Srinivasa Varma: కేంద్ర మంత్రిగా శ్రీనివాస వర్మ - కార్యకర్త నుంచి సెంట్రల్ కేబినెట్ స్థాయి వరకూ రాజకీయ ప్రస్ధానం ఇదే!
Andhra Pradesh News: ఏపీ బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర కేబినెట్‌లో అవకాశం దక్కింది. 1988లో బీజేపీలో కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు.
Narsapuram MP Srinivasa Varma As Central Minister: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురుకి చోటు దక్కింది. ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నర్సాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మను (Srinivasa Varma) కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోనున్నారు. ఈ మేరకు పీఎంవో నుంచి సమాచారం రాగా.. ఎంపీలంతా ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వీరు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా, శ్రీనివాస వర్మ బీజేపీలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తోన్న ఆయనకు కేంద్ర మంత్రి పదవి వరించడం పట్ల బీజేపీ శ్రేణులు, అభిమానులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2.76 లక్షల మెజార్టీతో శ్రీనివాస వర్మ విజయం సాధించారు.
రాజకీయ ప్రస్థానం ఇదే.!
- భూపతిరాజు శ్రీనివాస వర్మ 1967, ఆగస్ట్ 4న.. భూపతిరాజు సూర్యనారాయణ రాజు, సీత దంపతులకు జన్మించారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పూర్తి చేశారు.
- 1980లో విద్యార్థి నాయకుడిగా ఏఐఎస్ఎఎఫ్ తరఫున పని చేశారు. 1988లో బీజేపీ కార్యకర్తగా తన రాజకీయ జీవితం ప్రారంభించారు.
- 1991 - 97 బీజేపీ భీమవరం పట్టణ, ప.గో జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. 2008 - 14 వరకూ రెండుసార్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సేవలందించారు. 2014లో భీమవరం పురపాలక వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఇంఛార్జీ ఛైర్మన్‌గానూ పని చేశారు. 2020 - 23 వరకూ రాష్ట్ర కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.
- 2024లో నర్సాపురం నుంచి ఎంపీగా ఘన విజయం సాధించిన క్రమంలో ఆయన్ను కేంద్ర మంత్రిగా ఎంపిక చేశారు. దీంతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.