Lepakshi : డెడ్‌బాడీ పూడ్చేందుకు గ్రామస్థుల అభ్యంతరం.. బాధితులు చేసిన పనికి బిత్తరపోయిన పోలీసులు, గ్రామస్థులు, అధికారులు
ఇంట్లో వ్యక్తి కాలం చేశాడని పుట్టెడు దుఃఖం. ఆ వ్యక్తిని తాహతకు తగ్గట్టు అంత్యక్రియలు చేయడానికి కులమో, అధికార బలమో అడ్డొస్తే ఏం చేయాలి. అలాంటి ప్రశ్నే ఓ నిరుపేద కుటుంబానికి ఎదురైంది.
అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కొండూరులో దారుణం జరిగింది. మాల కొండప్ప అనే వ్యక్తి చనిపోయాడు. పూడ్చిపెట్టేందుకు ఎప్పటి మాదిరిగానే ఊరి బయట ఉన్న శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లి అంత్యక్రియలు చేస్తుంటే ఓ బ్యాచ్ వచ్చింది ఆపండి అంటూ.
అలా అడ్డుకోవడానికి వచ్చిన వాళ్లంతా కొండూరుకు చెందిన వ్యక్తులే. దీన్ని చూసిన కొండయ్య బంధువులు, ఆ గ్రామ ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాళ్లకు అర్థం కాలేదు. ఎందుకు అంత్యక్రియలు ఆపమన్నారో. తమ భూమిలో బయట వ్యక్తుల అంత్యక్రియలు చేయడమేంటని ఆ బ్యాచ్‌లో ఒకడు గట్టిగా అరిచాడు. ఎనభై ఏళ్లుగా ఇదే శ్మశానవాటికలో అంత్యక్రియలు తంతు నడుస్తోంది. ఆ స్థలాన్ని దాని కోసమే ఊరంతా వాడుకుంటోందని ఈ విషయం మీకు తెలుసుకదా అని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కొండయ్య బంధువులు.
కొండూరు ప్రజలు ఏం చెప్పినా ఆ బ్యాచ్ మాత్రం వినడం లేదు. తమకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని.. ఇలాంటి పట్టా భూముల్లోశవాన్ని ఎలా పూడ్చిపెడతారంటూ అడ్డుకున్నారు. ఇవేమీ తమకు తెలియవని... పుట్టెడు దుఃఖంలో ఉన్నామని.. ఇలాంటి వాటికి అడ్డుపడొద్దని ప్రాధేయపడిందా ఫ్యామిలీ.
వచ్చిన వాళ్లకు కొండయ్య ఫ్యామిలీ ఏడుపులు అసలే వినపడలేదు. వేరే ఎక్కడైనా చేసుకోండి కానీ.. ఆ భూమిలో చేయడానికి మాత్రం ఒప్పుకోమంటూ తెగేసి చెప్పేశారు.
మనిషి లేడు.. ఖననం కూడా చేయనివ్వడం లేదు. అప్పటి వరకు కంటనీరు పెట్టిన కొండయ్య ఫ్యామిలీ, బంధువులు నిప్పులు కురిపించింది. శవాన్ని కూడా సంస్కారవంతంగా పంపించకుండా అడ్డుకోవడం ఇదెక్కడి సంస్కృతి అంటూనిలదీయడం స్టార్ట్ చేశారు.
దీనికి అధికారులే దిగొచ్చి సమాధానం చెప్పాలంటూ గ్రామ నడిబొడ్డున డెడ్‌బాడీతో ధర్నాకు కూర్చున్నారు. బోరున వర్షం పడుతున్నా లెక్కచేయకుండా న్యాయం కోసం పోరాటం స్టార్ట్ చేశారు.
వచ్చేటప్పుడు పోలీసులు వాళ్లు ఆపే ప్రయత్నం చేసినా బాధితులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఖాకీలను నెట్టుకుంటూ దూసుకెళ్లారు. తమను అడ్డుకున్నప్పుడు రాని వ్యక్తులు ఇప్పుడెందుకు వచ్చారంటూ అక్కడి వాళ్లంతా ఏకమై డెడ్‌బాడీని ఊరిలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత శవాన్ని తాహసిల్దార్ కార్యాలయానికి తరలించారు. అక్కడా ధర్నా చేశారు.
దళితులమనే తమను కించపరుస్తున్నారని ఆరోపిస్తున్నారు కొండయ్య బంధువులు. ఎప్పుడు ఎలాంటి పనులు ఉన్నా తమను పిలుస్తారని.. అన్ని కూలీ పనులు తమతో చేయించుకుంటారని ఇప్పుడు శవాన్ని పూడ్చేందుకు మాత్రం అడ్డు చెప్పారని విమర్శిస్తున్నారు. తాతల కాలం నుంచి అదే ప్రాంతంలో అంత్యక్రియలు జరుగుతున్నాయని.. సడెన్‌గా ఇప్పుడే ఎందుకు అడ్డుచెబుతున్నారని సమాధానం చెప్పాలని... దీనికి కారణమైన వారిని శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి
గతంలో పనిచేసిన ఓ తాహసిల్దార్ 80 సెంట్ల స్థలంలో కొంత భాగాన్ని అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు రాజగోపాల్ రెడ్డికి పట్టాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ స్థలమే వివాదస్పదంగా మారిపోయింది.