Visakha CII Summit: విశాఖ సీఐఐ సదస్సులో 613 ఎంఓయూలు, రూ. 13,25,716 కోట్ల పెట్టుబడులు.. 16 లక్షల ఉద్యోగాలు
CII Partnership Summit in Visakhapatnam | విశాఖపట్నం వేదికగా 3 రోజుల్లో జరిగిన సీఐఐ సదస్సులో 613 ఎంఓయూలు కుదుర్చుకోగా రూ. 13,25,716 కోట్ల పెట్టుబడులతో 16,13,188 ఉద్యోగాలు రానున్నాయి.

Vizag CII Partnership Summit | విశాఖపట్నం వేదికగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో అంచనాలకు మించిన స్థాయిలో పెట్టుబడుల ఒప్పందాలు (ఎంఓయూలు) కుదిరాయి. ఈ సదస్సులో ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో ఎంఓయూలు కుదరగా, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అదే స్థాయిలో ఉపాధి కల్పనపై కూడా కంపెనీల నుంచి హామీలు లభించాయి. కేవలం రెండు రోజుల పాటు సదస్సును నిర్వహించి, ఎంఓయూలు కుదుర్చుకోవాలని ప్రభుత్వం భావించినప్పటికీ, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంతో, ప్రభుత్వం 3 రోజుల పాటు ఎంఓయూలను కుదుర్చుకుంది. ఈ కుదుర్చుకున్న ఒప్పందాల విలువ రూ. 13,25,716 కోట్లు కాగా, వీటి ద్వారా 16,31,188 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది.
అంచనాలకు మించిన పెట్టుబడుల రాక
2 రోజుల్లో సుమారుగా రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని భావించగా, పారిశ్రామికవేత్తలు భారీగా తరలిరావడంతో ఒప్పందాల విలువ రూ. 13 లక్షల కోట్లకు పైగా చేరింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి చంద్రబాబు నేతృత్వంలోని సర్కార్ పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి సారించింది. ప్రతి 15 రోజులకోసారి కేబినెట్ సమావేశాలు నిర్వహించిన తరహాలోనే ఎస్‌ఐపీబీ సమావేశాలు నిర్వహించి, వివిధ సంస్థలకు పెద్ద ఎత్తున అనుమతులు ఇచ్చింది. విశాఖ భాగస్వామ్య సదస్సు నాటికే సుమారుగా రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను తీసుకువచ్చేలా చూడాలని ప్రభుత్వం విశాఖ తీరాన భాగస్వామ్య సదస్సును నిర్వహించాలని ప్లాన్ చేసింది. దీనికి అనుగుణంగా చంద్రబాబు సింగపూర్, యూఏఈ, లండన్ వంటి దేశాల్లో పర్యటించి, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. 3 రోజుల పాటు కుదుర్చుకున్న ఒప్పందాల విలువ రూ. 13 లక్షల కోట్లకు పైగా చేరడంతో, అంచనాలను 100 శాతం చేరుకోవడంతో పాటు, అదనంగా మరో 30 శాతం మేర పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేందుకు మార్గం సుగమం అయింది.

సీఎం చంద్రబాబు సమక్షంలో సగానికి పైగా ఒప్పందాలు
మొత్తం రూ. 13,25,716 కోట్ల ఒప్పందాలు జరగగా, అందులో సగానికి పైగా ఒప్పందాలు సీఎం చంద్రబాబు సమక్షంలోనే కుదిరాయి. మూడు రోజుల పాటు చంద్రబాబు సమక్షంలో 123 ఎంఓయూల ద్వారా రూ. 7,63,210 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. తొలి రోజున రూ. 3,65,304 కోట్ల పెట్టుబడులకు, రెండో రోజున రూ. 3,49,476 కోట్ల పెట్టుబడులకు, ఇక చివరి రోజున రూ. 48,430 కోట్ల మేర ఎంఓయూలు కుదిరాయి. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖలకు చెందిన మంత్రులు కూడా భారీ ఎత్తున పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మొత్తంగా, మంత్రులందరూ కలిసి 490 ఎంఓయూల ద్వారా రూ. 5,62,506 కోట్ల మేర పెట్టుబడులు కుదుర్చుకున్నారు.

12 రంగాల్లో రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు
మూడు రోజుల పాటు జరిగిన వరుస సమావేశాలు, భేటీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు కలిసి చేసుకున్న ఒప్పందాల ద్వారా మొత్తం 12 రంగాలకు పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడుల్లో ఇంధన రంగం, పరిశ్రమలు, మౌళిక వసతుల రంగాలు టాప్-3 స్థానాల్లో నిలిచాయి. మొత్తంగా వచ్చిన రూ. 13.25 లక్షల కోట్ల పెట్టుబడుల్లో అధిక భాగం ఇంధన రంగానికే వచ్చాయి. ఈ రంగంలో రూ. 5,33,351 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత పరిశ్రమల రంగానికి రూ. 2,80,384 కోట్లు, మౌళిక వసతుల రంగానికి రూ. 2,01,758 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇక ఉద్యోగాల కల్పనకు సంబంధించి పరిశ్రమలు, మౌళిక వసతులు, ఐటీఈ అండ్ సీ రంగాలు టాప్-3లో ఉన్నాయి.
రంగాల వారీగా 3 రోజుల పెట్టుబడులు వివరాలిలా ఉన్నాయి
- విద్యుత్ రంగం - రూ. 5,33,351 కోట్ల పెట్టుబడులు – 2,66,722 మందికి ఉద్యోగాలు
- పరిశ్రమలు – రూ. 2,80,384 కోట్ల పెట్టుబడులు – 5,19,083 మందికి ఉద్యోగాలు
- మౌళిక వసతులు – రూ. 2,01,758 కోట్ల పెట్టుబడులు – 3,06,649 మందికి ఉద్యోగాలు
- ఐటీఈ అండ్ సీ – రూ. 1,59,467 కోట్ల పెట్టుబడులు - 2,96,315 మందికి ఉద్యోగాలు
- ఏపీ సీఆర్డీఏ – రూ. 48,711 కోట్ల పెట్టుబడులు – 41,625 మందికి ఉద్యోగాలు
- టూరిజం – రూ. 21,036 కోట్ల పెట్టుబడులు – 1,05,804 మందికి ఉద్యోగాలు
- ఫుడ్ ప్రాసెసింగ్ – రూ. 13,008 కోట్ల పెట్టుబడులు - 47,390 మందికి ఉద్యోగాలు
- పట్టణాభివృద్ధి – రూ. 4,944 కోట్ల పెట్టుబడులు - 12,150 మందికి ఉద్యోగాలు
- టెక్స్ టైల్స్ – రూ. 4,490 కోట్ల పెట్టుబడులు - 8,450 మందికి ఉద్యోగాలు
- వైద్యారోగం – 4,208 కోట్ల పెట్టుబడులు – 24000 మందికి ఉద్యోగాలు
- విద్యా రంగం – రూ. 4,359 కోట్ల పెట్టుబడులు - 3,000 మందికి ఉద్యోగాలు
- ఇతర శాఖలు – రూ. 50,000 కోట్ల పెట్టుబడులు






















