Prakasam District News: బ్రెయిన్ ట్యూమర్ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
Crime News: ప్రార్థనలు చేస్తే జబ్బులు తగ్గుతాయన్న నమ్మం బాలిక ప్రాణాలు తీసింది. బ్రెయిన్ ట్రూమర్‌తో బాధపడుతున్న పాపతో 40 రోజులపాటు ప్రార్థనలు చేయించిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.
Prakasam District Crime News : అనారోగ్యం పాలైతే ఆసుపత్రికి వెళ్లాలి... కానీ ఓ బాలికను చర్చిలో ఉంచి ప్రార్థనలు చేశారు. చివరకు ఆమె ప్రాణాలు పోయాయి. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ దారుణం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే చికిత్స చేయించే స్థోమత లేక ప్రార్థనలతో నయం చేయించాలని చూశామంటున్నారు తల్లిదండ్రులు.
ప్రకాశం జిల్లా కలువాయి మండలం బాలాజీరేవుపేటకు చెందిన పామర్తి లక్ష్మయ్య దంపతులకు 8 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె పేరు భవ్య శ్రీ. రెండు నెలల క్రితం ఆమెకు జబ్బు చేసింది. స్పృహతప్పి పడిపోవడంతో నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు షాకింగ్ విషయం చెప్పారు.
చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని పెద్దాసుపత్రికి తరలించాలని సూచించారు. చెన్నై కానీ,హైదరాబాద్ కానీ తరలించి మెరుగైన వైద్యం అందించకపోతే ప్రమాదమని హెచ్చరించారు. ముందు భయపడిపోయిన తల్లిదండ్రులకు వైద్యులు చెప్పిన సూచన కాస్త ఊరట కల్పించింది. మంచి వైద్యం అందిస్తే బాలికకు ప్రమాదం ఉండదని తేలింది. దీంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు లక్ష్మయ్య దంపతులు.
ఆసుపత్రికి వెళ్లే ముందు చర్చికి వెళ్లి ప్రార్థన చేసుకుందామని కొన్ని రోజుల క్రితం చేజర్ల మండలంలోని అదురుపల్లికి వెళ్లారు. అక్కడ పాస్టర్ బాలిక గురించి తెలుసుకున్నారు. ప్రార్థనలు చేస్తే బాలికకు నయమయ్యే అవకాశం ఉందని కూడా చెప్పినట్టు స్థానికులు చెబుతున్నారు. పాస్టర్ మాటలు విన్న బాలిక తల్లిదండ్రులు కొన్ని రోజులు అక్కడే ఉంచి ప్రార్థనలు చేయించారు.
కొన్ని రోజుల ప్రార్థనలకు బాలిక చలాకీగా తిరగడం మొదలు పెట్టిందని అంటున్నారు. జబ్బు తగ్గుముఖం పట్టిందని ఆనందంతో వచ్చే వారికి అన్నదానం కూడా చేశారట. ఆ ఆనందం వారికి ఎన్నో రోజులు నిలవలేదు. కొద్ది రోజులకే మళ్లీ బాలిక అనారోగ్యం పాలైంది. చివరకు సోమవారం చనిపోయింది.
విషయం తెలుసుకున్న బంధువులు వచ్చి చర్చి వద్ద ఆందోళన చేశారు. అనారోగ్యం పాలైన బాలికకు మెరుగైన వైద్యం అందించకుండా మోసం చేశారని ఆరోపించారు. బ్రెయిన్ ట్యూమర్ ఉందని వైద్యులు చెబితే ప్రార్థనలతో ఎలా నయం చేస్తారని ప్రశ్నించారు. ఇదంతా మోసం కాదా అంటూ నిలదీశారు.
బాలిక తల్లిదండ్రులు వారితో మాట్లాడి... బాలికకు చికిత్స చేయించే ఆర్థిక స్థోతమ లేదని అందుకే దేవున్నే నమ్ముకున్నట్టు చెప్పారు. తమ అభ్యర్థన మేరకే పాస్టర్ ప్రార్థనలు చేశారని ఇందులో వేరే వాళ్ల తప్పులు లేవని చెప్పారు. తమ ఇష్ట ప్రకారమే ఇదంతా జరిగిందని అంటున్నారు. ఇదే విషయాన్ని పోలీసులకు కూడా చెప్పారు.
పోలీసులు పాస్టర్‌ను కూడా ప్రశ్నించారు. తల్లిదండ్రుల కోరిక మేరకే తాము బాలికను ఉంచి ప్రార్థనలు చేశామని తెలిపారు. తాము ఎలాంటి ఒత్తిడి చేయలేదన్నారు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read: దెబ్బ తగిలిందని ఆస్పత్రికి వెళ్తే మహిళపై స్కానింగ్ సెంటర్ సిబ్బంది అసభ్య ప్రవర్తన