Nara Bhuvaneswari : అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది - రైతులకు భువనేశ్వరి భరోసా !
అమరావతి నిర్మాణం జరిగి తీరుతుందని నారా భువనేశ్వరి రైతులకు భరోసా ఇచ్చారు. రాజమండ్రి క్యాంప్ సైట్‌లో భువనేశ్వరిని అమరావతి రైతులు కలిశారు.
Nara Bhuvaneswari : రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేయడం కోసం అమరావతి రైతులు చేసిన త్యాగాలు వృథా కావని... అమరావతి నిర్మాణం జరిగి తీరుతుందని నారా భువనేశ్వరి అన్నారు. రాజధాని కోసం రైతులు చేసిన త్యాగం గురించి చంద్రబాబు ఎప్పుడూ చెపుతుండేవారిని...ఎప్పటికైనా మీకు న్యాయం జరుగుతుందని భువనేశ్వరి రైతులతో అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాజధాని ప్రాంత మహిళలు, రైతులు పెద్దఎత్తున తరలివచ్చి భువనేశ్వరికి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై అక్రమ కేసుపెట్టి జైల్లో పెట్టిందని వారు అన్నారు. ధైర్యంగా ఉండాలని, చంద్రబాబు త్వరలో బయటకు వస్తారని రైతులు భువనేశ్వరికి ధైర్యం చెప్పారు.
రాజధాని అమరావతి రైతులు రాజమహేంద్రవరం వెళ్లి నారా భువనేశ్వరి గారిని కలిసి ఆమెకు తమ సంఘీభావాన్ని తెలిపారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ఖండించారు#CBNLifeUnderThreat#TDPJSPTogether#APvsJagan#IAmWithBabu#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu… pic.twitter.com/nLdSCkjRxP
— Telugu Desam Party (@JaiTDP) October 3, 2023
అమరావతి నిర్మాణం, భూములు ఇచ్చిన రైతుల నేటి పరిస్థితి, ప్రభుత్వ కుట్ర పూరిత చర్యలపై రైతులు మాట్లాడారు. మూడు రాజధానులు అంటూ ప్రభుత్వం రాజధాని లేకుండా చేసిందని అన్నారు. రాజధాని కోసం తాము చేస్తున్న పోరాటంలో ప్రభుత్వం ఎన్ని కేసులు, ఇబ్బందులు పెట్టిందో వివరించారు. తనకు అన్నీ తెలుసని.....రైతులు ధైర్యంగా నిలబడాలని....మళ్లీ మంచి రోజులు వస్తాయని భువనేశ్వరి అన్నారు. రాజధాని విధ్వంసం కంటే .చంద్రబాబును జైల్లో పెట్టిన ఘటనే తమకు ఎక్కువ బాధ కలిగించిందని రైతులు చెప్పారు. ఈ సందర్భంగా కొందరు ఉద్వేగానికిలోనై కంటతడి పెట్టగా భువనేశ్వరి వారిని ఊరడించారు.
అమరావతి నుంచి ఉదయం బయలు దేరి రాజమహేంద్రవరం వస్తున్న తమను పోలీసులు వీరవల్లి టోల్ గేట్ వద్ద అడ్డుకుని ఇబ్బందులకు గురి చేశారని మహిళలు, రైతులు భువనేశ్వరికి తెలిపారు.
సుమారు గంటసేపు రోడ్డుపై బైఠాయించి ఆందోళనా చేసినా కనికరించలేదని మహిళలు అన్నారు. అన్నవరం సత్యనారాయణస్వామి దేవాలయానికి వెళ్తున్నామని చెప్పిన తర్వాతే తమను అనుమతించారని పేర్కొన్నారు. తాము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకునేందుకు పోలీసులు తమను అనుసరించారన్నారు. అమరావతి ఉద్యమం నాటి నుంచి ప్రభుత్వం తమను వేధిస్తూనే ఉందని అన్నారు. చంద్రబాబుపై నమ్మకంతోనే తమ భూములు రాజధానికి ఇచ్చామని రైతులు గుర్తు చేశారు. 3 రాజధానుల నిర్ణయంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరమవడంతో పాటు, రాష్ట్ర ప్రజలు కూడా రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారన్నారు. 3 రాజధానులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తమను ఈ ప్రభుత్వం పెట్టని ఇబ్బందంటూ లేదని మహిళా రైతులు భువనేశ్వరి వద్ద వాపోయారు. రాజధాని ఉద్యమానికి సహకరించి, రెండు బంగారు గాజులు విరాళంగా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా రైతులు భువనేశ్వరికి గుర్తు చేశారు. మందడంలో రామకోటి స్థూపాన్ని నిర్మిస్తున్నామన్న రైతులు..రామకోటి రాసే పుస్తకాన్ని భువనేశ్వరికి అందించారు.
‘‘రాజధాని రైతుల గొప్పదనం గురించి చంద్రబాబు నాతో ఎప్పుడూ అంటుండేవారు. తనపై నమ్మకంతో రైతులు భూములిచ్చారని చంద్రబాబు గొప్పగా చెప్పుకునేవారు. మీ త్యాగాలు వృథాకావు. మహిళల పట్ల అమానవీయంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. మహిళలు, రైతులను ఇబ్బంది పెట్టినా ధైర్యంగా బయటకు వచ్చి పోరాడుతున్నారు. రాజమహేంద్రవరంనకు వస్తుంటే మిమ్మల్ని పోలీసులు చాలా ఇబ్బందులు పెట్టారని తెలిసి బాధేసింది. ఎన్నికల్లో తెలివిగా వ్యవహరించి, ప్రతి ఒక్కరితో ఓటు వేయించాలని కోరుతున్నా. మీరంతా అండగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. మీ రాక మాకు బలాన్ని చేకూర్చుతోంది. వారు అడ్డదారిలో రావడానికి సిద్ధంగా ఉన్నారు...ఎలా వచ్చినా మనం ఎదుర్కోవాలి. ఈ ప్రభుత్వానికి మహిళల శక్తి తెలియడం లేదు. చంద్రబాబు జైల్లో ఉన్నా మానసికంగా ధృడంగా ఉన్నారు..మీరు కూడా ధైర్యంగా ఉండండి. చంద్రబాబు మచ్చలేకుండా బయటకు వస్తారు. గెలిచేందుకు ప్రత్యర్థులు ఎన్నో ఎత్తులు వేస్తారు...వాటిని మనం ఎదుర్కోవాలి’’ అని భువనేశ్వరి ధైర్యం చెప్పారు. రైతులతో కలిసి భువనేశ్వరి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.