Garikapati Comments: గరికపాటిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి - బీఎస్పీ నేతల ఫిర్యాదులు
ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం మాయావతిపై ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె విగ్రహాల విషయంలో గరికపాటి చేసిన వ్యాఖ్యల్ని బీఎస్పీ నేతలు తప్పుబడుతున్నారు.
ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె విగ్రహాల విషయంలో గరికపాటి చేసిన వ్యాఖ్యల్ని బీఎస్పీ నేతలు తప్పుపడుతున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఆయనపై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. నెల్లూరు జిల్లాలో కూడా ఆయనపై బీఎస్పీ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మాయావతిపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే గరికపాటి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు నెల్లూరు జిల్లా బీఎస్పీ నేతలు, లేకపోతే ఆయన్ని బయట తిరగనివ్వబోమని హెచ్చరిస్తున్నారు.
సంచలన వ్యాఖ్యలు..
గరికపాటి చేసిన కామెంట్లు ఇప్పటివా, గతంలో చేసినవా అనే విషయంపై స్పష్టత లేదు, కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం తాజాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. మాయావతిపై ఆయన ఎందుకలాంటి కామెంట్లు చేయాల్సి వచ్చింది, అసలు పక్క రాష్ట్రాల పాలిటిక్స్ గురించి ఆయన ఎందుకు మాట్లాడారో గానీ, అనుకోకుండా ఆయన బీఎస్పీ అధినేత్రిని టార్గెట్ చేశారు. బీఎస్పీ నాయకులకు ఇలా బుక్కయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గరికపాటిపై పోలీస్ స్టేషన్లలో కేసులు పెడుతున్నారు బీఎస్పీ నేతలు. వెంటనే మాయావతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమెపై చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలంటున్నారు.
ఈ విషయంపై ఇంకా గరికపాటి వైపు నుంచి స్పందన రాలేదు. రెండురోజులుగా సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. దీనిపై గరికపాటి స్పందిస్తారో లేదో వేచి చూడాలి. ఆయన స్పందనతో సంబంధం లేకుండా ఇటు బీఎస్పీ నేతలు మాత్రం ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సిందేనంటున్నారు. ఈ వ్యవహారంలో బీఎస్పీ నేతలు తగ్గేదే లేదంటున్నారు.
చిరంజీవి ఎపిసోడ్ తో వరుస వివాదాలు..
గరికపాటి గతంలో చేసిన మరిన్ని వ్యాఖ్యలు ఇటీవల బాగా హైలైట్ అవుతున్నాయి. చిరంజీవితో సెల్ఫీలు దిగుతున్న వారిపై గతంలో ఓ కార్యక్రమంలో గరికపాటి అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో కేవలం చిరంజీవి ఫ్యాన్స్ మాత్రమే రియాక్ట్ అయ్యారు. జనసేన నాయకులు కూడా సోషల్ మీడియాలో గట్టిగా ట్రోల్ చేశారు. ఆ తర్వాత మెగా ఫ్యాన్స్ కాస్త వెనక్కి తగ్గారు రానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం ఆయన్ను వదిలిపెట్టలేదు. గరికపాటి గతంలో చేసిన వ్యాఖ్యల్ని కూడా వర్మ తవ్వితీసి ఆమధ్య ట్విట్టర్లో పోస్ట్ చేసి ట్రోల్ చేశారు.
ఆ ఎపిసోడ్ లు అన్నీ పూర్తయ్యాయి అనుకుంటే ఇటీవల మాయావతిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. మాయావతి గురించి గరికపాటి చేసిన వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని బీఎస్పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రిని గరికపాటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం సరికాదంటున్నారు. పోనీ రాజకీయ విమర్శలతో సరిపెట్టినా, ఆమె శరీరాకృతి గురించిన ఆయన చేసిన కామెంట్లను సహించలేమంటున్నారు. గరికపాటివి ప్రవచనాలు కావని, దుష్ప్రవచనాలని బీఎస్పీ నేతలు విమర్శించారు.