Nellore: నెల్లూరు పోలీసు యూనిఫామ్ ఘటనలో ట్విస్ట్! అక్కడికి పురుషులు వచ్చింది అందుకే..: పోలీసులు
ఈ ఘటనపై మహిళా పోలీసులతో కలిసి ఏఎస్పీ వెంకట రత్నమ్మ మంగళవారం నెల్లూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. కొలతలు ఎలా తీసుకోవాలో చెప్పే క్రమంలో పురుషులు వారికి సూచనలు ఇచ్చారని అన్నారు.
నెల్లూరు మహిళా పోలీసుల యూనిఫామ్ కొలతలు తీసేందుకు పురుషులను వినియోగించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. పురుషులను అసలు వినియోగించలేదని, కేవలం కొలతలు నోట్ చేసుకోడానికి మాత్రమే దర్జీలు వచ్చారని ఎస్పీ విజయరావు క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై మహిళా పోలీసులతో కలిసి ఏఎస్పీ వెంకట రత్నమ్మ మంగళవారం నెల్లూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. కొలతలు ఎలా తీసుకోవాలో చెప్పే క్రమంలో పురుషులు వారికి సూచనలు ఇచ్చారని అన్నారు. ఈ సున్నితమైన వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. కొలతలు తీసే క్రమంలో లోపలికి వచ్చి ఫోటోలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని మహిళా పోలీసులు కోరుతున్నారని ఆమె చెప్పారు. ఫోటోలు తీయడానికి అనుమతి లేకుండా లోపలికి రావడం సరికాదని, వాటిని వైరల్ చేయడం సరికాదని మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో ఆత్మకూరు, కావలి డివిజన్ పరిధిలోని మహిళా పోలీస్‌ల నుంచి కొలతలు తీసుకున్నారు. అయితే, మహిళలు చేయాల్సిన పనిని ఇద్దరు పురుషులకు అప్పగించారు. పురుషులు కొలతలు తీసుకోవడం ఏంటని చాలా మంది అయిష్టంగానే దీనికి ఒప్పుకున్నారు. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఈ తంతంగాన్ని షూట్ చేసి మీడియాకు విడుదల చేశారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో నిజానిజాలు నిర్దారించుకున్న తర్వాతే ఏబీపీ దేశం విషయాన్ని రిపోర్ట్ చేసింది. దీనిపై ఎస్పీ ఆఫీస్ అధికారులు కూడా స్పందించారు. ఇకపై భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చేస్తామంటూ వివరణ ఇచ్చారు.
ఎస్పీ విజయరావు, అడిషనల్ ఎస్పీ వెంకటరత్నమ్మ ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. యూనిఫామ్ కొలతలు తీసుకుంటున్న ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లోకి వెళ్లి పరిస్థితి సమీక్షించారు. టైలర్ మెజర్ మెంట్స్ తీసుకునే దగ్గర ఇంచార్జ్‌గా ఉన్న హెడ్ కానిస్టేబుల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. మహిళలతోనే అక్కడ కొలతలు తీసుకున్నారు. కొంతమంది కావాలని వీడియోలు వైరల్ చేస్తున్నారని, మహిళా కానిస్టేబుళ్లకు తెలియకుండా వారి యూనిఫామ్ కొలతలు తీసుకునే సమయంలో ఫొటోలు వీడియోలు తీశారని, వారిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
వాస్తవానికి మహిళా కానిస్టేబుళ్ల యూనిఫామ్ తయారీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. కానీ కొలతలు తీసుకునే దగ్గర మహిళా స్టాఫ్ ఉండాల్సింది, బయట నుంచి పురుషులు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పురుషులు తమ యూనిఫామ్ కొలతలు తీసుకోవడంతో కొంతమంది మహిళా కానిస్టేబుళ్లు ఇబ్బంది పడ్డారు. ఆ విషయం వైరల్ కావడంతో ఎస్పీ వెంటనే అక్కడికి వచ్చారు. ప్రస్తుతం మహిళా స్టాఫ్ తో మాత్రమే యూనిఫామ్ కొలతలు తీసుకుంటున్నారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దని, మహిళల గోప్యతకు భంగం కలిగించే వీడియోలు, ఫొటోలు ప్రసారం చేయొద్దని అంటున్నారు ఎస్పీ విజయరావు.