Pawan Kalyan : బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్, వాళ్లంతా కలిస్తే రాజ్యాధికారం వేరే వారికి దక్కదు- పవన్ కల్యాణ్
Pawan Kalyan : ఏపీలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కాపులు కలిస్తే రాజ్యాధికారం వేరే వారికి దక్కదని పవన్ కల్యాణ్ అన్నారు. తాను కాపులకు మాత్రమే నాయకుడ్ని కాదన్నారు.
Pawan Kalyan : మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. బీసీలు రాజ్యాధికారం అర్థించటం కాదు సాధించుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదన్నారు. ఇన్నేళ్లుగా బీసీల సమైక్యత ఎందుకు సాధ్యం కాలేదో అర్థం కావడంలేదన్నారు. గతంలో 93 ఉన్న బీసీ కులాలు ఇప్పుడు 140కి ఎందుకు పెరిగాయని పవన్ ప్రశ్నించారు.
బీసీ అంటే బ్యాక్ బోన్ క్లాస్
"బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాస్. భారతదేశానికి వెన్నుముక లాంటి వాళ్లు. అలాంటి బీసీలకు కొందరు మేము ఇది చేశాం. ఇన్ని పదవులు ఇచ్చేశాం అని చెప్పుకుంటున్నారు. ఇంత సంఖ్యా బలం ఉన్న కులాల్లో కూడా ఇతర కులాల వద్ద పదవుల కోసం ఎందుకు వేడుకుంటున్నారు. ఓ గ్రామానికి వెళ్లే ద్వారానికి ఫూలే ఫొటో ఉంది. మరో పక్కన రాజశేఖర్ రెడ్డి ఫొటో పెట్టారు. సావిత్రి ఫూలే ఫొటో ఎందుకు పెట్టలేదు అనిపించింది. నేను కాపులకు మాత్రమే నాయకుడు కాదు మిగతా కులాలకు కూడా నాయకుడు. సమాజంలో ఏ కులాలు వెనుకబాటులో ఉన్నాయో వాటిని భుజాన ఎత్తుకుంటాను. రామ్ మనోహర్ లోహియా... ఏపీ కుల రాజకీయాలపై తన పుస్తకంలో రాశారు. బీసీ కులాలు, ఎస్సీ, ఎస్టీ కులాలు, కాపులు కలిస్తే వేరే వారికి రాజ్యాధికారం దక్కదు. వీళ్లు కలిసి ఎందుకు రాజ్యాధికారం దక్కించుకోలేదో నాకు అర్థం కావడంలేదు. వీరంతా కలిస్తే వేరే వాళ్ల దగ్గర చేతులు కట్టుకునే పరిస్థితి ఉండదు. మనం అడిగితే ఇచ్చే వాళ్లు లేరు. ఐదేళ్ల అధికారాన్ని రెండు వేలకు అమ్ముకుంటున్నాం. రోజుకు రూపాయికి మన ఓటు అమ్ముకుంటే ఎప్పటికీ మనకు రాజ్యాధికారం దక్కదు. బీసీలు, ఎస్టీ, ఎస్సీలు ఎదగడం అంటే వేరే వాళ్లను తగ్గించడంకాదు. బీసీ సదస్సు అంటే అందరూ వస్తారు. కానీ బీసీ అభ్యర్థిని నిలబెడితే ఎందుకు అందరూ కలిసిరారు." - పవన్ కల్యాణ్
26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించడంపై బీఆర్ఎస్ స్పందించాలి
బీఆర్ఎస్ పార్టీ ఏపీకి వస్తే జనసేన పార్టీ ఆహ్వానించిందని పవన్ కల్యాణ్ తెలిపారు. తెలంగాణలో 26 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించడంపై బీఆర్ఎస్ స్పందించాలని ప్రశ్నించారు. ఈ అన్యాయంపై బీఆర్ఎస్ తప్పకుండా వివరణ ఇవ్వాలన్నారు. బీసీ కులాల తొలగింపుపై వైసీపీ, టీడీపీ కూడా స్పందించాలని పవన్ కోరారు. బీసీలకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. చట్టసభల్లో సంఖ్యా బలం లేని బీసీ కులాలకు ఏం చేయగలమనే దానిపై ఆలోచిస్తామన్నారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. తనను ఒక కులానికి మాత్రమే పరిమితం చేసి బీసీ నాయకులతో తిట్టిస్తున్నారన్న పవన్...తాను కాపులకు మాత్రమే నాయకుడ్ని కాదన్నారు. అన్ని కులాలకు నాయకుడినని పవన్ చెప్పారు.
గన్నవరం విమానాశ్రయం చేరుకున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. మరికొద్ది నిమిషాల్లో మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరుగుతున్న BC రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు. pic.twitter.com/cZM0zPVw0k
— JanaSena Party (@JanaSenaParty) March 11, 2023