నా ఓటు వెంకట రమణకే- తప్పు చేయలేదన్న మేకపాటి- ప్రభుత్వంపై సంచలన కామెంట్స్
క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డానని వస్తున్న వార్తల్ని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఖండించారు. తానెక్కడా తప్పు చేయలేదని తన ఓటు జయమంగళ వెంకట రమణకే వేశానన్నారు. తన ఓటుతోనే ఆయన గెలిచారని చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారన్న అపవాదు ఎదుర్కొంటున్న నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వనని జగన్ చెప్పారని, ఆయన కోసం అప్పట్లో పదవులకు రాజీనామా చేసి వచ్చింది తమ కుటుంబమేనని ఆ విషయం ఆయన గుర్తు పెట్టుకోవాలన్నారు. తమలాంటి వారిని పక్కనపెట్టాలనుకోవడం తగదని హితవు పలికారు.
క్రాస్ ఓట్ వేయలేదు..
తాను క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డానని వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. తానెక్కడా తప్పు చేయలేదని, తన ఓటు జయమంగళ వెంకట రమణకే వేశానన్నారు. తన ఓటుతోనే ఆయన గెలిచారని చెప్పుకొచ్చారు. తనకు, జగన్ కి గొడవలు పెట్టాలని కొంతమంది చూస్తున్నారని, అందుకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు.
ఫ్లెక్సీలు చించలేదు..
క్రాస్ ఓటు వేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. తన నియోజకవర్గంలో వైసీపీ ఫ్లెక్సీలు తొలగిస్తున్నారనే ప్రచారం జరిగింది. దీన్ని కూడా ఆయన ఖండించారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సందర్భంగా అధికారులు జగన్ ఫ్లెక్సీలు తొలగించారని, ఆ వీడియోలను వాడుకుంటూ కొంతమంది తన పరువు తీయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
నాకంటే మొగోడు ఎవరు..?
తాను 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాయనని, తన నియోజకవర్గంలో తనకంటే మొగోడు, మొనగాడు ఎవరున్నారని ప్రశ్నించారు. ఈసారి కూడా తనకు ఎమ్మెల్యే టికెట్ కావాలన్నానని, కానీ వారు ఎమ్మెల్సీ ఆఫర్ చేశారని, అది తనకు వద్దని కుండబద్దలు కొట్టారు. తన నియోజకవర్గంలో పరిశీలకుల పేరుతో పనికిమాలిన వారిని తెచ్చిపెడుతున్నారని, వారంతా సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేని మించి ఎవరుంటారని, పరిశీలకులు, సలహాదారులు ఎందుకని ప్రశ్నించారు.
నిధులేవి..?
బటన్లు నొక్కుతూ సీఎం జగన్ పేద ప్రజలకు డబ్బులేస్తున్నారు సరే, కనీసం ఎమ్మెల్యేలకు కూడా పని కల్పించాలి కదా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి. తనకు పనులు చేయించడానికి నిధులే లేవని వాపోయారు. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని అన్నారు. ఈ విషయాలన్నిటినీ పార్టీ గమనించాలని, అప్పుడే మరోసారి విజయం ఖాయమని అన్నారు. ఇలాంటి వాటన్నిటినీ గమనించుకోకుండా వెళితే పరాభవం తప్పదన్నారు.
మంత్రి పదవి విషయంలో కూడా తనకు పట్టింపులేవీ లేవన్నారు. గతంలో మేకపాటి గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారని, ఆయన చనిపోయాక, ఆ పదవి తమ కుటుంబానికి ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. తానెప్పుడూ పదవులకు ఆశపడలేదని, వచ్చేసారి కూడా తనకు ఎమ్మెల్యే టికెట్ మాత్రమే కావాలన్నారు. అయినా కూడా ఇవ్వను అంటే మాత్రం తాను ఎక్కడికీ పోనని, సైలెంట్ గా ఉంటానని చెప్పుకొచ్చారు.
మేకపాటి కుటుంబంలో ఉన్న వివాదాలను కూడా ఆయన చెప్పకనే చెప్పారు. తన దగ్గర ప్రస్తుతం డబ్బులేవీ లేవని, అన్న ఆస్తి పంపకాలు ఇంకా పూర్తి చేయలేదని, తన కుమార్తెకు ఏమిచ్చారో కూడా తనకు తెలియదన్నారు చంద్రశేఖర్ రెడ్డి. ప్రస్తుతం చిన్న కుమార్తెతో తాను కలసి ఉంటున్నానని చెప్పుకొచ్చారు. మేకపాటి కుటుంబం వైఎస్ఆర్ కుటంబానికి నమ్మకంగా ఉందని, ఇప్పుడు తమ సమస్యలు చెప్పుకోడానికి కూడా ఎవరూ తమ మాట వినడం లేదన్నారు.