(Source: ECI/ABP News/ABP Majha)
Minister Appalaraju : ఆకస్మిక తనిఖీ కోసం ఆస్పత్రికి వెళ్లిన మంత్రి అప్పల్రాజు - ఆ తర్వాత ఏమయిందంటే ?
మంత్రి అప్పలరాజు పలాస ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితుల్ని చూసి వెంటనే కలెక్టర్‌కు ఫోన్ చేశారు.
Minister Appalaraju : అది పలాస ఆస్పత్రి. ఎప్పట్లాగే రోగం వచ్చినట్లుగా ఉంది. వైద్యులు లేరు. రోగులు ఉన్నారు. కొంత మంది వైద్యులు వచ్చి సంతకాలు పెట్టి వెళ్లారు. డాక్టర్లు కాని సిబ్బంది వాళ్లు రోజూ చేసే పని చేస్తున్నారు. అదంతా రొటీన్ అక్కడ. కానీ ఒక్కటే మార్పు..అదేమిటంటే అసలు ప్రభుత్వ ఆస్పత్రి పనితీరు ఎలా ఉందో చూద్దామని పలాస ఎమ్మెల్యే ప్లస్ మంత్రి కూడా అయిన సీదిరి అప్పల్రాజు ఆస్పత్రికి రావడం. ఆయనొస్తారని తెలిస్తే అందరూ ఉండేవాళ్లు. కాస్త బ్లీచింగ్ చల్లి.. రోగులకు వైద్యం చేస్తున్నట్లుగా కనిపించేవాళ్లు. కానీ చెప్పకుండా రావడంతో అవేమీ సాధ్యం కాలేదు. అక్కడి పరిస్థితిని స్వయంగా వైద్యుడైన మంత్రి గారు అవాక్కయ్యారు.
పలాస ఆస్పత్రిలో బాగా సేవలు అందుతున్నాయని భావించిన మంత్రి
నిజానికి అప్పలరాజు చాలా ఊహించుకున్నారు. అది ఆయన మాటల్లోనే తేలిపోయింది. ప్రభుత్వం ఆస్పత్రి కోసం కోట్లు వెచ్చిస్తోంది. స్పెషాలిటీ వైద్యుల్ని నియమించింది. కావాల్సినన్ని నిధులు ఇస్తోందని ఆయన గట్టిగా నమ్మారు. అందుకే పలాస ఆస్పత్రి అపోలో రేంజ్‌లో ఉంటుందని ఊహించుకున్నారు. కానీ ఆయన ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. రియాలిటీ ఎక్కడో ఉంది. అందుకే అసహనానికి గురయ్యారు. అప్పటికప్పుడు ఆస్పత్రి అధికారి కూర్చుని లెక్క తీస్తే సూపర్ స్పెషాలిటీ వైద్యులెవరూ రాలేదని తేలింది. వెంటనే.. ఆస్పత్రి నుంచే కలెక్టర్‌కు ఫోన్ చేశారు. వెంటనే పలాస ఆస్పత్రిని సందర్శించాలనిత ఆస్పత్రి పనితీరులో మార్పు వచ్చేలా చూడాలన్నారు. ఇప్పటికైతే అందర్నీ సస్పెండ్ చేసేయాలని ఆదేశించారు.
ఆస్పత్రిలో పరిస్థితులు చూసి షాక్
అయితే పలాస ఎమ్మెల్యే అయిన సీదిరి అప్పలరాజుకు తెలియదేమో కానీ.. పలాస ఆస్పత్రి పనితీరు గురించి ఆ ఊరి ప్రజలందరికీ తెలుసని..అందరూ అలవాటుపడిపోయారని రోగులంటున్నారు. రోగులకి మెరుగైన సేవలను అందజేసే లక్ష్యంతో వైద్యులు, సిబ్బంది పనిచేయాలని పదేపదే ప్రభుత్వం చెబుతుంది. అయితే అవేవి కూడా పలాస ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల చెవికి ఎక్కడం లేదు. వచ్చామా వెళ్ళామా అన్న రీతిలో విధులు నిర్వహిస్తున్నారు. ఇష్టం ఉంటే ఆసుపత్రిలో అడుగు పెట్టడం లేకపోతే విధులకి డుమ్మాకొట్టడం వారికి అలవాటుగా మారిపోయింది.అడిగే వారెవ్వరు అన్న రీతిలో వారు నచ్చినట్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు అప్పల్రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు కాబట్టి ప్రత్యక్షంగా తెలిసిపోయింది.
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగం ప్రపంచస్థాయిలో మందని ఆ శాఖ మంత్రి విడదల రజనీ తరచూ చెబుతూంటారు. ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్లే పని లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వైద్యం చేసేలా పరిస్థితుల్ని మార్చామని చెబుతూంటారు. స్వయంగా వైద్యుడైన అప్పల్రాజు అది నిజమని సీరియస్‌గా తీసుకున్నారో లేక ...తమ ప్రభుత్వంలో ఆస్పత్రులు ఆటోమేటిక్‌గా అద్భుతంగా అయ్యాయని నమ్మారో కానీ మీడియాకు సమాచారం ఇచ్చి మరీ ఆకస్మిక తనిఖీ చేశారు. చివరికి వాస్తవం ఏమిటో కనిపెట్టారు. అయితే మంత్రి గారు ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని గొణుక్కునే వారు కూడా ఉన్నారు.