YS Jagan At Gautham Reddy Condolence Meeting: నేను లేకపోతే గౌతమ్ రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదేమో: ఏపీ సీఎం జగన్
నెల్లూరు నగరంలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. చిన్నప్పటి నుంచి తనకు గౌతమ్ రెడ్డితో పరిచయం ఉందని, గౌతమ్ లేడన్న విషయం ఇంకా నమ్మలేకపోతున్న అన్నారు.
Gautham Reddy Condolence Meeting In Nellore: చిన్నప్పటి నుంచి తనకు గౌతమ్ రెడ్డితో పరిచయం ఉందని, ఏపీ మాజీ మంత్రి ఇక లేరన్న విషయం ఇంకా నమ్మలేకపోతున్నానని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాను లేకపోతే గౌతమ్ రెడ్డి రాజకీయాల్లోకి కూడా వచ్చి ఉండేవాడు కాదేమోనని అన్నారు జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు నగరంలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి తాను బయటకు అడుగు వేసినప్పుడు కాంగ్రెస్ తో తమకు యుద్ధం మొదలైందని చెప్పారు. గౌతమ్ రెడ్డి వల్లే అప్పట్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా తనతో కలసి అడుగు వేశారని, తన ప్రతి అడుగులో గౌతమ్ తోడుగా ఉన్నారని చెప్పారు.
నా కంటే గౌతమ్ పెద్దవాడు..
తనకంటే గౌతమ్ రెడ్డి (Gautham Reddy Elder Than AP CM YS Jagan) ఓ ఏడాది పెద్దవాడని, కానీ తనకంటే పెద్ద అని మనసులో పెట్టుకోలేదని, తనని ఓ అన్నగా భావించేవారని చెప్పారు. నువ్వు చేయగలుగుతావు, నువ్వు సాధిస్వావంటూ తనను కూడా గౌతమ్ ప్రేరేపించేవారని గుర్తు చేసుకున్నారు. కాలక్రమంలో గౌతమ్ ని తాను రాజకీయాల్లోకి తీసుకొచ్చానని, మంచి రాజకీయ నాయకుడిగా ఎదిగాడని గుర్తుచేసుకున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంచి మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. పరిశ్రమలు, ఐటీ, స్కిల్ డెవలప్ మెంట్.. ఇలా మొత్తం 6 శాఖలకు ఆయన మంత్రిగా వ్యవహరించి ఏపీ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చారని అన్నారు. చివరి క్షణాల్లో కూడా దుబాయ్ కి వెళ్లొచ్చిన తర్వాత తనను కలిసేందుకు టైమ్ అడిగారని, ఆలోపే ఇలా జరిగిందని గుర్తు చేసుకున్నారు జగన్.
ఆ బాధ ఎప్పటికీ తీరదు
మంచి స్నేహితుడు, మంచి వ్యక్తిని కోల్పోయామన్న బాధ తనకు ఎప్పటికీ తీరదన్నారు సీఎం జగన్. మంచి వ్యక్తిని కోల్పోయాం కానీ, ఆ కుటుంబానికి తనతోపాటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందన్నారు. ఆ లోటు భర్తీ చేయలేం కానీ, ఆయన అందరి మనసుల్లో ఉన్నారని చెప్పారు. ఉదయగిరిలోని మేకపాటి ఇంజినీరింగ్ కాలేజీ గురించి రాజమోహన్ రెడ్డి (Mekapati Rajamohan Reddy) తనకు చెప్పారని, ఉదయగిరి నియోజకవర్గానికి మంచి జరిగే విషయాలను తన దృష్టికి తెచ్చారని అన్నారు. అన్నిటినీ కచ్చితంగా పూర్తి చేస్తామని, సంగం బ్యారేజ్ పనుల్ని మే 15లోపు పూర్తి చేసి, సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు పెడతామన్నారు. ప్రాజెక్ట్ ప్రారంభించే టైమ్ లో మేకపాటి కుటుంబాన్ని ఆహ్వానిస్తామని, మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజీ అనే పేరు పెట్టి, గౌతమ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేస్తామన్నారు జగన్. అన్నిరకాలుగా ఆ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నట్టు చెప్పారు జగన్.
Also Read: AP BJP : సోము వీర్రాజును తొలగిస్తున్నారా ? ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం రేస్ ప్రారంభమైపోయింది !