Nellore Corporation: నెల్లూరులో మొదలైన నామినేషన్ల సందడి
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల సందడి మెుదలైంది. ఈరోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు.
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం మొదలైంది. ఈరోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఆయా డివిజన్లకు సంబంధించిన డివిజన్ సచివాలయాల్లో నామినేషన్లు తీసుకుంటున్నారు. వైసీపీ, టీడీపీ నేతలు తొలిరోజు నామినేషన్లు దాఖలు చేశారు. సచివాలయ సిబ్బంది వారి దగ్గర నామినేషన్లు తీసుకున్నారు. 5వ తేదీ నామినేషన్ల దాఖలుకు చివరి రోజు.
నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉన్నాయి. అన్ని డివిజన్లలో వైసీపీ, టీడీపీ, జనసేన త్రిముఖ పోటీ ఉంటుందనే అంచనాలున్నాయి. కొన్నిచోట్ల వామపక్షాల తరఫున కూడా పోటీ ఉండే అవకాశముంది. బీజేపీ ఇప్పటి వరకూ పోటీపై పెదవి విప్పలేదు. అధికార వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయగా, టీడీపీ కొంతమందికి టికెట్లు ఖరారు చేసింది. అటు జనసేన కూడా జోరు చూపిస్తోంది. జనసేన తరఫున అభ్యర్థులు ఇప్పటికే ప్రచార బరిలో దిగారు.
టీడీపీ అభ్యర్థులను అధికార పార్టీ బెదిరిస్తోందనే ఆరోపణలున్నాయి. టీడీపీ తరపున కార్పొరేటర్ల స్థానానికి టికెట్ ఖరారు చేసుకున్నవారిపై లేనిపోని కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ నాయకులంటున్నారు. చివరకు ఓటర్ లిస్ట్ లో పేర్లు కూడా లేకుండా చేస్తున్నారని చెబుతున్నారు. తాజాగా నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులు కూడా తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు పెద్ద ఎత్తున నామినేషన్ వేయడానికి వస్తున్నారని, టీడీపీ తరఫున నామినేషన్ వేసేందుకు ఒక్కరినే అనుమతిస్తున్నారని చెబుతున్నారు. అన్ని డాక్యుమెంట్లు సరిగానే ఉన్నా.. ఏదో ఒకటి లేదని అంటున్నారని ఆరోపిస్తున్నారు.
మొత్తమ్మీద నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనప్పటినుంచి వైరి పక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ అభ్యర్థులకే ప్రభుత్వం సిబ్బంది వత్తాసు పలుకుతున్నారని టీడీపీ విమర్శిస్తోంది. తమ అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, మాట వినకపోతే అక్రమ కేసులు బనాయించేందుకు సైతం వెనకాడ్డం లేదని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు.
Also Read: Punch Prabhakar : ఎవరీ పంచ్ ప్రభాకర్ ? న్యాయవ్యవస్థను ఎందుకు టార్గెట్ చేసుకున్నారు ?
Also Read: Anantapur: రోకలి బండతో కొట్టి భర్తను చంపిన భార్య.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి..