Nellore News: మంత్రిని నిలదీసిన ఘటనతో తీవ్ర ఉద్రిక్తత.. పలువురు నేతల అరెస్టు..
మంత్రి పర్యటన తర్వాత కోవూరులో పొలిటికల్ సీన్ మారింది. అరెస్ట్ లతో తమను అణగదొక్కాలని చూస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో మంగళవారం మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత నెలకొన్ని విషయం తెలిసిందే. వరద బాధితులు మంత్రి కాన్వాయ్ ని అడ్డుకోవాలని చూశారు. అయితే పోలీసులు వారిని వెంటనే అక్కడి నుంచి పక్కకు తొలగించారు. మరికొంతమంది సీఎం జగన్ కు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వెంటనే మంత్రి అక్కడినుంచి వెళ్లిపోవడం, దగ్గర్లోని మరో ప్రాంతంలో వరద బాధితులకు బియ్యం పంపిణీ చేయడం అంతా చకచకా జరిగిపోయాయి. కానీ అక్కడే అసలు కథ మొదలైంది.
స్థానికులు మంత్రిని నిలదీయడం, ఆయన పర్యటనలో గందరగోళం నెలకొన్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్థానిక ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు చెందిన కొంతమంది కావాలని మంత్రి పర్యటనలో గందరగోళం సృష్టించారని, ఓ వర్గం మీడియా వారికి మద్దతుగా నిలిచిందని ఆయన అన్నారట. ఆ తర్వాత టీడీపీ, జనసేన కార్యకర్తలను కోవూరు పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కలకలం రేగింది. రాత్రంతా టీడీపీ, జనసేన నాయకులు కోవూరు పోలీస్ స్టేషన్ వద్దే ఉన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అటు జనసేన నాయకులు కూడా తమ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారని, మంత్రి పర్యటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టినందుకు.. తమ కార్యకర్తలపై కేసులు పెట్టారని ఆరోపించారు. అధికార పక్షం ఆగడాలు శృతి మించుతున్నాయని, ప్రజలే బుద్ధి చెప్పే రోజు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొత్తమ్మీద మంత్రి పర్యటన తర్వాత కోవూరులో పొలిటికల్ సీన్ మారింది. అరెస్ట్ లతో తమను అణగదొక్కాలని చూస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వరద బాధితులకు సాయం చేయాల్సిన నేతలు ప్రతిపక్షాలపై నిందలు మోపుతూ తమ తప్పుని కప్పి పుచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.
Also Read: Tomato Price Today: పెట్రోల్ రేట్లను దాటేసిన టమోటా.. కొన్నిచోట్ల రూ.140, సడెన్‌గా పెరుగుదల ఎందుకు?
Also Read: Weather Updates: ఏపీకి మరోసారి భారీ వర్ష ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా వానలకు అవకాశం..
Also Read: KCR In Delhi: ఒడువని ధాన్యం సేకరణ ముచ్చట.. ఢిల్లీలోనే సీఎం కేసీఆర్, మంత్రులు
Also Read: ఇద్దరివీ వీఆర్వో ఉద్యోగాలు, అన్నీ పాడుపనులే.. ఏళ్లుగా వారికి గాలం.. చివరికి ఇలా..