Kakani Govardhan Reddy: అప్పు చెల్లిస్తారా పరువు తీయమంటారా? మంత్రికే లోన్‌యాప్ ఏజెంట్లు దమ్కీ
Threats To Minister: తీసుకున్న లోన్ కట్టకపోతే ఊరుకునేది లేదు. మీ పరువును బజారుకు ఈడుస్తామంటూ కొందరు వ్యక్తులు మంత్రికే ఫోన్ చేసి బెదిరించారు. ఈ ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది.
Threats To Minister: ఫైనాన్షియర్లు వేధింపులు అన్నీ ఇన్నీ కావు. ఈ మధ్య కాలంలో ఫైనాన్స్ కొద్దిగా తగ్గినా అక్కడక్కడ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎదుటి వారు ఎలాంటి అవసరాల్లో ఉన్నారో తెలుసుకుని ఆ పరిస్థితిని వారికి అనుకూలంగా మార్చుకునే వారు. అధిక వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పేవారు. అత్యవసరం ఉన్న వాళ్లు ఎంత వడ్డీకైనా డబ్బు కావాలని వారిని ప్రాధేయ పడే వాళ్లు. తీరా డబ్బు తీసుకున్నాక, రోజు వారీ.. లేదా నెల వారీగా ఫైనాన్స్ వారికి వడ్డీ కట్టాల్సిందే. కొద్దిగా ఆలస్యం అయినా వాళ్లు ఊరుకునే వాళ్లు కాదు. ఇంటికి వచ్చి అందరి ముందు డబ్బులు ఏవంటూ పరువు తీసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఎంతలా అంటే ఏకంగా మంత్రికే ఫోన్ చేసి తీసుకున్న లోన్ కట్టకపోతే పరువు తీస్తామంటూ బెదిరించారు. ఇప్పుడు కటకటాల పాలయ్యారు.
మంత్రికి ఎందుకు ఫోన్ చేశారు?
అశోక్ కుమార్ అనే వ్యక్తి నెల్లూరులోని పులర్టన్ కంపెనీలో ఎనిమిదిన్నర లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు. రుణం తీసుకునే ప్రాసెస్ లో ఆ అశోక్ అనే వ్యక్తికి చెందిన ఫోన్ కాంటాక్ట్ నంబర్లు అన్నింటిని రుణం ఇచ్చిన కంపెనీ సేకరించింది. రుణం తీసుకున్న అశోక్ దాని వడ్డీని కట్టలేదు. అసలూ కట్టడం లేదు. వాళ్లు పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేదు. వారికి దొరక్కుండా తిరుగుతున్నాడు అశోక్ కుమార్. లోన్ రికవరీ వీలుకాకపోవడంతో... చెన్నైలోని కాల్ మన్ సర్వీసెస్ రికవరీ ఏజెన్సీకి అప్పగించారు. ఈ ఏజెన్సీకి చెందిన మేనేజర్లు మాధురి వాసు, మామిడిపూడి గురు ప్రసాద్ రెడ్డి, శివ వాసన్ మహేంద్రన్.. అతడి కాంటాక్ట్ నంబర్లను ముందే సేకరించిన కంపెనీ నిర్వాహకులు.. వారి నంబర్లకు ఫోన్ చేయడం ప్రారంభించారు. వారికి ఫోన్ చేసి అశోక్ లోన్ తీసుకున్నాడని, తిరిగి కట్టడం లేదని తీసుకున్న రుణం కట్టకపోతే మీ పరువూ తీస్తామని ఫోన్ లో బెదిరింపులకు పాల్పడ్డారు. అశోక్ కుమార్ ఫోన్ లో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫోన్ నంబరు ఉండటంతో ఆయనకు కాల్ వచ్చింది.
పోలీసులకు ఫిర్యాదు చేసిన మంత్రి..
తనకు లోన్ యాప్ రికవరీ ఏజెన్సీ వాళ్లు ఫోన్ చేసి బెదిరించడంతో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ విజయ రావు ఆదేశాల మేరకు రూరల్ డీఎస్పీ ఆధ్వర్లంయో కృష్ణ పట్నం సీఐ వేమారెడ్డి బృందం కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. నెల్లూరులోని పులర్టన్ కంపెనీలో అశోక్ కుమార్ అనే వ్యక్తి ఎనిమిదిన్నర లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడని, కానీ లోన్ కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నాడని గుర్తించారు. అశోక్ కుమార్ ఫోన్ కాంటాక్ట్ లో ఉన్న ప్రముఖుల నంబర్లకు ఫోన్ చేసి, బెదిరింపులకు పాల్పడ్డారు. విచారణ అనంతరం ఈ ముగ్గురితో పాటు పులర్టన్ రికవరీ మేనేజర్ పసల పెంచలరావును అరెస్టు చేశారు పోలీసులు. అతడిని కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. వీరి నుండి ల్యాప్ టాప్, నాలుగు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.