Ex Minister Anil Plans: విజయం కోసం చెమటోడుస్తున్న మాజీ మంత్రి అనిల్, హ్యాట్రిక్ కోసం కొత్త వ్యూహాలు
గతంలో అనిల్, నారాయణ ఆర్థిక బలం ముందు సరిపోకపోవచ్చు కానీ, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది, అందులోనూ అనిల్ కూడా మంత్రిగా కొన్నాళ్లు పనిచేశారు. ఆర్థికంగా కూడా బలమైన పోటీ ఇస్తారనే అంచనాలున్నాయి.
నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు మాజీ మంత్రి అనిల్. విజయం సంగతి తర్వాత ముందు ఆయన వైసీపీ టికెట్ తెచ్చుకుంటే చాలు అని వైరి వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి. మాజీ మంత్రి నారాయణ మళ్లీ నెల్లూరు సిటీ నుంచి టీడీపీ తరపున బరిలో నిలవబోతున్నారు. అంటే ప్రత్యర్థి బలం అంచనా వేసేందుకు అనిల్ కి ముందుగానే అవకాశం దొరికింది. గతంలో అనిల్, నారాయణ ఆర్థిక బలం ముందు సరిపోకపోవచ్చు కానీ, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది, అందులోనూ అనిల్ కూడా మంత్రిగా కొన్నాళ్లు పనిచేశారు. ఇప్పుడు పరిస్థితి మరీ అంత తీసికట్టుగా ఉంటుందని అనుకోలేం. నారాయణకు పోటీగా అనిల్ కూడా ఆర్థిక వనరులు సమకూర్చుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం.
నారాయణ కుటుంబ గొడవలు..
అనిల్ కి కలిసొస్తున్న మరో అంశం నారాయణ కుటుంబం గొడవలు. ఇటీవల నారాయణ తమ్ముడి భార్య సోషల్ మీడియాలో చేసిన తీవ్ర ఆరోపణలు, నారాయణపై హైదరాబాద్ లో ఇచ్చిన పోలీస్ కంప్లయింట్లతో ఆ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆమె మానసిక ఆరోగ్యంపై నారాయణ వర్గం తీవ్ర ఆరోపణలు చేసినా.. ఎంతో కొంత ఇమేజ్ డ్యామేజీ అయిందనేది మాత్రం వాస్తవం. అయితే నారాయణను ఎదుర్కోడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టకూడదని అనుకుంటున్నారు అనిల్.
సేవా కార్యక్రమాలు..
ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనిల్, నెల్లూరు సిటీ ప్రజలకు బాగా దగ్గరగా ఉండేవారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆయనకు బాగా గ్యాప్ వచ్చింది. గతంలో ఆయనతో ఉన్నవారు చాలామంది ఇప్పుడు ఆయన వర్గం కాదు. దీంతో తనతో ఉన్నవారితోటే అనిల్ ఇప్పుడు రాజకీయం చేయాల్సిన పరిస్థితి. తాజాగా ఆయన ప్రతి వారం నెల్లూరు నగర నియోజకవర్గంలో రాజన్న గుండె భరోసా పేరుతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రతి డివిజన్ లో ఈ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, పేద ప్రజలకు పరీక్షలు చేయిస్తున్నారు. అవసరం అయినవారికి వైద్యసహాయం కూడా చేయిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా గతంలోకంటే ఎక్కువ హుషారుగా చేస్తున్నారు అనిల్.
అసమ్మతిని తట్టుకోగలరా..?
అనిల్ కి ఇక్కడ మరో సమస్య ఉంది. సొంత పార్టీలోనే నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ వర్గం ఆయన్ను వ్యతిరేకిస్తోంది. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే టికెట్ వచ్చినా, రాకపోయినా, గెలిచినా, గెలవకపోయినా తానెప్పుడూ జగన్ మనిషినే అని చెప్పుకుంటారు అనిల్. ప్రత్యర్థి పార్టీల నేతలకంటే, సొంత పార్టీలోని అసమ్మతే ఇప్పుడు అనిల్ ని ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. దాదాపుగా అనిల్ కి నెల్లూరు జిల్లాలో ఆశించిన సపోర్ట్ దొరకడం లేదు. మంత్రి కాకాణి కూడా అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారు. నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా రూప్ కుమార్ వర్గాన్ని దగ్గరకు తీస్తున్నారే కానీ, అనిల్ ని సపోర్ట్ చేయడం లేదు. ఈ దశలో అనిల్ విజయం మరీ అంత సులభం అనుకోలేం. అయితే పార్టీ కోసం నాయకులంతా ఒక్కటవ్వాలని జగన్ ఆదేశిస్తే మాత్రం ఈ కలహాలు తగ్గే అవకాశముంది. ఈ గొడవలన్నిటినీ పరిష్కరించుకుంటేనే అనిల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవుతారు.