Nellore Collectorate: నెల్లూరు కలెక్టరేట్ లో మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం
నెల్లూరు కలెక్టరేట్ లో మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్ చాణక్యపురికి చెందిన మస్తానమ్మ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.
నెల్లూరు కలెక్టరేట్ లో మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్ చాణక్యపురికి చెందిన మస్తానమ్మ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు, కలెక్టరేట్ కి స్పందన కార్యక్రమం కోసం వచ్చినవారు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
కారణం ఏంటి..?
29వ డివిజన్ కార్పొరేటర్ సత్తార్ తమ స్థలాన్ని కబ్జా చేశారంటూ బాధితురాలు ఆరోపిస్తున్నారు. నెల్లూరు రూరల్ 29వ డివిజన్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగడాలు పెచ్చు మీరుతున్నాయని ఆమె చెబుతున్నారు. తన స్థలం కోసం ఆత్మహత్యాయత్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు, చిన్నారులతో కలసి కలెక్టరేట్ కి వచ్చారు. కలెక్టరేట్ కి వచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కి అర్జీ ఇచ్చారు. ఆ తర్వాత బయటకొచ్చి మీడియాతో మాట్లాడారు. చివరకు ఆత్మహత్యాప్రయత్నం చేశారు. పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించడంతో పక్కన ఉన్నవారు అడ్డుకున్నారు.
టీడీపీ నాయకుల పరామర్శ..
బాధిత మహిళను టీడీపీ నాయకులు పరామర్శించారు. ఆమెకు అండగా ఉంటామన్నారు. రైల్వే స్టేషన్లో బ్యాగులు పోయినట్టు, నెల్లూరు రూరల్ లో స్థిరాస్తులు గల్లంతవుతున్నాయని అన్నారు టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్. నెల్లూరు రూరల్ లో పంచభూతాలు దోచుకున్నది చాలాదన్నట్లు, పేదల రక్తం కూడా తాగుతున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్పొరేటర్ సత్తార్ తమకు చెందిన స్థలాన్ని అమ్మేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారని, అధికారం శాశ్వతం అనుకొని వారు ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు టీడీపీ నేతలు.
చివరకు పోలీసులు కూడా ఆమెకు న్యాయం చేయలేకపోయారని, అందుకే బాధిత మహిళ ఆత్మహత్యకు సిద్ధమైందని అంటున్నారు టీడీపీ నేతలు. మస్తానమ్మకు న్యాయం జరగకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు టీడీపీ నేతలు.
బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసిందన్న విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు వెంటనే కలెక్టరేట్ కి వచ్చారు. వారందరూ ఆమెకు అండగా నిలబడి, డీఆర్వో వద్దకు ఆమెను తీసుకెళ్లారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. బాధితురాలు 17 సంవత్సరాల క్రితం ఆ స్థలాన్ని కొనుగోలు చేశారని, స్థలం వారిదేనంటూ తహశీల్దార్ కూడా సర్టిఫికెట్ ఇచ్చారని, అందులో కొంత భాగం ఆక్రమణకు గురైందని అన్నారు. బాధిత మహిళ 2019 నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి 15 సార్లు తిరిగారని, నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి 15 సార్లు తిరిగారని, అన్నిటికీ రశీదులు ఉన్నాయని తెలిపారు టీడీపీ నేతలు. ఎవరూ న్యాయం చేయకపోవడంతో బాధిత మహిళ తమ బిడ్డలతో కలసి ఎండ్రిన్ తాగి చనిపోవాలనుకుందని, దీనికి అధికార పార్టీ నేతలే కారణం అని ఆరోపించారు.
నెల్లూరు కలెక్టరేట్ వద్ద జరిగిన ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. అయితే బాధిత మహిళ విషయంలో తమ తప్పేమీ లేదంటున్నారు వైసీపీ నేతలు. టీడీపీ ఆరోపణలను కూడా వారు కొట్టిపారేశారు. ఆస్తులను ఆక్రమించుకున్నారంటూ చేసిన ఆరోపణలు అవాస్తవం అన్నారు. బాధితురాలు మాత్రం తమకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.