేరు తెరపైకి తెచ్చారు. రచనా రెడ్డి ఆదాల ఇంటి కోడలు కావడంతో జగన్ అంగీకరిస్తారని భావిస్తున్నారు. ఉదయగిరి సీటు రచనా రెడ్డికి ఇచ్చేలా, ఇన్ చార్జ్ గా ఆమెను ప్రకటించాలన్నారు రాజమోహన్ రెడ్డి. కుదరకపోతే, మరో సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఇన్ చార్జ్ పదవి ఇవ్వాలని అంటున్నారు. ఇటీవల సీఎం జగన్ ని మేకపాటి కుటుంబం కలసి వచ్చింది. ఇదే విషయంలో వారు జగన్ కి తమ అభ్యర్థన తెలియజేశారని అంటున్నారు. ఉదయగిరిలో చంద్రశేఖర్ రెడ్డిని బయటకు పంపించినా.. టికెట్ మాత్రం తమ కుటుంబంలో మరొకరికి ఇవ్వాలని వారు జగన్ పై ఒత్తిడి తెస్తున్నారు. అందుకే ఆ నియోజకవర్గ ఇన్ చార్జ్ ప్రకటన అనూహ్యంగా వాయిదా పడుతోంది.