Theft In Nellore Court: కోర్టులో రూంలోనే దొంగతనం - ఏం ఎత్తుకుపోయారో తెలిస్తే అవాక్కవుతారు!
Nellore Court Theft: నెల్లూరు మేజిస్ట్రేట్ కోర్టులో దొంగతనం జరిగింది. ఓ కీలక కేసులో సాక్ష్యాధారాలుగా ఉన్న కొన్ని డాక్యుమెంట్లు, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్టు తెలుస్తోంది.
Nellore Court Theft: కోర్టులో దొంగతనం ఏంటి అనుకుంటున్నారా..? అవును ఇది నిజం. బ్యాంకుల్లో దొంగతనం సర్వ సాధారణం అయితే, నెల్లూరులో ఏకంగా కోర్టులోనే దొంగలు పడ్డారు. నగలకోసం కాదు, నగదు కోసం అంతకంటే కాదు, కీలక సాక్ష్యాలు మాయం చేయడం కోసమే దొంగలు పడ్డారని తెలుస్తోంది. నెల్లూరు 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో దొంగతనం జరిగింది. ఓ కీలక కేసులో సాక్ష్యాధారాలుగా ఉన్న కొన్ని డాక్యుమెంట్లు, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్టు తెలుస్తోంది. దీనిపై నెల్లూరు చిన్నబజారు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
కోర్టులోనే దొంగతనం ఎందుకు..?
బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. గురువారం ఈ విషయాన్ని గుర్తించిన కోర్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనానికి గురైన సంచిని కోర్టు బయట ఉన్న కాలువలో గుర్తించిన పోలీసులు దాన్ని పరిశీలించారు. ఆ సంచిలో ఉండాల్సిన పలు కీలక డాక్యుమెంట్లు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే విచారణ చేపట్టారు. కోర్టు ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో దొంగల జాడ గురించిన సమాచారం కష్టతరంగా మారింది. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. కీలకమైన ఆధారాల కోసమే దొంగతనం జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇంతకీ ఈ కీలక ఆధారాలు ఏ కేసుకి సంబంధించినవి అనే విషయంలో పోలీసులు ఇంకా అధికారికంగా స్టేట్ మెంట్ ఇవ్వలేదు.
కాకాణి కేసులో పత్రాలేనా..?
మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 2017లో ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందులో ఆయనే ఏ-1 గా ఉన్నారు. అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి, ఆయన కుమారుడికి విదేశాల్లో ఆస్తులు ఉన్నట్టుగా కొన్ని పత్రాలను మీడియాకు విడుదల చేశారు కాకాణి. ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. దానిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అయితే ఆ పత్రాలతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అవన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్లని సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కేసు రివర్స్ అయింది. సోమిరెడ్డిపై ఆరోపణలు చేయబోయిన కాకాణి ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో ఇరుక్కున్నారు.
కాకాణిపై సోమిరెడ్డి పరువునష్టం దావా దాఖలు చేయగా దానిపై విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ నెల్లూరు 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో జరుగుతోంది. ఈ కేసులో ఏ-1 గా కాకాణి ఉండగా, ఏ2గా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన పసుపులేటి చిరంజీవి అలియాస్ మణిమోహన్ ఉన్నారు. చిరంజీవి నకిలీ డాక్యుమెంట్లు రూపొందించారని, వాటిని అడ్డం పెట్టుకుని సోమిరెడ్డిపై ఆరోపణలు చేశారనేది కేసు సారాంశం. ఆరోపణలు చేసిన కాకాణి, ఫోర్జరీ డాక్యుమెంట్లు రూపొందించారంటున్న చిరంజీవి.. ఇద్దరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ కేసు వ్యవహారం ప్రస్తుతం లైమ్ లైట్లో లేదు. అయితే తాజాగా దొంగతనం జరగడంతో.. ఈ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కాకాణి గోవర్దన్ రెడ్డి మంత్రి పదవి చేపట్టారు. ఆయన త్వరలో నెల్లూరు రాబోతున్నారు.
ఏకంగా కోర్టులో దొంగలు పడటం, కీలక సాక్ష్యాలు మాయమైనట్టు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దొంగలు పడ్డ వ్యవహారంపై పోలీస్ కేసు నమోదయినా, పోయిన వస్తువులు ఏ కేసుకి సంబంధించినవి అనే విషయంపై మాత్రం అధికారిక సమాచారం విడుదల కావాల్సి ఉంది.