పుట్టినరోజు సందర్భంగా కొత్త పథకంపై హింట్ ఇచ్చిన చంద్రబాబు
ఏపీలో మళ్లీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు భృతి ఇస్తానని ప్రకటించారు చంద్రబాబు. ఉద్యోగాలు కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. సీఎం జగన్ ఓ తిక్క శంకరయ్య అని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్షనేత చంద్రబాబు తన పుట్టిన రోజుని ప్రజల మధ్యే జరుపుకున్నారు. పార్టీ ఆఫీస్ లోనో లేక కుటుంబ సభ్యుల సమక్షంలోనో కాకుండా ప్రకాశం జిల్లాను వేదికగా ఎంచుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ 2019 ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రకాశం జిల్లాలోనే పుట్టినరోజు జరుపుకున్నారు. 2024లో అధికారంలోకి వస్తే తాను పరిచయం చేయబోతే కొత్త పథకంపై హింట్ ఇచ్చారు. నవరత్నాలను మొదటినుంచీ విమర్శిస్తున్న చంద్రబాబు.. తాను అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ఆర్థిక ఫలాలు అందించేలా కొత్త విధానం అమలులోకి తెస్తామన్నారు. ఐడియాలజీ కాన్సెప్ట్ ని పరిచయం చేశారు. ఆర్థిక ప్రగతి కేవలం కొన్ని సమూహాలు లేదా కొన్ని వర్గాలకే పరిమితం కాకుండా.. అన్ని కుటుంబాలకు దీని ప్రయోజనాలు అందేలా చూడడమే ఐడియాలజీ కాన్పెస్ట్ అని స్పష్టం చేశారు.
ఎలా అమలు చేస్తారు..?
ప్రస్తుతానికి ఐడియాలజీ కాన్సెప్ట్ అనేది ప్రతిపాదన దశలోనే ఉంది. దీనికి మరింత మెరుగులద్ది.. జన్మభూమి తరహాలోనే చరిత్రలో నిలిచిపోయేలా పేరు పెడతామన్నారు చంద్రబాబు. ఈ కాన్సెప్ట్ ప్రకారం కార్యక్రమాలు అమలు చేసేందుకు, అభివృద్ధి ఫలాలు అందరికీ అందించేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేస్తామన్నారు చంద్రబాబు. కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకుని కుటుంబ సభ్యులను ఆర్థికంగా ఎలా పైకి తేవాలన్నదానిపై కసరత్తు జరుగుతోందన్నారు చంద్రబాబు.
హైదరాబాద్ మోడల్..
హైదరాబాద్ ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడం వల్ల, చుట్టుపక్కల ఉన్న నాలుగైదు జిల్లాలు కూడా ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటున్నాయని, అలాగే ఏపీలో కూడా అభివృద్ధి మొదలు కావాలంటున్నారు చంద్రబాబు. చిన్న చిన్న కమతాలు ఉన్న రైతులు కూడా ఆ ప్రాంతం అభివృద్ధి చెందితే ఎక్కువ ప్రతిఫలం పొందుతారని చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూముల రేట్లు ఆకాశానికంటడం దీనికి ఉదాహరణగా చెప్పారు చంద్రబాబు.
మార్కాపురానికి వరాలు..
మార్కాపురంలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకోవడం తన జీవితంలో మరచిపోలేని రోజు అన్నారు చంద్రబాబు. మార్కాపురంను జిల్లాగా ఏర్పాటు చేస్తానన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ప్రకాశం జిల్లాలోని ప్రజలతో పాటు పశ్చిమ ప్రాంతం వాసులకు ఇది ఆర్థికంగా మేలు చేస్తుందని చెప్పారు. వెలిగొండను పూర్తి చేసి, నిర్వాసితులకూ న్యాయం చేస్తానన్నారు చంద్రబాబు. ఇటీవల మార్కాపురం ఎమ్మెల్యే సోదరుడిపై తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలోని కొంతమంది నేతలు ఆయన్ను చోటా నయీమ్ గా పేర్కొన్నారు. దీనిపై చంద్రబాబు కూడా పరోక్షంగా స్పందించారు. ఓ ప్రజా ప్రతినిధి సోదరుడు చోటా నయీమ్ గా మారారని, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆ నయీమ్ ఆటలు కట్టించాలన్నారు.
జగన్ తిక్క శంకరయ్య..
ఏపీలో మళ్లీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు భృతి ఇస్తానని ప్రకటించారు చంద్రబాబు. ఉద్యోగాలు కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. సీఎం జగన్ ఓ తిక్క శంకరయ్య అని ఎద్దేవా చేశారు. రోజుకో శంకుస్థాపన అంటూ జగన్ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. జగన్ కు ఇంటికి పోయే రోజులు దగ్గరపడ్డాయని, అందుకే తిక్కతిక్క పనులన్నీ చేస్తూ కులమతాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్ల క్రితం భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేస్తే తిక్క శంకరయ్య మళ్లీ ఇప్పుడు చేస్తానంటున్నాడని సెటైర్లు వేశారు. వైఎస్ఆర్ వదిలేసిన కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి తాను శంకుస్థాపన చేస్తే జగన్ మళ్లీ రెండుసార్లు శంకుస్థాపనలు చేశారన్నారు. జగన్ కు పిచ్చి ముదిరిందని, సెప్టెంబరులో విశాఖ వెళ్తానని చెబుతున్నాడని, ఆయన్ను విశాఖ కాకుండా ఇడుపులపాయకు పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.