Minister Kakani On Pawan : పవన్ నటుడు, చంద్రబాబు మహానటుడు, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ పవన్ చదువుతున్నారు- మంత్రి కాకాణి
Minister Kakani On Pawan : నటుడు పవన్ కల్యాణ్, మహా నటుడు చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు టైంలో క్రాఫ్ హాలీడే ప్రకటించారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితి లేదన్నారు.
Minister Kakani On Pawan : రైతు ద్రోహి చంద్రబాబుతో మళ్లీ చేతులు కలిపేందుకు సినీనటుడు పవన్‌కల్యాణ్ తహతహలాడుతున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. రైతు ద్రోహిగా నిలిచిన చంద్రబాబును ఆ ఐదు ఏళ్లూ పవన్‌కల్యాణ్ సమర్ధించారని, ఆ తర్వాత ప్యాకేజీ కుదరక వ్యతిరేకించిన పవన్ మళ్లీ ఇప్పుడు అదే రైతుద్రోహితో కలిసేందుకు తహతహలాడుతున్నారని అన్నారు. అందుకే రైతులకు అన్ని విధాలుగా మేలు చేసి, వ్యవసాయాన్ని పండగలా చేసి రైతుమిత్రగా ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పారు. వ్యవసాయం, రైతుల స్థితిగతులకు సంబంధించి నటుడు పవన్ కల్యాణ్, మహానటుడు చంద్రబాబు వేర్వేరుగా, రకరకాల కామెంట్స్ చేశారని, ప్రధానంగా క్రాప్ హాలీడే గురించి మాట్లాడారని వ్యవసాయం, వ్యవసాయ విధానం, రైతుల గురించి పవన్‌కు అసలు ఏం తెలుసని ప్రశ్నించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ చదువుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏనాడూ ఎవరితోనూ జత కట్టలేదని, సింహంలా ఒంటరిగా పోటీ చేసి అందరినీ మట్టి కరిపించారని, ఆ దమ్ము, ధైర్యం పవన్ కి ఉన్నాయా అని ప్రశ్నించారు.
టీడీపీ పాలనలోనే క్రాఫ్ హాలీడే
వ్యవసాయం గురించి ఏం తెలియని వ్యక్తి పవన్ కల్యాణ్. సినిమాల్లో లాగా ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చూసి చదివే వ్యక్తి పవన్. ఆయన తెలుసుకోవల్సింది ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం రైతాంగం విధానాలు. చంద్రబాబు నాయుడు హయాంలో అమలు చేసిన విధానాలు చూస్తే అప్పుడు అర్థం అవుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో క్రాఫ్ హాలీ డే జరిగింది. ఇప్పుడు చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ మాట్లాడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. చంద్రబాబు హయాంలో కరువు మండలాలు ప్రకటించేవారు. వైసీపీ మూడేళ్లలలో ఆ మాటేలేదు. - కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
టీడీపీ ఆరిపోయే దీపం - మంత్రి జోగి రమేష్
వైసీపీ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగిందని మంత్రి జోగి రమేష్ అన్నారు. టీడీపీ ఆరిపోయే దీపం లాంటిందని ఆయన విమర్శించారు. శనివారం ఏఎస్‌పేట ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ఉపఎన్నికల్లో భారీ మెజార్టీ కోసం వైసీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బద్వేల్ తరహాలోనే ఆత్మకూరు పరిస్థితి ఉంటుందన్న మంత్రి జోగి రమేష్ పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. పోటీ నుంచి తప్పుకున్నా లోపాయికారి మద్దతివ్వడం టీడీపీకి అలవాటే అని విమర్శించారు. జన్మభూమి కమిటీతో చంద్రబాబు రాష్ట్రాన్ని కర్మభూమిగా మార్చేశారని విమర్శించారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా సీఎం జగన్ పాలన చేస్తున్నారన్నారు.