Kannababu Commets: చంద్రబాబు ఓ గజినీ, నిన్న జరిగింది ఈ రోజు గుర్తుండదు- కన్నబాబు
Kannababu Commets: టీడీపీ అధినేత చంద్రబాబు గజినీ అని, ఆయనకు నిన్న జరిగింది ఈరోజుకు గుర్తుండదంటూ మాజీ మంత్రి కన్నబాబు విమర్శలు చేశారు.
Kannababu Commets: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన గజినీలాగా ప్రవర్తిస్తారని, నిన్న ఏం జరిగిందో కూడా ఆయనకు గుర్తుండదు అంటూ కామెంట్లు చేశారు. జీవో నెంబర్ 1 గురించి మాట్లాడే ఆయన.. ముద్రగడ పద్మనాభాన్ని ఏ చట్టం ప్రకారం నిర్బంధించారని ప్రశ్నించారు. పరామర్శించడానికి వెళ్తున్న చిరంజీవిని రాజమండ్రిలో ఎందుకు అడ్డుకున్నారని అన్నారు. ఏ జీవో ప్రకారం లక్షల మంది మీద కేసులు పెట్టారని, అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. ఈరోజు ఈ జీవో తీసుకు రావడానికి కారణం చంద్రబాబు అని తెలిపారు. కందుకూరులో ఆరోజు ఎనిమిది మంది చనిపోతే.. ఏమాత్రం బాధ లేకుండా ఐదు నిమిషాల్లో మళ్లీ వస్తానని చెప్పాడని గుర్తు చేశారు. సభలకు జనాలు ఎవరూ రావట్లేదని... చీరలిస్తాం, సారలిస్తామని చెప్పి మూడ్రోజుల్లోనే గుంటూరులో మరో సభ పెట్టారని తెలిపారు. అందులో తొక్కిసలాట జరిగి జనం చనిపోతే.. తమకేం సంబంధం లేదని, ఉయ్యూరు సంస్థ వాళ్లు పిలిస్తే వెళ్లానని చెప్పడం దారుణన్నారు. చంద్రబాబు తన ప్రచారం కోసం మనుషులు ప్రాణాలు తీస్తున్నాడని ఆరోపించారు.
చంద్రబాబు అంటించిన రక్తపు మరకలను తూడ్చడానికే జీవో నెంబర్ 1ని తీసుకువచ్చినట్లు మాజీమంత్రి కన్నబాబు వెల్లడించారు. శనివారం కాకినాడలోని పార్టీ కార్యక్రామంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకుని జీవోను అమలు చేసినట్లు పునరుద్ఘాటించారు. ప్రజల ప్రాణాలు తీసిందే కాకుండా వారికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి అనవసరం రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోక పోతే ప్రజలు ప్రాణాలు పోతే బాధ్యులెవరని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ ఏకైక కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. జీవో-1 ద్వారా చంద్రబాబు నాయుడునో లేక ఇంకా ఎవరినో అడ్డుకోవాడానికో అన్నట్లు టీడీపీ చిత్రీకరిస్తుందని మండిపడ్డారు. జీవోలో ఏముందో ఓసారి చదివి అర్థం చేసుకోవాలని సూచించారు. నిర్ణీత ప్రదేశాలతో పాటు అనుమతితో ఎక్కడైనా సభలు ర్యాలీలు నిర్వహించు కోవచ్చనే విషయం జీవోలో స్పష్టంగా ఉందని తెలిపారు. రోడ్ షోలు, సభలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు అని వివరించారు. ప్రచార కక్కుర్తి కోసమే చంద్రబాబు ఈ డ్రామాకు తెరలేపారని విమర్శించారు. పెద్ద ఎత్తున జనాల్నీ పోగు చేసి వారి ప్రాణాలను బలిగొంది చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి రాజకీయం చేస్తున్నారని అన్నారు.
జీవో-1పై ఎల్లో మీడియా ప్రచారానికి హద్దులేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016లో తుని సంఘటన అనంతరం తూర్పుగోదావరి జిల్లాలో మూడు సంవత్సరాలు విధించిన చట్టం 1861 పోలీస్ యాక్ట్ ప్రకారమే అమలు చేశామని గుర్తుచేశారు. అప్పుడు మీరు చేస్తే తప్పులేదు కానీ ఇప్పటి ప్రభుత్వం అదే యాక్ట్ ని అమలు చేస్తే తప్పేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ముద్రగడ దీక్ష చేస్తుంటే ఏ చట్టంతో నిర్బంధించారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఉద్యమ కోసం సీఎం జగన్ విశాఖ ఎయిర్ పోర్టుకు వస్తే ఏ చట్టంతో నిర్బంధించారని అన్నారు. మంత్రి రోజాను విజయవాడ అరెస్ట్ చేసి జీపులో కుక్కినప్పడు ఏ జోవో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు టీడీపీ భజన పార్టీలు నోరు మెదపలేదని అన్నారు. సిగ్గు మాలిన రాతలతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కందుకూరు, గుంటూరు ఘటనల్లో చనిపోయిన ఒక్కొక్క ప్రాణానికి ఆయన కట్టిన విలువ 25 లక్షలని మండిపడ్డారు. సభలకు ప్రాతినిధ్యం వహించిన వారిపై కేసు నమోదు చేస్తుంటే మొసలి కన్నీరు కారుస్తున్నాడని అన్నారు.
మద్దతుదారుల వ్యాపారం వారి బాగోగులు తప్ప చంద్రబాబుకు ఏమి పట్టిలేదని చెప్పారు.. కరోనా వస్తే రెండు సంవత్సరాలు ఆంధ్రలోనే లేరని.. నేడు కుప్పంలో రోజు తిరుగుతూ అవాకులు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆడుతున్నవన్నీ కట్టు కథలని అన్నారు. చంద్రబాబుది పబ్లిసిటీ పిచ్చి అని చెప్పారు. చంద్రబాబు నాయుడు అంటేనే అబద్ధాల ఫ్యాక్టరీ అని అన్నారు. హైవేలకు రూపకల్పన చేశానని.. కరోనా వాక్సిన్ సృష్టించానని చెప్పుకోవడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని ఎద్దేవా చేశారు.