YS Viveka Case: నాకేమైనా జరిగితే సీఎం జగనే కారణం! వైఎస్ వివేకా కేసులో అప్రూవర్ ఆవేదన
వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న తనకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాల్సి ఉందని, అలాంటిది చెప్పాపెట్టకుండా గన్ మెన్లను మార్చడం ఏంటని ప్రశ్నించారు.
మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరికి కేటాయించిన గన్ మెన్లను ఉన్నట్టుండి మార్చడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరికీ చెప్పాపెట్టకుండా, కనీసం తనకు కూడా సమాచారం ఇవ్వకుండా గన్ మెన్లను మార్చాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏం వచ్చిందని ప్రశ్నించారు. ఈ మార్పుపై ఆయన సోమవారం (అక్టోబరు 10) వైఎస్ఆర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తనకు గన్ మెన్లను మార్చడంపై మీడియాతో మాట్లాడారు.
తనకు కనీస సమాచారం ఇవ్వకుండా గన్ మెన్లను మార్చడంపై దస్తగిరి అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ విషయం తనకు సంబంధం లేదని, ఎవరికి వారు దాటవేస్తున్నారని అన్నారు. అందుకని ఈ విషయాన్ని సీబీఐ అడిషనల్ ఎస్పీ రామ్ సింగ్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశానని, దాంతో ఆయన వెంటనే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని తనకు చెప్పారని అన్నారు.
వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న తనకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాల్సి ఉందని, అలాంటిది చెప్పాపెట్టకుండా గన్ మెన్లను మార్చడం ఏంటని ప్రశ్నించారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం ఏం చేయబోతోందని అన్నారు. తనకు ఏమైనా జరిగితే సీఎం జగన్‌దే పూర్తి బాధ్యత అని దస్తగిరి అన్నారు. తొండూరు మండలంలో కొందరు వైఎస్ఆర్ సీపీ నేతలు తనను టార్గెట్ గా చేసుకుని పోలీస్ కేసులు పెడుతున్నారని చెప్పారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి కూడా ఎస్పీకి గతంలోనే చాలా సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. కొత్తగా వచ్చిన గన్ మెన్ల తీరుపైన కూడా అనుమానాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు.
గన్ మెన్లను మార్చడంపై స్పందించిన ఎస్పీ
దస్తగిరికి ఉన్నట్టుండి గన్ మెన్లను మార్చడంపై వైయస్‌ఆర్ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను మీడియా ప్రతినిధులు వివరణ కోరారు. అయితే, గన్ మెన్లను మార్చడం అనేది అడ్మినిస్ట్రేటివ్ అంశమని ఆయన చెప్పారు. తొండూరులో దస్తగిరి కుటుంబ సభ్యులు, ఇతర వ్యక్తుల మధ్య ఘర్షణ సమయంలో గన్ మెన్లు సరిగా స్పందించలేదని తమకు తెలిసిందని అన్నారు. అందువల్లే వారిని తప్పించి కొత్త వారిని నియమించామని చెప్పారు. దస్తగిరి చేస్తున్న వాదనల్లో నిజం లేదని, ఆయన ఆరోపణలు అవాస్తవం అని చెప్పారు.