Kakani on Chandrababu: వాలంటీర్ల వ్యవస్థ చంద్రబాబు ఊహకు కూడా అందడం లేదు: మంత్రి కాకాణి
చంద్రబాబు ఇటీవల వైర్ లెస్ హెడ్ సెట్ తో ప్రసంగాలిస్తున్నారు. దీన్ని మైఖేల్ జాక్సన్ తో పోల్చి చెబుతూ ఎగతాళి చేశారు మంత్రి కాకాణి. సుపుత్రుడు మీద నమ్మకం లేకనే దత్తపుత్రుడు దగ్గరకు వెళ్తున్నాడని చెప్పారు.
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. మరో మూడు రోజుల్లో నెల్లూరు జిల్లాకు చంద్రబాబు రానుండగా ఆయన పర్యటనలు, ప్రసంగాలపై కాకాణి సెటైర్లు వేశారు. చంద్రబాబు మైఖేల్ జాక్సన్ లా వేషం వేసుకుని ఊరూరా తిరిగి ప్రదర్శనలిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఇటీవల వైర్ లెస్ హెడ్ సెట్ తో ప్రసంగాలిస్తున్నారు. దీన్ని మైఖేల్ జాక్సన్‌లాగ వేషం వేశారా అంటూ చంద్రబాబును ఉద్దేశించి కామెంట్ చేశారు కాకాణి.
చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు కాకాణి. సుపుత్రుడు నారా లోకేష్ మీద నమ్మకం లేకనే చంద్రబాబు దత్తపుత్రుడు దగ్గరకు వెళ్తున్నాడని అన్నారు. ఖమ్మం, విజయనగరం పర్యటనల్లో రకరకాలుగా మాట్లాడుతున్నారని చెప్పారు. బహిరంగ సభలో సైకిల్ వద్దు అని మాట్లాడుతున్న ఆయనకు మతి భ్రమించిందన్నారు. రైతులకు ఇచ్చే పాస్ బుక్ లో ముఖ్యమంత్రి జగన్ ఫొటో ఏంటి అని అంటున్న ఆయన.. గతంలో ఎస్సీ కార్పొరేషన్ వాహనాలపై తన ఫొటో ఎందుకు వేయించుకున్నారని నిలదీశారు. టీడీపీ అధినేత ముఖాన్ని చూస్తేనే ప్రజలు భరించలేని స్థితిలో ఉన్నారని చెప్పారు.
వ్యవసాయ మోటర్లుకు మీటర్ల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు ఆయన హయాంలో రైతులకు కనీసం ఉచిత విద్యుత్ ఇవ్వలేమని చెప్పారని గుర్తు చేశారు. కరెంటు రేట్లు పెంచితే ధర్నా చేస్తున్న ప్రజల పై పోలీసులుతో కాల్పులు జరిపి చంపించిన చరిత్ర చంద్రబాబుదేనన్నారు. సచివాలయం వ్యవస్థ గురించి చంద్రబాబు తప్పుగా మాట్లాడారని, వాలంటీర్ల పెత్తనం ఏంటని అంటున్నారని, ఆయన ఊహకు అందకుండా వాలంటీర్ల వ్యవస్థను తీర్చిదిద్దామన్నారు కాకాణి. ఆర్బీకేల గురించి మాట్లాడే చంద్రబాబుకి అసలు వాటి విలువ తెలుసా అని ప్రశ్నించారు. ప్రపంచం లోనే గొప్ప వ్యవస్థ RBK లని ఇంగ్లాండ్ నుండి వచ్చిన ఒక కమిటీ ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేసిందని చెప్పారు. రాష్ట్రంలోని షుగర్ ఫ్యాక్టరీలన్నీ చంద్రబాబు హయాంలోనే మూతబడ్డాయని గుర్తు చేశారు.
నీళ్ళు లేని దగ్గర నాట్లు వేస్తూ ఫొటోలకు పోజులు
చంద్రబాబు ఫోటోల కోసం షూ వేసుకుని, ప్యాంటు వేసుకుని నీళ్ళు లేని దగ్గర నాట్లు వేస్తూ పోజులిచ్చేవారని చెప్పారు కాకాణి. రైతు కుటుంబాల గురించి తెలిసిన సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసని, ఆయన ఒక రోజు తెలంగాణలో పర్యటిస్తే, ఇంకోరోజు ఆంధ్రాలో ఉంటారని, ఓరోజు బీజేపీని తిడతారని, ఇంకోరోజు వారి పంచనే చేరతారని చెప్పారు.
చంద్రబాబు ముఖ్య మంత్రిగా 14 సంవత్సరాలు పని చేసినా తన హయాంలో కుప్పంను రెవెన్యూ డివిజన్ చేసుకోలేకపోయారని, చివరకు జగన్ ని అర్థించి ఆ పని పూర్తి చేసుకున్నారని ఎద్దేవా చేశారు కాకాణి. జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లి చదువుకోలేక పోయినా ఇక్కడ చదువుకుని ముఖ్య మంత్రి అయ్యారని, చంద్రబాబు కొడుకుని విదేశాల్లో చదివిస్తే, ఆయన తిరిగొచ్చి కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారని అన్నారు. చంద్రబాబు పర్యటనలకు జనం తండోపతండాలుగా వస్తున్నారంటూ ఆయన అనుకూల మీడియా అతి ప్రచారం చేస్తోందని, చివరకు చంద్రబాబుకి ఓట్లు రావని, సీట్లు అసలే రావని కాకాణి వ్యాఖ్యానించారు.