Anam Ramanarayana Reddy: సలహాదారుల మాటలు అస్సలు లెక్కచేయను - సజ్జలపై ఆనం సంచలన వ్యాఖ్యలు
ఆనం రామనారాయణ రెడ్డి అనే ఆయన అసలు తమ ఎమ్మెల్యేనే కాదని, అసలు తాము ఆయన ఓటే అడగబోమని సజ్జల అన్నారని గుర్తు చేశారు.
క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధిష్ఠానం అనర్హత వేటు వేయడంపై తొలిసారిగా ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను ఆత్మప్రభోదానుసారమే ఓటు వేసినట్లుగా చెప్పారు. వైఎస్ఆర్ సీపీ అధిష్ఠానం తనను సస్పెండ్ చేయడంపై ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లుగా సజ్జల రామక్రిష్ణారెడ్డికి ఎలా తెలిసిందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అత్యంత రహస్యంగా జరుగుతుందని, ఆ పోలింగ్ లో తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డట్లు ఎలా బయటకు వస్తుందని నిలదీశారు.
ఎన్నికల ముందురోజు సజ్జల రామక్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ఆనం రామనారాయణ రెడ్డి అనే ఆయన అసలు తమ ఎమ్మెల్యేనే కాదని, అసలు తాము ఆయన ఓటే అడగబోమని అన్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చిన తర్వాత తాను రూ.20 కోట్ల నిధులు తీసుకుని నేను క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డానని అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సజ్జల రామక్రిష్ణా రెడ్డి విలేకరిగా పని చేసే సమయం నుంచి తనకు తెలుసని అన్నారు. ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఆయన కోట్లాది రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘అందరూ ఆయనలాగానే ఉంటారనుకుంటే ఎలా? డబ్బు తీసుకొని ఓటేయాల్సిన అవసరం నాకు లేదు’’ ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. సలహాదారు పోస్టు కోసం సజ్జల ఎన్ని కోట్లు ఇచ్చారని విమర్శించారు. మిగిలిన సలహాదారుల నుంచి ఇంకా ఎన్ని కోట్లు వసూలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విలువలు లేని సలహాదారుల మాటలను తాను లెక్క చేయబోనని ఆయన అన్నారు.
ఈసీ చెబితే ఒప్పుకుంటా - ఆనం
తాను క్రాస్ ఓటింగ్ చేశానో లేదో ఎన్నికల కమిషన్ చెబితే తాను ఒప్పుకుంటానని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. అంతేకానీ, ఒకరిపై బట్ట కాల్చి వేయడం సరికాదని అన్నారు. తాను ఎందరో ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశానని, ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలను ఎదుర్కోలేదని ఆయన అన్నారు. సజ్జల అవినీతి పరుడంటూ ఆయన ఆరోపించారు.