రగులుతున్న నెల్లూరు రాజకీయం- సొంత పార్టీ నేతలపై వైసీపీలో మరో ఎమ్మెల్యే ఆగ్రహం
సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, సొంత పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. తనపై తప్పుడు పోస్ట్ లు పెట్టారని, అలాంటి వారికి సొంత పార్టీ నేతలు మద్దతు తెలపడం సరికాదన్నారాయన.
నెల్లూరులో రాజకీయాలు ఇప్పుడంతా వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు సాధించినా కూడా పార్టీ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. తాజాగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య.. సొంత పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. తనపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్ లు పెట్టారని, అలా పెట్టినవారికి సొంత పార్టీ నేతలు మద్దతు తెలపడం సరికాదని అంటున్నారాయన. ఆయన ఆవేదన ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. ఇప్పటికే జిల్లాలో ఉన్న సమస్యలు చాలవన్నట్టు... ఇప్పుడు మరో ఎమ్మెల్యే పార్టీలో కలకలం రేపే వ్యాఖ్యలు చేయడం విశేషం.
అసలేం జరిగింది..?
మంగపల్లి జ్యోతిష్ కుమార్‌రెడ్డి అలియాస్ బాబురెడ్డి అనే వ్యక్తి సూళ్లూరుపేట మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగి. కిలివేటి సంజీవయ్యే అతడికి ఉద్యోగం ఇప్పించారని అంటారు. అతడు శ్రీహరికోటకు చెందినవాడు. వైసీపీలో చురుకైన కార్యకర్త, కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నా కూడా ప్రభుత్వ కార్యక్రమాలను సమర్ధిస్తూ పోస్టింగ్ లు పెడుతుంటాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. ఇటీవల బాబు రెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో గొడవ మొదలైంది.
వాట్సప్ లో వైరల్ మెసేజ్..
తనను ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత బాబు రెడ్డి వాట్సప్ లో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఓ మెసేజ్ పెట్టాడు. అందులో స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను కూడా విమర్శించాడు. దీంతో ఆ మెసేజ్ వైరల్ గా మారింది. ఆ మెసేజ్ వైరల్ కావడం పోలీసుల వరకు వెళ్లింది. సూళ్లూరుపేట పోలీసులు బాబు రెడ్డిని స్టేషన్ కి తీసుకెళ్లి కొట్టారనే ఆరోపణలు వినపడుతున్నాయి. తనను పోలీసులు తీవ్రంగా కొట్టారంటూ బాబు రెడ్డి ఫొటోలు, వీడియోలను తిరిగి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది.
వైసీపీ కోసం పనిచేసిన కార్యకర్త ఇలా పార్టీకి వ్యతిరేకంగా మారడంతో స్థానిక నాయకులు కలుగజేసుకున్నారు. చెంగాళమ్మ ఆలయం వద్దకు బాధితుడిని పిలిపించి మాట్లాడారు. బాబు రెడ్డిని కొట్టడం సరికాదంటూ చెంగాళమ్మ ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి మండిపడ్డారు. దీంతో వ్యవహారం సంజీవయ్య వర్సెస్ బాబురెడ్డి మద్దతుదారులు అన్నట్టుగా మారింది. ఆ తర్వాత ఎమ్మెల్యే సంజీవయ్య వారి వద్దకు వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశారట. తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టిన వ్యక్తిపై ఎందుకు సానుభూతి చూపిస్తున్నారంటూ కోప్పడ్డారట.
అధిష్టానం చొరవ..
అయితే బాబురెడ్డికి సజ్జల వర్గం మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డి.. బాబురెడ్డిని ఫోన్లో పరామర్శించారని తెలుస్తోంది. తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా ఫోన్లో పరామర్శించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేని విమర్శించిన వ్యక్తికి పార్టీ పెద్దలు సపోర్ట్ గా నిలిచారని ప్రచారం జరుగుతోంది. ఈ ఎపిసోడ్ లో సంజీవయ్య ఇబ్బంది పడుతున్నారు. వైసీపీ కార్యకర్తని పోలీసులు కొట్టారనే విషయం కూడా సంచలనంగా మారింది.