Chandrababu : వైసీపీ ప్రభుత్వ రౌడీయిజానికి మాచర్ల దాడులే నిదర్శనం- చంద్రబాబు
Chandrababu On Macherla Tension : మాచర్లలో టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నేతలు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
Chandrababu On Macherla Tension : మాచర్ల పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతల ఇళ్లు, పార్టీ ఆఫీసుపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. టీడీపీ ఇన్ ఛార్జ్ బ్రహ్మారెడ్డి ఇంటికి దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటన టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. మాచర్ల పరిస్థితులపై గుంటూరు డీఐజీకి చంద్రబాబు ఫోన్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ గూండాలకు సహకరించిన పోలీసు సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. మాచర్లలో టీడీపీ శ్రేణులపై వైసీపీ గూండాల దాడులు, పార్టీ నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాలకు నిప్పు పెట్టిన ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అధికార పార్టీ రౌడీయిజానికి పోలీసులు కొమ్ము కాయడం ఇంకా దారుణమన్నారు. వైసీపీ నేతలు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఎస్పీ, డీజీపీ ఎక్కడ ఉన్నారు? ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితికి ఇది అద్దం పడుతుందన్నారు. ఇలాంటి చర్యలకు వైసీపీ నేతలు ఇంతకు ఇంత మూల్యం చెల్లించక తప్పదన్నారు.
వైసీపీ అరాచక పాలనకు నిదర్శనం -లోకేశ్
ఏపీలో వైసీపీ అరాచక పాలనకు మాచర్ల ఘటన నిదర్శమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ రౌడీ మూకలు పోలీసుల సహకారంతో మరోసారి టీడీపీ శ్రేణులపై దాడికి పాల్పడటం దారుణమని నారా లోకేశ్ ఆరోపించారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ వారిపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడటం రాష్ట్రంలో అరాచక పాలనకి నిదర్శనమన్నారు. దాడి చేసిన వైసీపీ గూండాలను వదిలేసిన పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చెయ్యడం, మాచర్ల టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని అదుపులోకి తీసుకోవడం వైసీపీకి కొమ్ముకాయడమే అన్నారు. టీడీపీ వర్గీయుల కార్లు, ఇళ్లు తగలబెట్టి, దాడులకు పాల్పడిన వైసీపీ కార్యకర్తలను తక్షణమే అరెస్టు చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. వైసీపీ మూకల దాడిలో గాయపడిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని లోకేశ్ ప్రకటించారు.
మాచర్ల పిన్నెల్లి జాగీరా? - అచ్చెన్నాయుడు
మాచర్ల ఏమైనా పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి జాగీరా? ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమాలు చేయకూడదా? అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. టీడీపీ ఇన్ ఛార్జ్ బ్రహ్మారెడ్డిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే బ్రహ్మారెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐదుకార్లు ధ్వంసం చేసి, టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామిరెడ్డి దగ్గరుండి టీడీపీ కార్యాలయంపై దాడి చేయించారని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలో దాడి చేస్తుంటే చూస్తూ ఉండటం దుర్మార్గమన్నారు. టీడీపీ సానుభూతి పరుల షాపులను కూడా తగలబెట్టారని ఆరోపించారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వెళ్తోన్న బ్రహ్మారెడ్డికి వైసీపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. మాచర్లను గూండాగిరితో మూడున్నరేళ్లుగా చేతిలో పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రజల నుంచి తిరుగుబాటు మొదలవడంతో విధ్వంసాలు చేస్తున్నారన్నారు. వైసీపీ నేతల దుశ్చర్యలను పోలీసులు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. బ్రహ్మారెడ్డి ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. బ్రహ్మారెడ్డికి చిన్నపాటి అపాయం కలిగించినా టీడీపీ కార్యకర్తలతో పిన్నెల్లి ఇంటిని ముట్టడిస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. బ్రహ్మారెడ్డిని చూసి పిన్నెల్లి ప్రతి రోజూ భయపడుతూ బ్రతుకుతున్నారన్నారు. ఖబడ్దార్ పిన్నెల్లి నీ పని అయిపోయిందన్నారు.
టీడీపీ నేతలే తగలబెట్టారు -ఎమ్మెల్యే పిన్నెల్లి
మాచర్ల ఘర్షణ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. వైసీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. అయితే పరిస్థితులు అదుపుతప్పడానికి టీడీపీ నేతలే కారణమన్నారు. వైసీపీ కార్యకర్తలపై దాడులకు దిగారని అందుకే ఆ ఘర్షణ వాతావరణం ఏర్పడిందన్నారు. టీడీపీ నేతలే తగలబెట్టుకుని మాపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలే భయాబ్రాంతులకు గురిచేశారన్నారు.