Goutham reddy book : గౌతమ్ రెడ్డి 'చిరస్మరణీయుడు', సీఎం చేతుల మీదుగా పుస్తకం ఆవిష్కరణ
మంత్రి పదవిలో ఉండగా అకాల మరణం చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డి జీవిత చరిత్రపై ఇప్పుడో పుస్తకం రూపొందింది. సీఎం జగన్ చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
మంత్రి పదవిలో ఉండగా అకాల మరణం చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డి జీవిత చరిత్రపై ఇప్పుడో పుస్తకం రూపొందింది. ఆయన ప్రజా రాజకీయ జీవితాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చారు. వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జర్నలిస్ట్ విజయార్కె ఈ పుస్తకాన్ని అక్షరబద్ధం చేశారు. సీఎం జగన్ చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇటీవలే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి కార్యక్రమం జరిగింది. జయంతి రోజున ఈ పుస్తకాన్ని ఆవిష్కరిద్దామనుకున్నా అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో ఈ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ ఆవిష్కరణ సందర్భంగా గౌతమ్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సీఎం జగన్. గౌతమ్ రెడ్డ తండ్రి మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి, గౌతమ్ రెడ్డి సోదరుడు ప్రస్తుత ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి కూడా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లుట్ల రఘు, మోచర్ల నారాయణ రావు, పీర్ల పార్ధసారథి కూడా పుస్తకావిష్కరణకు హాజరయ్యారు.
రాజకీయ నేపథ్యం ఉన్న మేకపాటి కుటుంబంలో గౌతమ్ రెడ్డి జన్మించారు. నవంబర్ 2, 1971లో నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో ఆయన జన్మించారు. తండ్రి అడుగుజాడల్లో వ్యాపారవేత్తగా కెరీర్ ప్రారంభించారు. అప్పటికే రాజమోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్ జగన్ తో పాటు రాజీనామా చేసి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున ఆయన పోటీ చేసి గెలిచారు. పార్టీ ఆవిర్భావ సమయంలో జగన్ వెంట ఉన్న అతికొద్దిమంది నేతల్లో రాజమోహన్ రెడ్డి ఒకరు. ఆ కృతజ్ఞతతోనే ఆ కుటుంబాన్ని తనతోపాటు రాజకీయాల్లో పైకి తెచ్చారు జగన్. రాజమోహన్ రెడ్డి తరపున గౌతమ్ రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించారు. ఆత్మకూరు ఎమ్మెల్యేగా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. రాజకీయ ఉద్ధండుడు ఆనం రామనారాయణ రెడ్డిపైనే ఆయన గెలిచారు. 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందినా పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక తొలి దఫా మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు గౌతమ్ రెడ్డి. కీలకమైన ఐటీ, పరిశ్రమల శాఖను సమర్థంగా నిర్వహించారు.
2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో రెండోసారి కూడా ఆత్మకూరు నుంచి గెలిచారు. యువ మంత్రిగా జగన్ కేబినెట్ లో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నార. అయితే అనుకోకుండా ఆయన గుండెపోటుతో మరణించడం బాధాకరం. 2022 ఫిబ్రవరి 21న ఆయన హైదరాబాద్ లో గుండెపోటుతో మరణించార. అప్పటికి ఆయన వయసు కేవలం 50 ఏళ్లు మాత్రమే. ఫిజికల్ గా ఫిట్ గా ఉండే గౌతమ్ రెడ్డి హఠాన్మరణం రాష్ట్ర రాజకీయాల్లో విషాదంగా మిగిలిపోయింది. గౌతమ్ రెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబాన్నుంచి ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు సీఎం జగన్. విక్రమ్ రెడ్డి భారీ మెజార్టీతో ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో గెలిచారు. గౌతమ్ రెడ్డి పేరుమీదుగా సంగం బ్యారేజ్ ని మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ గా నామకరణం చేశారు సీఎం జగన్.