Minister Kakani On Jagananna Colonies: జగనన్న కాలనీల్లో ఇల్లు కట్టుకోని వారికి నోటీసులు- అధికారులకు మంత్రి కాకాణి ఆదేశం
నెల్లూరు జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జరిగిన సమీక్ష సమావేశంలో జగనన్న కాలనీల నిర్మాణంపై ఆరా తీశారు మంత్రి గోవర్దన్ రెడ్డి. ప్రోగ్రెస్ సరిగా లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఏపీలో జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతుందనే విషయం తెలిసిందే. అయితే కొన్ని జిల్లాల్లో అధికారుల చొరవతో ఇళ్ల నిర్మాణం వేగవంతమైంది. కానీ మిగతా చోట్ల మాత్రం పనులు ముందుకు సాగడంలేదు. నెల్లూరు జిల్లాలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. దీనిపై మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాగైనా ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
నెల్లూరు జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జరిగిన సమీక్ష సమావేశంలో జగనన్న కాలనీల నిర్మాణంపై ఆరా తీశారు మంత్రి గోవర్దన్ రెడ్డి. ప్రోగ్రెస్ సరిగా లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాకు 58 వేల ఇళ్లు మంజూరు చేస్తే.. ఇప్పటి వరకు 21.36 శాతం మాత్రమే ప్రారంభం కావడం ఏంటని గృహ నిర్మాణశాఖ అధికారులను నిలదీశారు మంత్రి కాకాణి. 227 లేఅవుట్లలో 131 చోట్ల నీటి వసతి కల్పించామని అధికారులు చెప్పగా... నీరు లేకపోతే నిర్మాణదారులు ఎందుకు ముందుకొస్తారన్నారు. ఇల్లు ప్రారంభించే నాటికి నీరు.. పూర్తయ్యే నాటికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని సూచించారు. కొన్ని మండలాల్లో బిల్లులు చేసేందుకు అధికారులు లేరని చెప్పడంతో ఇంజినీరింగ్ సహాయకులను ఉపయోగించుకోవాలని తెలిపారు. వారు చేసిన వాటిని.. పరిశీలనలోకి తీసుకోని ఏఈలకు మెమోలు జారీ చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. వారంలో పెండింగ్ బిల్లులు పూర్తి చేయాలని, ఏఈలు లేని చోట ఇంజినీరింగ్ అసిస్టెంట్లను ఇన్ ఛార్జులుగా పెట్టాలని సూచించారు.
ఇల్లు కట్టకపోతే నోటీసులివ్వండి..
జగనన్న లేఅవుట్లలో ఇల్లు నిర్మించుకునేందుకు ముందుకు రాని లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వాలని, అప్పటికీ స్పందించకపోతే కట్టుకునేందుకు ఆసక్తిగా ఉన్న పేదలకు కేటాయించాలని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. లబ్ధిదారులు కొన్నిచోట్ల ముందుకు రాకపోవడంతో జగనన్న కాలనీల వ్యవహారం ఆలస్యమవుతోందని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఆయన ఇల్లు కట్టుకునేందుకు ముందుకు రాకపోతే లబ్ధిదారులకు నోటీసులివ్వాలన్నారు. ఇల్లు కట్టుకునే ఆసక్తి ఉన్నవారికే స్థలాలు ఇవ్వాలని సూచించారు.
జగనన్న వసతి దీవెన, అమ్మఒడి, నాడు-నేడ, ఉపాధిహామీ పనులు, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ తదితర శాఖలపై సమీక్ష నిర్వహించారు మంత్రి కాకాణి. తల్లిదండ్రులకు భారం కాకుండా విద్యార్థులకు అవసరమైన 8 రకాల సామగ్రిని విద్యాకానుక ద్వారా ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది అమ్మఒడి చాలా మందికి అందలేదని ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని.. ఈ పథకానికి ముందే నిర్దుష్టమైన నిబంధనలు ఉన్నట్లు ప్రభుత్వం చెప్పిందన్నారు. సాంకేతిక కారణాలతో అందని వారికి .. వెంటనే అందజేస్తామన్నారు. జిల్లాలో రూ. 162 కోట్లతో ఆర్‌అండ్‌బీ పనులు జరుగుతున్నాయని.. వాటికి సంబంధించిన బిల్లులు వెంటనే చెల్లించాలని అధికారులకు సూచించారు.