Anam Venkataramana Reddy: మాజీ మంత్రి అనిల్ కుమార్ అక్రమాస్తుల ఆధారాలు బయటపెట్టిన టీడీపీ నేత ఆనం
Anam Venkataramana Reddy: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అక్రమ ఆస్తులకు సంబంధించి టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆధారాలను మీడియా ముందు బయటపెట్టారు.
Anam Venkataramana Reddy: మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అక్రమ ఆస్తులకు సంబంధించి టీడీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి మీడియా ముందు కీలక ఆధారాలను బయట పెట్టారు. అనిల్ కుమార్ యాదవ్ తన మిత్రుడు చిరంజీవులు పేరు మీద విశాఖపట్నంలో ఆస్తులు కొన్నారని ఆరోపించారు. పీఏ నాగరాజు యాదవ్ తో సాక్షి సంతకం కూడా చేయించారని ఆనం వెంకటరమణా రెడ్డి అన్నారు. దానికి సంబంధించి కీలకమైన పత్రాలు కూడా ఉన్నాయని, మీడియాకు అందజేస్తానని చెప్పారు.
ఇంటర్నేషనల్ సమన్లు ఎందుకు వచ్చాయని ఈ సందర్భంగా ఆనం వెంకటరమణా రెడ్డి అనిల్ కుమార్ ను ప్రశ్నించారు. సౌతాఫ్రికాలో వ్యాపారాలు చేశారని, బాబాయ్, అబ్బాయ్ విదేశాల్లో వ్యాపారాలు చేశారని, అందుకు నోటీసులు వచ్చాయా లేదా క్రికెట్ బెట్టింగ్ ల వ్యవహారంలో వచ్చాయా అని ఆనం నిలదీశారు. దొంగ ప్రమాణాలు ఎవరి కోసం చేస్తున్నారని, ఉనికిని కాపాడుకోవడానికేనని ఎద్దేవా చేశారు. దేవుళ్ల మీద, చనిపోయిన తండ్రి, పిల్లలపైనా ప్రమాణాలు ఎందుకని ప్రశ్నించారు. కావాలంటే నీ మీద నువ్వే ప్రమాణం చేసుకోవాలని సవాల్ చేశారు. ఇంటర్నేషనల్ సమన్లు రావడానికి క్రికెట్ బెట్టింగ్ కారణమని ఇప్పుడు చెబుతున్నారని, గతంలో అనిల్ కుమార్ యాదవ్ ను పోలీసులు విచారించినప్పుడు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ఇద్దరూ కలిసే బెట్టింగులు ఆడించారని ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నిర్మించిన ఫ్లై ఓవర్ ను.. తానే ఏదో కట్టించుకున్నట్లు మాజీ మంత్రి అనిల్ చెప్పుకోవడం ఏంటని ఎద్దేవా చేశారు. ముదివర్తిపాళెం కాజ్ వే పనులకు ప్రసన్న వర్గీయులు దొంగ బ్యాంకు గ్యారెంటీతో టెండర్లు వేసింది నిజమా కాదా అని టీడీపీ అధికార ప్రతినిధి ప్రశ్నించారు. అనిల్ అక్రమాస్తులపై విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా ఆనం వెంకటరమణా రెడ్డి డిమాండ్ చేశారు.
'ఎమ్మెల్యే అనిల్ తన ఆస్తులపై పచ్చి అబద్ధాలతో దేవుని ఎదుట ప్రమాణం చేశారు. ఆస్తి పత్రాల్లో ఉన్న చిరంజీవి ఎవరు? మీ పీఏ నాగరాజు సాక్షి సంతకం ఎందుకు పెట్టారు? కూల్ డ్రింక్ షాపు యజమాని పేరుతో డాక్యుమెంట్లు ఎందుకు ఉన్నాయి. చిరంజీవి, నాగరాజు, కూల్ డ్రింక్ యజమాని మీ మనుషులు కాదా. తప్పుడు ప్రమాణాలు చేసిన అనిల్ ను భగవంతుడు క్షమించాలి. 2017 ఆగస్టులో క్రికెట్ బెట్టింగ్ కేసులో అనిల్ ను ఎందుకు విచారించారు. బాబాయ్, అబ్బాయ్ కలిసే ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడ్డారు. బెట్టింగ్ మా బాబాయ్ పనేనని పోలీసుల విచారణలో అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు చెప్పారు. అనిల్ కు ఇంటర్నేషనల్ నోటీసులు ఎందుకొచ్చాయి. పెరూలో బంగారు వ్యాపారం ఉందో, లేదో బయట పెట్టాలి. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలి. ముదివర్తిపాళెం కాజ్ వే పనులకు ప్రసన్న వర్గీయులు దొంగ బ్యాంకు గ్యారెంటీతో టెండర్లు వేసింది వాస్తవం కాదా' అని టీడీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటకరమణా రెడ్డి పేర్కొన్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial