Ramayapatnam Port: రామాయపట్నం పోర్ట్ భూమిపూజ చేసిన సీఎం జగన్ - మౌలిక సదుపాయాల రంగానికి కొత్త ఊపు
Ramayapatnam Port: రామాయపట్నం పోర్ట్ కి శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు సీఎం జగన్. ఉదయం అక్కడికి చేరుకున్న ఆయన.. రామాయపట్నం పోర్ట్ ప్రాంతంలో భూమి పూజచే శారు.
Ramayapatnam Port: రామాయపట్నం పోర్ట్ కి శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఉదయం నెల్లూరు జిల్లాకు చేరుకున్న ఆయన.. రామాయపట్నం పోర్ట్ ప్రాంతంలో భూమి పూజ చేశారు. సీఎం జగన్ వెంట మంత్రులు అంబటి రాంబాబు, అమర్నాథ్ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి సీఎంకు జ్ఞాపిక అందజేశారు. పోర్ట్ పనులకు శంకుస్థాపన అనంతరం అక్కడినుంచి సముద్ర తీరం వరకు వెళ్లి సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సముద్రంలో ట్రెడ్జింగ్ పనుల్ని ప్రారంభించారు. రామాయపట్నం పోర్టు పైలాన్ ను జగన్ ఆవిష్కరించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు హైవేకి కేవలం నాలుగున్న కిలోమీటర్ల దూరంలోనే ఈ పోర్టు ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకి్య తరువాత ఈ ప్రాంతం ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరులోకి వచ్చింది.
రామాయపట్నం పోర్ట్ నెల్లూరు, ప్రకాశం వాసుల ఏళ్లనాటి కల. దీంతో ఏపీలో మౌలిక సదుపాయాల రంగానికి కొత్త ఊపు వస్తుంది. వెనకబడ్డ ప్రాంతంలో అభివృద్ధికి ఊతంగా రామాయపట్నం పోర్ట్ నిలుస్తుంది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం జాతీయరహదారికి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలోనే పోర్ట్ ఏర్పాటవుతుంది. తొలి దశ పనుల్ని ఈరోజు సీఎం జగన్ ప్రారంభించగా వాటిని మూడేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. రూ. 3736.14 కోట్లతో పోర్టు తొలిదశ పనులు ఈరోజు నుంచి మొదలవుతున్నాయి.
ఏడాదికి 25 మిలియన్ టన్నుల ఎగుమతి
రాష్ట్ర ప్రభుత్వ ఏపీ మారిటైం బోర్డు కింద ఈ ప్రాజెక్టు నిర్మిస్తోంది. దీనికోసం రామాయపట్నం పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేశారు. తొలిదశలో మొత్తం నాలుగు బెర్తులు నిర్మిస్తారు. ఏడాదికి 25 మిలియన్ టన్నుల ఎగుమతి లక్ష్యంగా పెట్టుకున్నారు. కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం నాలుగు బెర్తుల నిర్మాణం మొదలవుతోంది. మూడేళ్ల తర్వాత రెండోదశలో 138.54 మిలియన్ టన్నులకు విస్తరిస్తారు. మొత్తంగా 15 బెర్తుల నిర్మాణం అప్పటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు సహా రాయలసీమలోని పలు జిల్లాలు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు సంబంధించి పారిశ్రామిక, వాణిజ్య, రవాణా సేవల్లో రామాయపట్నం పోర్ట్ కీలకం కాబోతోంది.
తరలివచ్చిన నేతలు..
రామాయపట్నం పోర్ట్ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి అటు ప్రకాశం, ఇటు నెల్లూరు జిల్లాల నేతలు తరలి వచ్చారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చారు. గతంలో ఈ ప్రాంతం ప్రకాశం జిల్లాలో ఉంది, ఇప్పుడిది జిల్లాల పునర్విభజనలో నెల్లూలోకి వచ్చింది. కందుకూరు నియోజకవర్గంలో పోర్ట్ ప్రాంతం వస్తుంది. దీంతో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో రెండు కీలక పోర్ట్ లు ఉన్నట్టవుతుంది. ఇప్పటికే కృష్ణపట్నం ఓడరేవు ఉండగా, కొత్తగా రామాయపట్నం ఏర్పాటవుతోంది. రామాటపట్నం పోర్ట్ ఏర్పాటుతో కోస్తా జిల్లాలనుంచి ఎగుమతులకు మంచి ప్రోత్సాహం లభించినట్టవుతుంది.