Nara Lokesh: 'ఇతర రాష్ట్రాలతో కాదు దేశాలతోనే మాకు పోటీ' - ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం, మంత్రి లోకేశ్ ఢిల్లీ టూర్‌లో కీలక భేటీ
Andhra News: రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన, నైపుణ్య శిక్షణే లక్ష్యంగా మంత్రి లోకేశ్ ఢిల్లీ పర్యటన సాగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులకు ఆయన స్కిల్ సెన్సెస్‌పై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు.
Minister Nara Lokesh Delhi Tour: రాష్ట్రంలో ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పునరుద్ఘాటించారు. ఉద్యోగాల కల్పన, నైపుణ్య శిక్షణే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. కేంద్ర మంత్రి, సెంట్రల్ స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో భేటీ అయ్యారు. స్కిల్ సెన్సెస్‌పై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర పెద్దలు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కేవలం ఇతర రాష్ట్రాలతో మాత్రమే కాకుండా, ఇతర దేశాలతో కూడా తాము పోటీ పడుతున్నట్లు పేర్కొన్నారు.
అనంతరం ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) ప్రతినిధులతో మంత్రి లోకేష్ సోమవారం న్యూడిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మహీంద్ర అధ్యక్షత వహించారు. ఏపీని ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చడానికి చేపడుతున్న చర్యలు, రాష్ట్రంలో నెలకొన్నఅనుకూలతలపై పరిశ్రమదారులకు లోకేష్ వివరించారు. దేశంలో పేరెన్నికగన్న పరిశ్రమదారులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని, తరచూ వారితో సమావేశమై పరిశ్రమదారులకు ఎదురయ్యే విధానపరమైన సమస్యలు, సవాళ్లను అధిగమించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సాధించడంలో ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ పరిశ్రమదారుల కోసం టైలర్ మేడ్ పాలసీలను రూపొందిస్తామని అన్నారు.
Today, I met with the Hon’ble MoS for Skill Development & Entrepreneurship, Shri @jayantrld Ji, Special Secretary Atul Tiwari Ji, and @NSDCIndia CEO Ved Mani Tiwari Ji at Kaushal Bhavan, New Delhi. I made a special presentation on the Skill Census in Andhra Pradesh, highlighting… pic.twitter.com/3u7S9vHppq
— Lokesh Nara (@naralokesh) October 21, 2024
'ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాల అమలు'
ఏపీలో ఇప్పుడు దేశంలోనే అత్యంత సులభతరమైన ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీలను అమలు చేస్తోందని లోకేశ్ తెలిపారు. అన్ని రకాల పరిశ్రమలకు అనువైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. 'పరిశ్రమలకు వేగవంతమైన అనుమతుల కోసం ఈడీబీని పునరుద్దరించాం, సరైన ప్రాతిపాదనలతో వచ్చే వారికి తగిన ప్రోత్సాహకాలను అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏపీని ఇన్నోవేషన్, టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పవర్ హౌస్‌గా మార్చడంపై దృష్టి సారించాం. ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఐటీ పవర్ హౌస్‌గా, అంతర్జాతీయ ఏఐ రాజధానిగా తీర్చిదిద్దడానికి కృతనిశ్చయంతో ఉన్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ యూనివర్సిటీ, డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం.' అని పేర్కొన్నారు.
'ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తిరుపతి'
తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చడానికి పరిశ్రమదారులు సహకారాన్ని కోరుతున్నామని లోకేశ్ అన్నారు. 'ఇప్పటికే ప్రపంచంలో పేరెన్నికగన్న డిక్సన్, డైకిన్, టీసీఎల్ కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేశాయి. అనంతపురంలో కియా మోటార్స్ ఇప్పటికే పని చేస్తోంది. అనంతపురం, కర్నూలు జిల్లాలను ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ, ఈవీ కీలక కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. అమెరికాలో వాషింగ్టన్ మాదిరిగా ఏపీ పరిపాలన కేంద్రం అమరావతిని తీర్చిదిద్దడంపై మా ప్రభుత్వం దృష్టి సారించింది.' అని వివరించారు.
భారత్‌లో మొబైల్ తయారీ రంగ అభివృద్ధికి గల అవకాశాలు, అందులో పీఎల్ఐ పాత్రపై గణాంకాలతో సహా పరిశ్రమదారులు మంత్రి లోకేశ్‌కు వివరించారు. దేశవ్యాప్తంగా ఏసీ తయారీ క్లస్టర్లను ఏర్పాటు చేయాల్సి ఉందని, వాటి అవసరం పెరుగుతోందని చెప్పారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో మహిళా శ్రామిక శక్తి పాత్ర, ప్రాథమిక సమస్యలను కూడా మంత్రికి తెలియజేశారు. అన్ని విధాలా అనువైన వాతావరణంతో వ్యూహాత్మక పెట్టుబడి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోందని.. రాష్ట్ర అభివృద్ధికి మీ వంతు, సహాయ, సహకారాలు అందించాలని మంత్రి లోకేశ్ వారికి విజ్ఞప్తి చేశారు.
Also Read: Free Gas Cylinder: దీపావళి నుంచి ఏపీలో కొత్త పథకం ప్రారంభం - మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్