Minorities Postcard movement: చంద్రబాబు కోసం మైనార్టీల పోస్ట్ కార్డ్ ఉద్యమం
స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయి, రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు కడిగిన ముత్యంలా ఆ కేసునుంచి బటపడతారని అన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి. మళ్ళీ ఆయన ప్రజా క్షేత్రంలో తిరిగి వస్తారని చెప్పారు.
చంద్రబాబుకోసం నెల్లూరు మైనార్టీ నేతలు పోస్ట్ కార్డ్ ఉద్యమం చేపట్టారు. చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ కేంద్రానికి వారు లేఖలు రాశారు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పేరుతో చంద్రబాబుని తప్పుడు కేసులో ఇరికించారని మైనార్టీ నాయకులు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మైనార్టీ నేతలతో కలసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు.
చంద్రబాబు అరెస్ట్, ఆయన్ను రిమాండ్ కి తరలించడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసనలు చేపడుతున్నారు. కాగడాల ప్రదర్శన, కొవ్వొత్తుల ర్యాలీ, సంతకాల సేకరణ వంటి వినూత్న కార్యక్రమాలతో ప్రతి రోజూ ప్రజల్లోకి వెళ్తున్నారు. తాజాగా పోస్ట్ కార్డ్ ల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు నెల్లూరు నేతలు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మైనార్టీ నేతలతో కలసి పోస్ట్ కార్డ్ ఉద్యమం చేపట్టారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మైనార్టీ నేతలతో కలసి ఆయన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. వారితో కలసి కేంద్రానికి లేఖలు రాశారు.
స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయి, రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు కడిగిన ముత్యంలా ఆ కేసునుంచి బటపడతారని అన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మళ్ళీ ఆయన ప్రజా క్షేత్రంలో తిరిగి వస్తారని చెప్పారు. ఆయన అక్రమ అరెస్టు, ఆయనపై పెట్టిన అక్రమ కేసును ప్రజల్లో విస్తృతంగా చర్చ పెట్టాలన్నారు. అందుకే ప్రతి రోజూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ సర్వే చేసినా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎరుగని అతి గొప్ప విజయాన్ని సాధించబోతుందనే విషయం తెలుస్తుందని చెప్పారు కోటంరెడ్డి. వైసీపీకి ఘోర పరాభవం తప్పదని తేల్చి చెప్పారు.
అప్పుడెందుకు చేయలేదు..?
స్కిల్ డెవల్మెంట్ వ్యవహారంలో నిజంగానే కుంభకోణం జరిగి ఉంటే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల 7 నెలల కాలంలో ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు కోటంరెడ్డి. ఇన్నాళ్లూ ఆ కేసుని ఎందుకు వేగంగా ముందుకు నడపలేదన్నారు. సరిగ్గా ఎన్నికల వేళ, టీడీపీని ఇబ్బంది పెట్టేందుకే చంద్రబాబుని అరెస్ట్ చేశారని చెప్పారు. వైసీపీలో ఓటమి భయం ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం అని అన్నారు కోటంరెడ్డి.
మైనార్టీలకు పాదాభివందనం..
తాను వైసీపీనుంచి దూరం జరిగినప్పుడు కూడా మైనార్టీ నేతలు అండగా నిలిచారని, ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ విషయంలో కూడా నెల్లూరు ముస్లిం నేతలు ఆయనకు అండగా నిలబడ్డారని, వారికి పాదభివందనం చేస్తున్నానని తెలిపారు కోటంరెడ్డి. ముస్లిం మతపెద్దలతో కలసి ఆయన చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ ప్రార్థనలు జరిపారు. వైసీపీ ఎన్ని వ్యూహాలు రచించినా, ప్రజలంతా టీడీపీకి అండగా నిలబడ్డారని చెప్పారు. చంద్రబాబుని అరెస్ట్ చేసింది అక్రమ కేసులోనే అనే విషయాన్ని ప్రజలంతా నమ్ముతున్నారని, ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపేనన్నారు. తనని కూడా పలు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూశారని, కానీ చివరకు న్యాయమే గెలుస్తుందని చెప్పారు. చంద్రబాబు కూడా నిర్దోషిలా బయటపడతారని అన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.