Schools Merging Issue: సీఎం జగన్ నిర్ణయంపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి! ఆ మీటింగ్‌లో బహిరంగంగానే
CM Jagan నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకు వారు ఇష్టపడరు. కానీ స్థానికంగా ప్రజలనుంచి వస్తున్న విన్నపాలు, ప్రజలనుంచి వస్తున్న ఒత్తిడిలను అధిగమించేందుకు వారు నోపు విప్పక తప్పడంలేదు.
Nellore News: ఏపీలో స్కూళ్ల విలీనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్కూళ్లు మొదలై 20 రోజులు దాటినా.. విలీనం గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ ఈ పరిస్థితి ఉంది. 3, 4, 5 తరగతులను హై స్కూల్స్ లో కలిపేసి ఎలిమెంటరీ స్కూల్స్ ని విలీనం చేయడంతో చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీనిపై ఇప్పటికే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలు చేపట్టారు. అటు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆందోళనబాట పట్టాయి. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేలా లేదు, విచిత్రం ఏంటంటే.. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు కూడా స్కూళ్ల విలీంపై గుర్రుగా ఉన్నారు. తాజాగా ప్రకాశం జిల్లా జడ్పీ సర్వ సభ్య సమావేశంలో అధికార పార్టీ నేతలు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్కూళ్ల విలీనంపై అధికారులు పునరాలోచించాలని వారు కోరారు.
ఏపీలో 3, 4, 5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా అక్కడక్కడ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సహజంగా సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకు వారు ఇష్టపడరు. కానీ స్థానికంగా ప్రజలనుంచి వస్తున్న విన్నపాలు, ప్రజలనుంచి వస్తున్న ఒత్తిడిలను అధిగమించేందుకు వారు నోపు విప్పక తప్పడంలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో నాయకులు ఇలాగే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి.. పాఠశాలల విలీనంలో ఇబ్బందులున్నాయని చెప్పారు. ప్రకాశం జిల్లాలో 462 పాఠశాలలను విలీనం చేయడంలో ఇబ్బందులు నెలకొన్నాయని తెలిపారాయన. 3, 4, 5 తరగతుల విద్యార్థులు దూరంగా ఉన్న స్కూళ్లకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారని, దీంతో డ్రాపవుట్స్ పెరిగే ప్రమాదం ఉందని జడ్పీ మీటింగ్ లో చెప్పారు ఎంపీ మాగుంట. స్కూళ్ల విలీనానికి సంబందించి ఒకసారి సాధ్యాసాధ్యాలను పరిశీలించి పాత పాఠశాలలే కొనసాగే వింధంగా చర్యలు తీసుకోవాలని ఆయన.. డీఈవో విజయ భాస్కర్ కు సూచించారు.
పాత ప్రకాశం జిల్లా, ప్రస్తుత నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మానుగంట మహీదర్ రెడ్డి కూడా పాఠశాలల విలీనంపై ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఎక్కడో ఒకచోట కూర్చుని విలీన ప్రతిపాదనలు చేసినట్టు ఉందని విమర్శించారు మానుగుంట మహీధర్ రెడ్డి. క్షేత్ర స్థాయిలో స్కూళ్లను విలీనం చేస్తే, చాలామందికి స్కూళ్లు దూరమైపోతున్నాయని, చిన్న పిల్లలు అంతంత దూరం ఎలా వెళ్లాలని ప్రశ్నించారు మహీధర్ రెడ్డి. చిన్నారులు వాహనాల్లో వెళ్లాల్సి వస్తోందని, పేద విద్యార్థులకు ఆటో ఖర్చుతో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని, స్కూళ్లు మాన్పించే ప్రమాదం ఉందని అన్నారాయన. ఈ ప్రక్రియపై పునరాలోచించి మళ్లీ ప్రతిపాదన పెట్టాలని కోరారు మహీధర్ రెడ్డి.
మొత్తమ్మీద అధికార పార్టీ నేతలకు కూడా స్థానిక సెగ తగిలినట్టుంది. పక్కాగా సాగిపోతున్న వ్యవస్థలో స్కూళ్ల విళీనం పేరుతో గందరగోళం ఎందుకని నిలదీస్తున్నారు అధికార పార్టీ నేతలు. వీరంతా జిల్లా స్థాయిలోనే మాట్లాడతారా లేక సీఎం జగన్ దృష్టికి ఈసమస్యను తీసుకెళ్లి పరిష్కార మార్గం అన్వేషిస్తారా అనేది తేలాల్సి ఉంది.