Srisailam Project : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద, 3 గేట్లు ఎత్తి నీరు విడుదల
Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
Srisailam Project : శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం ఇన్ ఫ్లో 81,553 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 57,751 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.50 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.80 టీఎంసీలు, ప్రస్తుతం 202.04 టీఎంసీలకు వరద నీరు చేరింది. దీంతో ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడదలు చేస్తున్నారు. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
శ్రీశైలం మూడు గేట్లు ఎత్తివేత
శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లను శనివారం అధికారులు తెరిచారు. అంతకుముందు ప్రాజెక్టు వద్ద మంత్రి అంబటి రాంబాబు ప్రత్యేక పూజలు చేశారు. ప్రాజెక్టులోని 6, 7, 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు నుంచి సుమారు 80 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1.12 వేల క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. జూరాల నుంచి 81 వేల క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 31 వేల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Your weekend getaway trip from #Hyderabad is sorted. 3 gates of the #Srisailam dam opened today. A rare occurrence in July. Next up, waiting for Nagarjuna Sagar gates to be opened. pic.twitter.com/geUYs7kBTa
— Krishnamurthy (@krishna0302) July 23, 2022
నిండుకుండలా నిజాంసాగర్
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు కు భారీగా వరద నీరు చేరుతోంది. ఇన్ ఫ్లో 36400 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1403.25 అడుగులకు చేరింది. నిజాంసాగర్ పూర్తి స్థాయి కెపాసిటీ 17.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కెపాసిటీ 15.323 టీఎంసీలకు చేరింది. నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా చేరుతున్న కారణంగా ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువన మంజీర నదిలో నీరు విడుదల చేసే అవకాశం ఉంది. మంజీర నది పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు, గేదెలు కాపరులు నది వైపు వెళ్లద్దాని నీటి పారుదల శాఖ అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు.
లోయర్ మానేరు డ్యామ్ క్రస్ట్ గేట్లు ఎత్తివేత
కరీంనగర్ పట్టణానికి సమీపంలో గల లోయర్ మానేరు డ్యామ్ 4 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. డ్యామ్ 9, 10, 11, 12 గేట్ల ద్వారా దాదాపు 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 30 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు కెపాసిటీ 24 టీఎంసీలుగా ఉంది. లోయర్ మానేరు డ్యామ్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతున్న కారణంగా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గొర్ల ,బర్ల కాపరులు, చేపల వేటకు పోయే వారు నదిలోకి వెళ్లవద్దని లోయర్ మానేర్ డ్యాం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగభూషణరావు హెచ్చరించారు.