Atmakur Byelection 2022 : నెల్లూరు జిల్లా మొత్తం ఎన్నికల కోడ్, ఆత్మకూరు ఉపఎన్నిక కోసం పగడ్బందీ ఏర్పాట్లు
Atmakur Byelection 2022 : నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నిక సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Atmakur Byelection 2022 : నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఉపఎన్నిక సందర్భంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సమీక్ష నిర్వహించారు. జిల్లా మొత్తం ఇప్పటికే ఎన్నికల కోడ్(Election Code) అమలులోకి వచ్చిందని చెప్పారు. జూన్ 28వ తేదీ వరకు ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటుందని తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను(VV PATs) సిద్ధం చేశామని వివరించారు. ఉపఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా జేసీ హరేంధిర ప్రసాద్ వ్యవహరిస్తారన్నారు. జిల్లాలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహిస్తామని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటిస్తూ అందుకు అవసరమైన కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.
- ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు
- ఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాలకు నోటిఫికేషన్(Election Notification) విడుదలైంది. ఇందులో ఏపీలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఒకటి. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఎలక్షన్ కమిషన్(Election Commission) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(Mekapati Goutam Reddy) అకాల మరణంతో ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఇప్పటికే అధికార వైఎస్సార్‌సీపీ(Ysrcp) ఇక్కడ గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి(Mekapati Vikram Reddy)ని అభ్యర్థిగా ప్రచార బరిలోకి దింపింది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా విక్రమ్ రెడ్డి జనంలోకి వెళ్తున్నారు.
- ఉప ఎన్నికల షెడ్యూల్
నామినేషన్ల ప్రారంభం మే 30, 2022
నామినేషన్ల చివరి తేదీ జూన్ 6, 2022
ఎన్నికల తేదీ 23 జూన్, 2022
కౌంటింగ్, ఫలితాల ప్రకటన 26 జూన్, 2022