Nellore politics: నెల్లూరు నేతల చేతులు కలిపారు కానీ మనసులు కాదు- కొలిక్కి రాని వర్గపోరు
ఇటీవల సీఎం జగన్ కావలి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద అనిల్ కుమార్ యాదవ్, రూప్ కుమార్ యాదవ్ మధ్య సయోధ్య కుదర్చాలని చూశారు. ఇద్దరు చేతులు కలిపారు.
నెల్లూరోళ్ల రాజకీయం మామూలుగా ఉండదు. పైకి సైలెంట్ గానే ఉన్నా.. లోలోపల ఎవరి రాజకీయాలు వారివి. నిన్న మొన్నటి వరకు భాయీ భాయీ అంటూ తిరిగినోళ్లు ఈరోజు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. పైకి చేయీ చేయీ కలిపినా లోపల వారి ఎత్తులు, పైఎత్తులు అర్థం చేసుకోవడం కష్టం. తాజాగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ మధ్య రాజకీయం కూడా ఇలాగే మారింది.
అనిల్ కుమార్ యాదవ్ రెండుసార్లు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా గెలిచారు, జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. ఆయన గెలుపుకి రూప్ కుమార్ సపోర్ట్ కూడా కీలకం. ఆ విషయం అనిల్ కి కూడా తెలుసు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు రూప్ కుమార్ అందుబాటులో ఉంటారు. అనిల్ షాడోగా ఆయన చాలా వ్యవహారాలు చక్కబెట్టారు. కానీ ఎక్కడో వ్యవహారం తేడా కొట్టింది. అనిల్, రూప్ మధ్య గొడవ ముదిరింది. ఎంతగా అంటే.. రూప్ కొత్త ఆఫీస్ కూడా కట్టుకుంటున్నారు. రూప్ వర్గం అనిల్ దగ్గరకు వెళ్లడంలేదు. అప్పట్లో పార్టీలోనే ఉన్న కోటంరెడ్డితో కూడా రూప్ సన్నిహితంగా ఉన్నారు కానీ, అనిల్ తో మాత్రం కలవలేదు. ఆ తర్వాత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి పార్టీనుంచి బయటకు రావడంతో రూప్, అనిల్ వ్యవహారంలో స్తబ్ధత నెలకొంది. కొన్నాళ్లు రూప్ కుమార్ సైలెంట్ గా ఉన్నారు.
చేతులు కలిపారు కానీ..
ఇటీవల సీఎం జగన్ కావలి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద అనిల్ కుమార్ యాదవ్, రూప్ కుమార్ యాదవ్ మధ్య సయోధ్య కుదర్చాలని చూశారు. ఇద్దరు చేతులు కలిపారు. అక్కడకు మీడియాకు అనుమతి లేకపోవడంతో ఆ ఫొటోలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇంకేముంది ఇద్దరూ కలసిపోయారని అనుకున్నారంతా..?
అక్కడే అసలు ట్విస్ట్..
చేతులు కలిపాం కానీ, తమ మనసులు కలవలేదన్నట్టుగా అనిల్ స్టేట్ మెంట్లున్నాయి. జగన్ చెప్పారు కాబట్టి తాను చేతులు కలిపానని, కానీ ఆయనతో తాను కలిసే ప్రసక్తే లేదని అనిల్ అన్నట్టుగా ఆయన వర్గం చెబుతోంది. ఒకవేళ ఆ పరిస్థితే వస్తే రాజకీయాలు వదిలేస్తానని కూడా అని అన్నట్టు సమాచారం. ఈ ప్రచారం బయటకు వచ్చినా అనిల్ గ్రూప్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అంటే కావాలనే అనిల్ వర్గం ఈ లీకుల్ని బయటకు పంపించినట్టు సమాచారం.
ప్రస్తుతం నెల్లూరు టౌన్ లో అనిల్ వర్గం, రూప్ వర్గం రెండుగా విడిపోయాయి. నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ గా ఉన్న రూప్ కుమార్ యాదవ్ కొంతమంది కార్పొరేటర్లను తనవైపు తిప్పుకున్నారు. వారంతా అనిల్ వ్యతిరేక వర్గంగా ముద్రపడిపోయింది. వచ్చే దఫా అనిల్ కి సిటీలో టికెట్ ఇస్తే పార్టీ గెలుపు కష్టం అనే సంకేతాలు అదిష్టానానికి పంపేందుకు వీరు ప్రయత్నిస్తున్నారు. అనిల్ కి టికెట్ రాకుండా అడ్డుకోడానికి పావులు కదుపుతున్నారు. మరోవైపు టీడీపీ నుంచి మాజీ మంత్రి నారాయణే నెల్లూరు సిటీలో పోటీకి దిగుతారని తెలుస్తోంది. ఈ దశలో గట్టి అభ్యర్థిని బరిలో నింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. సొంత పార్టీలోనే అనిల్ కి కుంపటి ఎదురైతే.. అది కచ్చితంగా టికెట్ పై కూడా ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. అన్ని విషయాలు తెలిసినా కూడా అనిల్ మాత్రం రూప్ తో కలిసేందుకు ఇష్టపడటంలేదు. దగ్గరి బంధువులైనా కూడా వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండటం, సీఎం జగన్ చెప్పిన తర్వాత కూడా సఖ్యత కుదరకపోవడంతో.. నెల్లూరు సిటీలో వచ్చేదఫా వైసీపీ గెలుపుపై అనుమానాలు బలపడుతున్నాయి.