ముంచుకొస్తున్న వరద ముప్పు-రూ.120 కోట్ల పనుల సంగతేంటి?
సోమశిల ప్రాజెక్ట్ ప్రస్తుతం నిండు కుండలా ఉంది. 78 టీఎంసీలు పూర్తి నీటిమట్టం కాగా ప్రస్తుతం 69 టీఎంసీల నీరు ఉంది. 70 టీఎంసీలు దాటితే కచ్చితంగా నీటిని కిందకు వదిలి పెట్టాల్సి ఉంటుంది.
నెల్లూరు జిల్లా సోమశిల రిజర్వాయర్ వద్ద ఆప్రాన్ పనులు కొనసాగుతున్నాయి. 120కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇటీవల 99 కోట్ల రూపాయలకు టెండర్లు ఖరారయ్యాయి. ఇందులో భాగంగా పనులు మొదలు పెట్టినా అప్పటికే ఆరు నెలలు ఆలస్యమైంది. ఇప్పుడు హడావిడిగా పనులు చేస్తున్నారు. ప్రాజెక్ట్ నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంటుండటంతో ఈ పనులు కొనసాగుతాయా, ఆగిపోతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సోమశిల ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిన తర్వాత వరదనీరు కిందకు పోయేందుకు ఏర్పాటు చేసిన ఆప్రాన్ గతంలో బాగా దెబ్బతిన్నది. దానికి మరమ్మతులు చేయాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఆప్రాన్‌ని పట్టించుకోకపోతే, ప్రధాన డ్యాం, రిటైనింగ్ వాల్స్‌పై దాని ప్రభావం పడుతుందని నిపుణులు చెప్పడంతో వైసీపీ ప్రభుత్వం రిపేర్ వర్క్స్ కి ముందుకొచ్చింది. గతేడాది పెన్నా నదికి భారీగా వచ్చిన వరదలతో ఆప్రాన్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ తర్వాత ఇప్పుడు రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి..
సోమశిల ప్రాజెక్ట్ ప్రస్తుతం నిండు కుండలా ఉంది. 78 టీఎంసీలు పూర్తి నీటిమట్టం కాగా ప్రస్తుతం 69 టీఎంసీల నీరు ఉంది. తెలుగు గంగ కాల్వ ద్వారా కండలేరు ప్రాజెక్ట్‌కి నీరు విడుదల చేస్తున్నా కూడా సోమశిలకు వరదనీరు పోటెత్తుతోంది. 70 టీఎంసీలు దాటితే కచ్చితంగా నీటిని కిందకు వదిలి పెట్టాల్సి ఉంటుంది. నీరు వదిలిపెడితే ఇప్పటి వరకు చేసిన పనులకు అర్థం లేకుండా పోతుందనే అనుమానం కూడా ఉంది. కానీ పనులు మాత్రం ఆపడంలేదు. ఆప్రాన్ నుంచి తొలగించిన కాంక్రీట్ కొత్తగా ఏర్పాటు చేసిన నిర్మాణాలను బలంగా ఢీకొని, అవి కుంగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
సీఎం జగన్ హామీ మేరకు ఈ ఏడాది సంక్రాంతికి ఈ రిపేరింగ్ వర్క్స్ మొదలు కావాల్సి ఉన్నా.. టెండర్లు పూర్తయిన తర్వాత జూన్, జులై నుంచి పనులు జోరందుకున్నాయి. పనులు మొదలు కావడమే ఆలస్యమైంది, దీంతో ఇప్పుడు వర్షాలతో పెన్న ఉరకలెత్తితే ఇప్పటి వరకూ చేసిన పనుల తాలూకు ఫలితం ఎలా ఉంటుందనేది అనుమానంగా ఉంది.
సాగునీటిపారుదల ప్రాజెక్ట్ ల నిర్వహణ విషయంలో ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉంటున్నాయనడానికి చాలా ఉదాహరణలున్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ ఆప్రాన్ కూడా బాగా దెబ్బతిన్నదని నిపుణులు అంచనా వేసినా, అక్కడ కూడా రిపేర్ వర్క్స్ మొదలు కాలేదు. ఇటు సోమశిల వద్ద పరిస్థితి మరీ విషమించే ప్రమాదం ఉండటంతో కాస్త ఆలస్యంగా అయినా పనులు మొదలయ్యాయి. సరిగ్గా వానాకాలం మొదలయ్యే సమయంలో పనులు మొదలు పెట్టారు. అందులోనూ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి స్థాయికి చేరుకుంది. ఈ దశలో పనులు పూర్తి కాకుండా నీరు వదిలిపెడితే అది మరింత ఇబ్బందిగా ఉంటుందని అంటున్నారు. ఇంజినీరింగ్ నిపుణులు వేసే అంచనాలు వేరు, ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేందుకు పట్టే సమయం వేరు. దీంతో ఇలాంటి పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి, చివరకు ఫలితం లేకుండా పోయే ప్రమాదాన్ని కొని తెస్తున్నాయి.