Nellore Flex Politics : నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీ రాజకీయం, ప్రత్యర్థులకు మాజీ మంత్రి అనిల్ వార్నింగ్
Nellore Flex Politics : నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీ రగడ మొదలైంది. ఈ నెల 26 నుంచి తన నియోజకవర్గంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు కనిపిస్తే చింపేస్తానని మాజీ మంత్రి అనిల్ అంటున్నారు.
Nellore Flex Politics : నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీ రాజకీయాలు మొదలయ్యాయి. ఈ నెల 26 నుంచి నగరంలో ఫ్లెక్సీలకు అనుమతి లేని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హుకూం జారీచేశారు. గతంలో మంత్రి కాకాణి ఫ్లెక్సీలు చించివేసిన ఘటనలు జరిగాయి. అనిల్ కుమార్ తాజా హెచ్చరికలతో మళ్లీ ఆ సీన్లు రిపీట్ అవుతాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఫ్లెక్సీ కానీ, బ్యానర్ కానీ కనపడటానికి వీల్లేదు
కాకాణి గోవర్థన్ రెడ్డికి మంత్రి పదవి లభించిన సందర్భంలో నెల్లూరు నగరంలో వేసిన ఫ్లెక్సీలు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. అప్పట్లో అందరూ మాజీ మంత్రి అనిల్ ని వేలెత్తి చూపించారు. ఆ వ్యవహారం చివరకు చినికి చినికి గాలివానలా మారి సీఎం జగన్ దగ్గరకు పంచాయితీకి వెళ్లింది. మళ్లీ ఇప్పుడు అలాంటి గొడవలే మొదలయ్యేలా కనపడుతున్నాయి. దీనికి ఎమ్మెల్యే అనిల్ చేసిన కామెంట్లే కీలకంగా మారాయి. నెల్లూరు నగరంలో ఈ నెల 26నుంచి ఒక్క ఫ్లెక్సీ కానీ, బ్యానర్ కానీ కనపడటానికి వీల్లేదంటున్నారు అనిల్. ప్రతిపక్షాలు కానీ, ఇంకెవరైనా.. ఫ్లెక్సీలు వేసి ఆ తర్వాత తనపై ఆరోపణలు చేయొద్దని ఆయన ముందుగానే స్పష్టం చేశారు. తన నియోజకవర్గపరిధిలో 26వ తేదీ తర్వాత ఎలాంటి ఫ్లెక్సీలు కనపడటానికి వీల్లేదన్నారు. సీఎం జగన్ ఆదేశాలను తాను తూచా తప్పకుండా పాటిస్తానన్నారు అనిల్. అయితే నెల్లూరులో అనిల్ వ్యాఖ్యలు కలకలం రేపాయి. జిల్లా మొత్తంలో ఏ నాయకుడి మెప్పు పొందాలన్నా అభిమానులు నగరంలో ఫ్లెక్సీలు కట్టాల్సిందే. ఎవరైనా నగరానికి వస్తున్నారంటే ఫ్లెక్సీలు, బ్యానర్లు వేయాల్సిందే. అలాంటిది ఇప్పుడు అనిల్ కుమార్ ఫ్లెక్సీలు తొలగిస్తామంటూ స్టేట్ మెంట్ ఇచ్చే సరికి సొంత పార్టీలోనే కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అనిల్ తో అంటీముట్టనట్టుగా ఉన్న ఆయన బాబాయ్ రూప్ కుమార్ వర్గాన్ని టార్గెట్ చేసేందుకు, మరోసారి రెచ్చగొట్టేందుకే అనిల్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
అనిల్ కక్షసాధిస్తున్నాడని లొల్లి చేయొద్దు
"ప్రభుత్వ సంక్షేమ పథకాలు సవ్యంగా అందుతున్నాయో లేదో గడప గడపకూ వెళ్లి తెలుసుకుంటున్నాం. నా నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తు్న్నాం. మున్సిపల్ సిబ్బంది కొరత ఉంది. అందువల్ల డ్రైనేజీ క్లీనింగ్ లో జాప్యం జరుగుతోంది. కొంత మంది పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్నారు. ఇకపై అలా కుదరదు. పనిచేస్తే జీతాలు ఇచ్చేలా ఆదేశాలు జారీచేస్తాం. నెల్లూరు నగరంలో ఈ నెల 26 నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యాన్ అమలుచేస్తాం. సీఎం జగన్ ఆదేశాలు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు తొలగిస్తాం. హోర్డింగ్స్ కు కూడా క్లాత్ వి వేసుకుంటే మంచింది. దీనిపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఫ్లెక్సీ షాపులకు కూడా ముందుగానే సమాచారం ఇచ్చాం. 26 తర్వాత ఫ్లెక్సీలు తొలగిస్తే అనిల్ కుమార్ మా కక్షసాధిస్తున్నాడనే లొల్లి వద్దు. అందరూ సహకరించాలని కోరుతున్నాను. నెల్లూరు సిటీ శుభ్రతపై దృష్టిసారిస్తున్నాం. శానిటరీ వర్కర్స్ ను పెంచుతాం. కచ్చితంగా నెల రోజులోపు కాలువ పూడిక తీసివేతపై ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తాం." - మాజీ మంత్రి అనిల్ కుమార్