నెల్లూరు గ్యాంగ్ రేప్ కేసులో 8మంది అరెస్ట్- మరో నిందితుడి కోసం గాలింపు
బాధితురాలు పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు గమనించారు. దిశ నెంబర్ కి కాల్ చేసారు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చారు. అప్పటికే నిందితులు ఆటో, బైక్ లు వదిలేసి పారిపోయారు.
నెల్లూరులో సంచలనంగా మారిన గ్యాంగ్ రేప్ కేసులో 8మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తం 9మంది ఈ ఘటనలో పాల్గొనగా ఒక ముద్దాయి పారిపోయాడు. మిగతా 8మందిని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు పోలీసులు. మరో వ్యక్తికోసం గాలిస్తున్నట్టు తెలిపారు.
ఈనెల 10న గ్యాంగ్ రేప్ కేసు ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. బాధితురాలి సొంత జిల్లా శ్రీకాకుళం అని తెలిపారు పోలీసులు. ఆమె అక్క నెల్లూరు జిల్లాకు చెందిన కోవూరులో నివాసం ఉండటంతో ఆమెకు తోడుగా బాధితురాలు కూడా నెల్లూరు జిల్లాకు వచ్చారు. అక్కకు ప్రసవం కావడంతో ఆమెను నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. బాధితురాలు మందులకోసం నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ కి వచ్చారు. అయితే అక్కడినుంచి ఆమెను కొంతమంది ఆకతాయిలు ఆటోలో బలవంతంగా నెల్లూరు రూరల్ మండలం కొండాయపాలెంకు తరలించారు. బాధితురాలిని కత్తితో బెదిరించి బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు.
ఒకరి తర్వాత మరొకరు అఘాయిత్యం..
బాధితురాలి నోట్లో గుడ్డలు కుక్కి, ఆమె చేతులు కట్టేసి ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలుస్తోంది. మొత్తం నలుగురు ఆమెపై అఘాయిత్యం చేశారు. అనంతరం మరో ఐదుగురిని ఆటోలో అక్కడికి పిలిపించారు. ఆ తర్వాత వారు కూడా ఆమెను రేప్ చేశారు. మొత్తం 9మంది ఈ రేప్ ఘటనలో పాల్గొన్నట్టు నిందితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిర్థారించుకున్నారు.
దిశ కాల్ తో వెలుగులోకి..
ఆ ఘటన అనంతరం బాధితురాలు పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు గమనించారు. దిశ నెంబర్ కి కాల్ చేసారు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చారు. అప్పటికే నిందితులు ఆటో, బైక్ లు వదిలేసి పారిపోయారు. పోలీసులు వాటి సాయంతో నిందితులను గుర్తించారు.
వారంతా నెల్లూరు నగరానికి చెందిన పాత నేరస్తులుగా గుర్తించారు. భాను విష్ణువర్ధన్ అలియాస్ లడ్డసాయి, జగదీష్ అలియాస్ డియోసాయి, యుగంధర్ అలియాస్ యుగి, ఎ.సుజన్‌కృష్ణ అలియాస్ చింటూ ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని వెళ్లారు, ఆ తర్వాత రేప్ చేశారు. వారు ఫోన్ చేయగా మరో ఐదుగురు అక్కడికి వచ్చారు. సాయివర్ధన్, షేక్ హుస్సేన్‌బాషా అలియాస్ కేటీఎం, సాయిసాత్విక్, కె.అజయ్, రేవంత్ ఆటోలో అక్కడికి వచ్చి ఆమెపై లైంగిక దాడి చేశారు. వీరిలో జగదీష్ అలియాస్ డియోసాయి పరారీలో ఉన్నాడు. అతడికోసం పోలీసులు గాలిస్తున్నారు. మిగతా 8మందిని అరెస్ట్ చేశారు. గొలగమూడి క్రాస్ రోడ్డు సమీపంలో నిందితుల్లో 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
నెల్లూరు నగరంలో గ్యాంగ్ రేప్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అందులోనూ 9మంది ఒక యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రేప్ చేయడం, తప్పించుకు పారిపోవడంతో పోలీసు వ్యవస్థపై ఆరోపణలు వచ్చాయి. వెంటనే పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు. వారికోసం గాలింపు ముమ్మరం చేశారు. రోజుల వ్యవధిలోనే 8మందిని అరెస్ట్ చేశారు. దిశ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లామని తెలిపారు పోలీసులు. అయితే నిందితులు అక్కడినుంచి వెంటనే పారిపోవడంతో వారికోసం గాలించామని, వెదికి పట్టుకున్నామని చెప్పారు.