(Source: ECI/ABP News/ABP Majha)
Handicap Person Death : ఎస్సై వేధింపులతోనే చనిపోయాడా?- సంచలనం సృష్టిస్తున్న దివ్యాంగుడి మృతి
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరులో తిరుపతి అనే ఓ దివ్యాంగుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపులే కారణం అంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
నెల్లూరు(Nellore) జిల్లా మర్రిపాడు(Marripadu) మండలం చుంచులూరులో ఓ దివ్యాంగుడి ఆత్మహత్య వివాదాస్పదంగా మారింది. ఖాకీల వేధింపులతోనే తన బిడ్డ బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆ వ్యక్తి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ చేస్తున్నామని.. తప్పు చేస్తే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు.
చుంచులూరుకు చెందిన తిరుపతి అనే ఓ దివ్యాంగుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపులే కారణం అంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పొలం కంచె దొంగతనం నేపథ్యంలో తిరుపతి అనే యువకుడిని పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఎస్సై వెంకట రమణ కొట్టాడని అంటున్నారు. అప్పటికే రెండుసార్లు తీవ్రంగా కొట్టారని, మూడోసారి మళ్లీ పోలీస్ స్టేషన్ కి పిలవడంతో భయపడి తిరుపతి పురుగుల మందు తాగాడని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తిరుపతి మృతి చెందాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది..
అసలేం జరిగింది..?
నెల్లూరు జిల్లాలోనే అనంతసాగరం(Ananta Sagaram) మండలం గుడిగుంట్లకు చెందిన పొట్టపల్లి శ్రీనివాసులు, లక్ష్మమ్మ ఉపాధి నిమిత్తం చుంచులూరుకు వలస వచ్చారు. వారికి దివ్యాంగుడైన కుమారుడు తిరుపతి ఉన్నాడు. చుంచులూరులో ఆ కుటుంబం కృష్ణమూర్తి అనే రైతుకి చెందిన పొలానికి కాపలా ఉంటూ అక్కడే నివాసం ఉండేది. సరిగా నడవలేని తిరుపతి ఇంటి దగ్గరే ఉండేవాడు. కృష్ణమూర్తికి చెందిన పొలం పక్కనే ఆందనేయ రెడ్డికి అనే వ్యక్తికి కూడా పొలం ఉండేది. ఆ పొలానికి వేసిన ఫెన్సింగ్ కంచెను ఎవరో దొంగతనం చేశారు. దొంగతనం చేసినవారిని విచారించే క్రమంల స్థానిక ఎస్సై వెంకట రమణ.. తిరుపతిని స్టేషన్ కి పిలిపించాడని సమాచారం.
అయితే విచారణ పేరుతో ఎస్సై వెంకట రమణ తమ కుమారుడు తిరుపతిని స్టేషన్ కి పిలిపించి కొట్టేవాడని చెబుతున్నారు తిరుపతి తల్లిదండ్రులు. ఈ క్రమంలో తమ కుమారుడు తీవ్రంగా బాధపడేవాడని, కనిపించని దెబ్బలతో ఇబ్బంది పడ్డాడని అంటున్నారు. మూడోసారి కూడా పోలీసులు స్టేషన్ కు పిలవడంతో భయంతో తమ కుమారుడు తిరుపతి పురుగుల మందు తాగాడని చెబుతున్నారు తల్లిదండ్రులు. పురుగుల మందు తాగడంతో ముందుగా తిరుపతిని నెల్లూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసులు తమను అడ్డుకుని తమ కుమారుడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని చెబుతున్నారు తల్లిదండ్రులు. ప్రైవేటు ఆస్పత్రికి తరలించిన తర్వాత చికిత్స పొందుతూ తమ కుమారుడు మరణించాడని చెప్పారు. తమ కుమారుడి మృతికి ఎస్సై వెంకట రమణ కారణం అంటూ వారు ఆరోపిస్తున్నారు.
పోలీస్ విచారణ..
దివ్యాంగుడు తిరుపతి మరణంపై ఖాకీలపైనే ఆరోపణలు రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. విచారణ చేపట్టారు. ఎస్సైపై ఆరోపణలు రావడంతో.. విచారణ అధికారిగా అడిషనల్ ఎస్పీ చౌడేశ్వరిని నియమించారు. తప్పు చేసిన వారెవరైనా క్షమించేది లేదని అంటున్నారు. పోలీసుల తరపున ఇబ్బందులు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని చెప్పారు జిల్లా ఎస్పీ విజయరావు. మొత్తమ్మీద తిరుపతి ఆత్మహత్య వ్యవహారంలో పోలీసుల ఇన్వాల్వ్ మెంట్ ఉంది అనే ఆరోపణలు రావడంతో జిల్లాలో కలకలం రేగింది.