Nara Lokesh: 'మనం చేద్దాం జగనాసుర దహనం' - మరో వినూత్న నిరసనకు టీడీపీ పిలుపు
Nara Lokesh: స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మరో వినూత్న కార్యక్రమానికి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. 'జగనాసుర దహనం చేద్దాం' అంటూ ట్విట్టర్ వేదికగా ప్రజలకు సూచించారు.
స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మరో వినూత్న నిరసనకు టీడీపీ పిలుపునిచ్చింది. విజయదశమి పండుగను చెడుపై మంచి విజయంగా జరుపుకొంటారని, సైకో జగన్ అనే చెడుపై చంద్రబాబు అనే మంచి సాధించబోయే విజయంగా జరుపుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. 'దేశం చేస్తోంది రావణాసుర దహనం - మనం చేద్దా జగనాసుర దహనం' అంటూ సోమవారం (అక్టోబర్ 23) రాత్రి 7 గంటల నుంచి 7:05 నిమిషాల మధ్య మరో నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో 'సైకో పోవాలి' అని రాసి ఉన్న పత్రాలను వీధుల్లో దహనం చేయాలని అన్నారు. నాలుగన్నరేళ్లుగా అరాచక పాలన సాగిస్తోన్న సైకో జగనాసురుడి పీడ పోవాలని నినదిద్దామని ట్వీట్ చేశారు. ఈ మేరకు నిరసన తెలిపిన వీడియోలు, ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని కోరారు.
దేశం చేస్తోంది రావణాసుర దహనం-మనం చేద్దాం జగనాసుర దహనం. అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని నినదిద్దాం. అక్టోబర్ 23 విజయదశమి పర్వదినం సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల మధ్యలో వీధుల్లోకి వచ్చి ``సైకో పోవాలి`` అని రాసి… pic.twitter.com/eP21amu15z
— Lokesh Nara (@naralokesh) October 22, 2023
అంతకు ముందు అక్టోబర్ 15న 'ఇంకెన్నాళ్లీ సంకెళ్లు' పేరిట చేతులకు తాడు కట్టుకుని నిరసన తెలపాలని పిలుపునివ్వగా టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
'నిజం గెలవాలి' పేరిట భువనేశ్వరి యాత్ర
మరోవైపు, చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో చనిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను ఈ నెల 25 నుంచి నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. 'నిజం గెలవాలి' పేరిట యాత్ర ద్వారా వారానికి 3 రోజుల ఇంటింటికీ వెళ్లి పరామర్శిస్తారు. 24న ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని, అదే రోజు నారావారిపల్లెకు వెళ్తారు. 25న చంద్రగిరిలో యాత్ర ప్రారంభిస్తారు. ఈ యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు కల్పించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. ఈ మేరకు అన్ని పోలీస్ స్టేషన్లకూ ఆదేశాలివ్వాలని కోరారు.
నవంబర్ 1 నుంచి 'భవిష్యత్తుకు గ్యారెంటీ'
చంద్రబాబు అరెస్టు తర్వాత నిలిచిన 'బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమానికి నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకూ లోకేశ్ చేపట్టనున్నారు. చంద్రబాబు బయటకు వచ్చే వరకూ లోకేశ్ దీన్ని నిర్వహిస్తారు. అనంతరం అధినేత కొనసాగిస్తారు. ఈ 45 రోజులు టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలు, పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వ అరాచకాల్ని ప్రజలకు వివరిస్తారు. అదే సమయంలో, లోకేశ్ వారంలో మూడు రోజులు రోజుకో అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కేవలం 5 నెలలు గడువు మాత్రమే ఉందని, టీడీపీ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి, చైతన్యం తీసుకు రావాలని, నిరంతరం ప్రజల్లోనే ఉండాలని లోకేశ్ టీడీపీ శ్రేణులు, నేతలకు సూచించారు.
Also Read: చంద్రబాబు విడుదల కావాలని కోరుకుంటూ హీరోయిన్ పూజలు