లోకేష్ యాత్రతో వైసీపీకే ఎక్కువ లాభం- కాకాణి కామెంట్స్
నారా లోకేష్ యువగళం పాదయాత్ర వల్ల టీడీపీకి మేలు జరగకపోగా కీడు జరుగుతుందని, రాగా పోగా వైసీపీకే ఎక్కువ మేలు జరుగుతుందని లాజిక్ చెప్పారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి.
నారా లోకేష్ యువగళం మొదలైంది. తండ్రి సొంత నియోజకవర్గం కుప్పం నుంచి ఆయన పాదయాత్ర మొదలు పెట్టారు. పాదయాత్రకు భారీ క్రేజ్ తీసుకొచ్చారు టీడీపీ నేతలు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ సందర్శన మొదలు, తల్లిదండ్రుల ఆశీర్వాదం, మామ బాలకృష్ణ ఆశీర్వాదం నుంచి.. తిరుమల యాత్ర ఆ తర్వాత కుప్పం నుంచి యాత్ర మొదలు.. ఇలా జరిగింది లోకేష్ యువగళం. వైసీపీ ఈ యాత్రను లైట్ తీసుకుంటున్నామని చెప్పినా యాత్రపై ఆసక్తి మాత్రం నాయకుల్లో ఉంది. అయితే లోకేష్ యాత్ర టీడీపీకంటే వైసీపీకే ఎక్కువ ఉపయోగం అంటున్నారు మంత్రి కాకాణి వంటి నేతలు.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర వల్ల టీడీపీకి మేలు జరగకపోగా కీడు జరుగుతుందని, రాగా పోగా వైసీపీకే ఎక్కువ మేలు జరుగుతుందని లాజిక్ చెప్పారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. జయంతికి వర్థంతికి తేడా తెలియని వ్యక్తి ఏం మాట్లాడతారోనని టీడీపీ శ్రేణులు భయపడుతున్నాయని అన్నారు. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నాయన్నారు. లోకేష్ యాత్రపై వైసీపీ ఆలోచించే పరిస్థితిలో లేదని, అసలా యాత్ర వల్ల ఫలితం ఉండదన్నారు. దొడ్డిదారిన మంత్రి అయిన లోకేష్.. సీఎం కొడుకు హోదాలో పోటీ చేసి ఓడిపోయారని, ఇప్పుడాయన యాత్రల పేరుతో జనంలోకి వచ్చి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి పూర్తిగా మతి భ్రమించిందని, అందుకే ఆయన మెడకి మైక్ పెట్టుకున్నారని, చేతిలో పేపర్లు పట్టుకోడానికి వీలుగా మైక్ మెడకు వేసుకున్నారని, పేపర్లు చూసి ప్రసంగం చెబుతున్నారని అన్నారు కాకాణి.
నారా లోకేష్ పాదయాత్ర, అదో పెద్ద జోక్.. అంటూనే యాత్రపై సెటైర్లు పేల్చారు మంత్రి కాకాణి. లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన గళం ఎందుకు విప్పలేదని ప్రశ్నించారు. ఈరోజు విప్పని గళం ఈరోజు ఎందుకు తెరుచుకుంటోందన్నారు. సీఎం కొడుకుగా ఓడిపోయారని, 175 నియోజకవర్గాల్లో సర్వేలు చేపట్టి మరీ మంగళగిరిలో పోటీ చేసి 2019 ఎన్నికల్లో లోకేష్ ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ఆయన గళం విప్పేదేంది, ఆయన ఆకర్షించేది ఎవర్ని అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
చంద్రబాబుపై సెటైర్లు..
చంద్రబాబు వయసైపోయిందని, ఆయన నడవలేరు, మాట్లాడలేరు, పూర్తిగా మతిమరుపు వ్యాధి వచ్చేసిందన్నారు కాకాణి గోవర్దన్ రెడ్డి. ఏపీలో టీడీపీ భూస్థాపితం అయిపోయిందని, టీడీపీదంతా గత చరిత్రేనన్నారు కాకాణి. ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేశామన్నారు.
టికెట్ల కోసం ఆశ పడేవారు ఆయన పాదయాత్ర గురించి విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. పరోక్షంగా నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డిపై కాకాణి సెటైర్లు వేశారు. టీడీపీ టికెట్ దొరికితే కొంతమందికి పండగ అని, ఆ పేరు చెప్పి ఎన్నికల కోసం డబ్బులు దండుతారన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వైసీపీ గెలుపుని ఆపలేరన్నారు కాకాణి. 2024లోనూ జగనే సీఎం, 2034లో కూడా జగనే సీఎం అని జోస్యం చెప్పారు కాకాణి గోవర్దన్ రెడ్డి.
లోకేష్ యాత్రపై వైసీపీ నేతలు ట్విట్టర్ వేదికగా కూడా కౌంటర్లు ఇస్తున్నారు. మరో మంత్రి అంబటి రాంబాబు కూడా లోకేష్ యాత్రపై సెటైర్లు పేల్చారు. ఎలుక తోక తెచ్చి 400 రోజులు ఉతికినా అంటూ ఆయన లోకేష్ పాదయాత్రని గేళి చేశారు. లోకేష్ ఎన్నిరోజులు యాత్ర చేసినా నాయకుడు కాలేడన్నారు మంత్రి అంబటి.