వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పి, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయండి
వైసీపీ గర్జన పేరుతో రాయలసీమపై అధికార పక్షం అన్యాయానికి తెగబడుతుందని ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్థసారథి వ్యాఖ్యానించారు.
రాయలసీమ గర్జన రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమమని బీజేపి మండిపడింది. వైసీపీ గర్జన పేరుతో రాయలసీమపై అన్యాయానికి అధికార పక్షం తెగబడుతుందని ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్థసారథి వ్యాఖ్యానించారు. రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు రేపేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుందని, వాటిని అడ్డుకుంటామని హెచ్చరించారు.
రాయలసీమ గర్జనపై బీజేపీ కౌంటర్...
వైసీపీ ప్రభుత్వం రాయలసీమను అభివృద్ధి చేయలేక ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ‘రాయలసీమ గర్జన' పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా కొత్త నాటకానికి తెర లేపడం సిగ్గుచేటని బీజేపీ నేతలు అన్నారు. అన్యాయానికి గురైన వాళ్ళు నిరసన తెలుపుతూ సభలు పెడతారు, కానీ రాయలసీమకు అన్యాయం చేసినవాళ్లే సభలు పెట్టి నిరసన తెలపడం విడ్డురంగా ఉందని ఆ పార్టి నేత పార్దసారథి ధ్వజమెత్తారు. కర్నూలో హైకోర్టు ఏర్పాటుకు మద్దతు తెలిపింది మొదటగా బీజేపీ అనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వైఎస్సార్‌సీపీ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రజలకు చెబుతూ మోసం చేస్తోందన్నారు. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే - హైకోర్టు కర్నూల్లో పెడతామని ఇంతవరకు కేంద్రానికి & సుప్రీంకోర్టుకు, మంత్రిత్వ శాఖకుకు గత 3 సంవత్సరాలలో ఎందుకు ప్రతిపాదనలు పంపలేదని పార్థసారథి ప్రశ్నించారు.
గత వారం సుప్రీంకోర్టులో ప్రభుత్వ న్యాయవాది వేణుగోపాల్ హైకోర్టు అమరావతిలోనే ఉండాలన్నది ప్రభుత్వ కోరిక అని చెప్పడం నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. మీకు రాయలసీమ న్యాయ రాజధాని ఏర్పాటుపై చిత్తశుద్ధి ఉంటే కర్నూలు లో ఏర్పాటు కావలసిన జ్యుడీషియల్ అకాడమీని మంగళగిరికి ఎందుకు తరలించారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కర్నూలు లో ఏర్పాటు కావలసిన కృష్ణా రివర్ బోర్డుని విశాఖకు ఎందుకు తరలించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మిషన్ రాయలసీమ గతి ఎంటీ...
వైసీపీ ప్రభుత్వం RDMP ( రాయలసీమ దుర్భిక్ష నివారణ కమిషన్ ) పేరుతో రాయలసీమలోని 23 ప్రాజెక్టులను రూ.33,862 కోట్లతో అభివృద్ధి చేస్తామని గతంలో ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గత మూడున్నర సంవత్సరాలలో RDMP కోసం నిధులు కేటాయించకుండా సీమ ప్రజలను మరోసారి మోసం చేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీ మేరకు RDMP కి నిధులు మంజూరు చేయకపోవడం కారణంగా వ్యవసాయ పనులు లేక , రైతు కూలీలు వలసలు పోతున్నారని, అలాంటి వారి ఉపాధి కోసం ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. గతంలో జగన్ ప్రజల సమక్షంలో పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం, కేసి కేనాల్ ఆధునికీకరణ, హంద్రీనీవా కాలువ విస్తరణ, సిద్దేశ్వరం, అలుగు, వేదావతి వంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీలను ఇంతవరకు ఎందుకు నెరవేర్చలేదో సీమ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
కడప ఉక్కు ఫ్యాక్టరీ పై క్లారిటీ ఇవ్వండి... బీజేపి
డిసెంబర్ 23వ తేదీ నాటికి జగన్ కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి 3 సంవత్సరాలు అవుతోందని తెలిపారు. అయితే ఇంత వరకు ఎందుకు మొదలవలేదని, ఎప్పుడు పూర్తి చేస్తారో స్పష్టం చేయాలన్నారు. సీమ యువతకు ఉద్యోగాలు రావడం మీకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటు, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని వెనుకబడేలా చేసిన వైసీపీ ప్రభుత్వం, నేడు రాయల సీమను అభివృద్ధి చేస్తామని చెప్పి డ్రామాలు ఆడడం ఎంత వరకు సమంజసమన్నారు. వైసీపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందుగా రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పి, యుద్ధ ప్రతిపాదికన రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని బీజేపి డిమాండ్ చేసింది.