Nara lokesh letter to CM Jagan: ఆ విషయం మీరు మరిచినా నేను మరిచిపోలేదు- సీఎం జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ
Nara Lokesh News: ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ అగ్రిగోల్డ్ విషయంలో టీడీపీ ప్రభుత్వంపై, తనపై చేసిన ఆరోపణలు, చిమ్మిన విషాన్ని ఇంకా తాము మరచిపోలేదన్నారు లోకేష్.
Nara Lokesh Open Letter To AP CM YS Jagan: అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నారా లోకేష్. ఈమేరకు ఆయన సీఎం జగన్ కు ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను తన ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో వైసీపీ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని మండిపడ్డారు లోకేష్. వారి అలసత్వానికి బాధితులు బలైపోతున్నారని విమర్శించారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా.. అగ్రిగోల్డ్ తరపున అప్పటి ప్రతిపక్షనేత హోదాలో జగన్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. అప్పుడు తమపై విమర్శలు చేసి, అధికారంలోకి వచ్చాక ఆ సమస్యను పూర్తిగా పక్కదారి పట్టించారన్నారు.
తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు సొమ్ములు చెల్లించి న్యాయం చెయ్యాలి అని సిఎం @ysjagan గారికి లేఖ రాశాను. అగ్రిగోల్డ్ ఆస్తులపై మీరు, మీ అనుచర గణం కన్నేసి దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అని అగ్రిగోల్డ్ బాధితులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికీ ఇంకా మిగిలిన 10 లక్షలకు… pic.twitter.com/BY0Fg88Du9
— Lokesh Nara (@naralokesh) December 30, 2023
ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ అగ్రిగోల్డ్ విషయంలో టీడీపీ ప్రభుత్వంపై, తనపై చేసిన ఆరోపణలు, చిమ్మిన విషాన్ని ఇంకా తాము మరచిపోలేదన్నారు లోకేష్. ఆ విషయాలన్నీ జగన్ మరచిపోయి ఉంటారేమోనని ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పుట్టిందని, ఆయన హయాంలోనే అగ్రిగోల్డ్ స్కామ్ జరిగిందనే విషయాన్ని గుర్తు చేశారు లోకేష్. అప్పుడు జరిగిన తప్పుని టీడీపీ సరిదిద్దే ప్రయత్నం చేసిందన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ ఆస్తులుగా ఉన్న 21 వేల ఎకరాలు అటాచ్ చేసి, యాజమాన్యాన్ని అరెస్టు చేయించి, బాధితులకు న్యాయం చేసిందని చెప్పారు లోకేష్. అయినా కూడా అప్పటి ప్రతిపక్ష వైసీపీ తమపై తప్పుడు ఆరోపణలు చేసిందన్నారు. "ప్రతిపక్షనేతగా హామీలిచ్చి గద్దెనెక్కాక మీరు చేసిన మోసంతో రోడ్డునపడిన అగ్రిగోల్డ్ బాధితులు యువగళం పాదయాత్రలో నన్ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో అగ్రిగోల్డ్ బాధితులకు ఇస్తామన్న సొమ్ములేవి? మా టీడీపీ ప్రభుత్వం డిపాజిటర్లకి ఇవ్వడానికి సిద్ధం చేసిన రూ.250 కోట్లు పంపిణీ చేయకుండా అడ్డుకుని, తీరా అదే సొమ్ములో 14 కోట్లు తగ్గించి, 22 వారాల తరువాత 236 కోట్లే పంపిణీ చేసి చేతులు దులుపుకున్న మీ తీరుతో బాధితులు మరింత బాధపడ్డారు." అంటూ తన లేఖలో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు లోకేష్.
ఏ ఒక్కరి కుటుంబానికైనా పరిహారం ఇచ్చారా
వైసీపీ వచ్చాక 600 మంది అగ్రిగోల్డ్ బాధితులు చనిపోయారని, వారిలో ఏ ఒక్కరి కుటుంబానికైనా పరిహారం ఇచ్చారా అని ప్రశ్నించారు లోకేష్. రూ.10 లక్షల పరిహారం ఇస్తామని మాటిచ్చి తప్పారని జగన్ పై మండిపడ్డారు. కనీసం పరామర్శలకు కూడా వెళ్లలేదన్నారు. ఇదేనా మీ మానవత్వం? అని నిలదీశారు. 2014-19 మధ్యలో బలవన్మరణాలకు పాల్పడిన 142 మంది అగ్రిగోల్డ్ బాధితుల తమ ప్రభుత్వం కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఎక్స్ గ్రేషియా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు లోకేష్. అయితే అప్పట్లో అగ్రిగోల్డ్ తో టీడీపీ లాలూచీ పడిందని, అగ్రిగోల్డ్ భూముల్ని లోకేష్ కొట్టేశారని వైసీపీ ఆరోపణలు చేసిందని అన్నారు. అవన్నీ అవాస్తవాలని చెప్పారు.
ఒక్క సెంటు ఆస్తి అయినా అటాచ్ చేయలేదు
జగన్ సీఎం అయి ఐదేళ్లవుతున్నా అగ్రిగోల్డ్ కి చెందిన ఒక్క సెంటు ఆస్తి అయినా ఎందుకు అటాచ్ చేయలేదని ప్రశ్నించారు నారా లోకేష్. అగ్రిగోల్డ్ ఆస్తులపై జగన్, ఆయన అనుచర గణం కన్నేసి దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇప్పటికైనా 10 లక్షలకు పైగా ఉన్న డిపాజిటర్లకు వారికి రావాల్సిన రూ.3080కోట్లను చెల్లించి న్యాయం చేయాలని కోరుతున్నానని లేఖలో ప్రస్తావించారు నారా లోకేష్.