Nellore Farmers Agitation: అన్నదాతలకు కడుపు మండింది - ఏం చేశారో చూడండి
అర్జీలు ఇస్తుంటే పట్టించుకోలేదు, తమ కష్టాలు తీర్చండయ్యా అంటే ఎవరూ మాట వినలేదు. కనీసం గిట్టుబాటు ధర కల్పించాలని వేడుకుంటే కుదరదరన్నారు. దీంతో రైతులకు కడుపుమండింది. ఎమ్మార్వో ఆఫీస్ ని చుట్టుముట్టారు.
Nellore Farmers Agitation: అర్జీలు ఇస్తుంటే పట్టించుకోలేదు, తమ కష్టాలు తీర్చండయ్యా అంటే ఎవరూ మాట వినలేదు. కనీసం గిట్టుబాటు ధర కల్పించాలని వేడుకుంటే కుదరదరన్నారు. దీంతో రైతులకు కడుపుమండింది. ఎమ్మార్వో ఆఫీస్ ని చుట్టుముట్టారు. తిండి, నిద్ర అన్నీ అక్కడే అంటున్నారు. రాత్రి పూట కూడా ఇంటికి వెళ్లలేదు. ఎమ్మార్వో ఆఫీస్ ముందే దోమతెరలు కట్టుకుని, చలిలో వణికిపోతూ అక్కడే పడుతున్నారు. తమ ఆందోళనను, ఆక్రోశాన్ని ఆ విధంగా వెలిబుచ్చారు. ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరుతూ కోవూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు చేపట్టిన దీక్షను అర్ధరాత్రి కూడా కొనసాగించారు. చలిని, దోమల రొదను లెక్కచేయకుండా.. దోమతెరలు కట్టుకొని మరీ తమ ఆవేదనను వ్యక్తంచేశారు.
రైతు భరోసా కేంద్రాల్లో అధికారులు కుంటిసాకులు చెప్పి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. మీరే మిల్లర్ల వద్దకు వెళ్లి అమ్ముకోవాలని చెబుతున్నారని వాపోయారు. పుట్టికి 850 కేజీలు కొలవాల్సి ఉండగా.. తరుగుల పేరుతో అదనంగా 150 కిలోలు కొలవాలంటున్నారని.. అదేమని అధికారులను ప్రశ్నిస్తే, సమాధానం సైతం చెప్పడం లేదని వాపోయారు.
కలెక్టర్ కూడా పట్టించుకోలేదు !
కలెక్టర్‌కుచెప్పినా తమకు న్యాయం జరగలేదంటున్నారు రైతులు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించడం తప్ఫ. క్షేత్రస్థాయిలో రైతులకు జరుగుతున్న అన్యాయం తెలుసుకోకపోవడం వల్లే ఈ సమస్యలన్నీ అని అంటున్నారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం అసలు సమస్యలను పరిష్కరించాలని, అధికారుల మాటలను నమ్మి రైతులకు అన్యాయం చేయొద్దని కోరుతున్నారు అన్నదాతలు. తమ సమస్యల పరిష్కారం కోసం వినూత్నంగా నిరసన (Nellore Farmers) చేపట్టారు.
రైతు భరోసా కేంద్రాల్లోనే కొనుగోలు..
ఓవైపు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లోనే కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నా.. మరోవైపు తమకు మాత్రం న్యాయం జరగడంలేదంటున్నారు రైతులు. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరిగేలా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం ఎలా ఉన్నా రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. అధికారులు వేసే కొర్రీల వల్ల చాలామంది రైతులు మిల్లర్ల వద్దకు వెళ్తున్నారని, నష్టపోతున్నారని చెబుతున్నారు.
ధాన్యం కొనుగోలు సమస్యను పరిష్కరించకపోతే రైతులు తమ ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రైతులంతా తహశీల్దార్ కార్యాలయాల వద్దకు చేరుకుని దీక్షలు చేపడుతున్నారు. కోవూరులో ఇలా రాత్రి కూడా ఆఫీస్ ముందే నిద్రపోయి తమ ఆందోళన వెలిబుచ్చారు. ధాన్యం కొనుగోళ్లలో రైతు కష్టాన్ని మిల్లర్లు, దళారులు, కొందరు అధికారులు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ కష్టాలు అర్థం చేసుకోవాలని, క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలన్నారు.
Also Read: Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం దిశగా మరో అడుగు, వెనక్కి తగ్గేదేలే అంటున్న కేంద్రం
Also Read: Ysrcp Mp Avinash Reddy: ఆ మరక పోగొట్టుకునే ప్రయత్నాల్లో ఏపీ బీజేపీ, ఇప్పుడు రైతు సమస్యలపై ఫోకస్