Kakani On Pawan Kalyan : పవన్ కి మూడు కాదు 30 ఆప్షన్లు ఉన్నా వైసీపీని ఏంచేయలేరు- మంత్రి కాకాణి
Kakani On Pawan Kalyan : నెల్లూరు జిల్లా వైసీపీ ప్లీనరీ సమావేశంలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. పవన్ కల్యాణ్ పై ఆయన సెటైర్లు పేల్చారు. 30 ఆప్షన్లు ఉన్నా పవన్ ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు
Kakani On Pawan Kalyan : నెల్లూరు జిల్లా వైసీపీ ప్లీనరీ సమావేశంలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. పవన్ కల్యాణ్ పై ఆయన సెటైర్లు పేల్చారు. పవన్ కి మూడు ఆప్షన్లు కాదు కదా 30 ఆప్షన్లు ఉన్నా వైసీపీని ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు కాకాణి. లోకేశ్, పవన్ కల్యాణ్ కి కనీసం వ్యవసాయంపై అవగాహన లేదని, అలాంటి వారు రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. 10 పంటలు చూపిస్తే, అందులో కనీసం 5 పంటల పేర్లు కూడా చెప్పలేని లోకేశ్, పవన్ కి వ్యవసాయంపై వైసీపీని విమర్శించే అర్హత లేదన్నారు. పవన్ కి మూడు ఆప్షన్లు కాదు, 30 ఆప్షన్లు ఉన్నా కూడా వైసీపీకి వచ్చినా ఢోకా ఏమీ లేదన్నారు. 5 రూపాయలకు అన్నక్యాంటీన్లో 10 మందికి భోజనం పెడితే ఉపయోగం ఏంటని, వైసీపీ హయాంలో ప్రజలందరికీ సంక్షేమం అందుతోందని చెప్పారు. అన్న క్యాంటీన్లు తీసేశారంటూ వైసీపీపై బురదజల్లే ప్రయత్నం చేశారని, చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఆగస్ట్ లో బ్యారేజీల ప్రారంభోత్సవం
నెల్లూరు జిల్లాకు సంబంధించి సంగం బ్యారేజ్, నెల్లూరులోని పెన్నా బ్యారేజ్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు వీటి ప్రారంభోత్సవాలను వాయిదా వేశారు. గతంలో సీఎం జగన్ కూడా ఈ ఏడాది సంక్రాంతికి ప్రారంభోత్సవం ఉందన్నారు కానీ, అది దాటిపోయి ఆరు నెలలవుతోంది. ఇప్పుడు కాకాణి మరో కొత్త డెడ్ లైన్ ప్రకటించారు. రెండు బ్యారేజీలను పూర్తి చేసి ఆగస్ట్ లో ప్రారంభోత్సవం చేస్తామని చెప్పారు. పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమం అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్ దేనని అన్నారు మంత్రి కాకాణి. మూడేళ్ల పాలనలో చరిత్రలో నిలిచిపోయేలా సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారన్నారు. కోవిడ్ కారణంగా రెండేళ్లు ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకోలేకపోయామని, ఇప్పుడు ప్లీనరీలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ చర్చించుకుంటామని చెప్పారు. రాష్ట్ర స్థాయి ప్లీనరీలో కొత్త నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు.
2024 ఎన్నికల్లో చావో రేవో
భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని చెప్పారు మంత్రి కాకాణి. ఈ అక్కసుతోనే ప్రతిపక్షం విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబుకు సీఎం వైఎస్ జగన్‌కి చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించి మహిళా పక్షపాతిగా జగన్ నిలిచారని చెప్పారు. శరీరంలో అవయవాలు ఎంత ముఖ్యమో పార్టీకి కార్యకర్తలు అంతే ముఖ్యం అని, కార్యకర్తల త్యాగాలు, వారి పనితనం వల్లే తాము ఈరోజు ఇక్కడ ఉండగలిగామన్నారు. 2024 ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలసిన పరిస్థితి చంద్రబాబుకి వచ్చిందని, అందుకే ఆయన కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, ఎంతకైనా తెగిస్తారని అన్నారు.